తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతన్న వేళ అన్ని రాజకీయ పార్టీల్లో కలవరపాటు మొదలైంది. పైకి మేమంటే మేమే అధికారంలోకి రాబోతున్నామని గంభీర ప్రకటనలు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ లోలోన మాత్రం అన్ని పార్టీలకు భయం పట్టుకుంది. వంద సీట్లు గ్యారెంటీగా వస్తాయని చెబుతున్న టిఆర్ఎస్ పార్టీని హంగ్ అనే ఒక్క మాట భయపెడుతున్నది. ఆ పార్టీతో పాటు ప్రజా కూటమిని సైతం అదే మాట గజ్జున వణికిస్తున్నది. దీంతో తెలంగాణ రాజకీయాలు కౌంటింగ్ కు 24 గంటల ముందే సెగలు రేపుతున్నాయి. హంగ్ వస్తే కింగ్ అయ్యేలా కాంగ్రెస్ కూటమి స్కెచ్ రెడీ చేసింది. కాంగ్రెస్ పార్టీలో అపర కుబేరుడిగా ఉన్న కర్ణాటక కీలక నేతను రంగంలోకి దింపింది.
గత చేదు అనుభవాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ హంగ్ పరిణామాలను ఎదుర్కొనేందుకు వేగంగా పావులు కదుపుతున్నది. హంగ్ లో కింగ్ కావాలంటే ఏం చేయాలన్నదానిపై పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని స్కెచ్ వేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఆగర్భ శ్రీమంతుడు, కోటాను కోట్ల రూపాయలకు అధిపతి అయిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కీలక నేత, ఆ రాష్ట్ర మంత్రి డికె శివకుమార్ ను బరిలోకి దింపారు. ఆయన సోమవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన ఎన్నికల సమయంలోనూ తెలంగాణలో పర్యటించి అన్నిరకాలుగా అభ్యర్థులకు సాయం చేసినట్లు చెబుతున్నారు. ఆర్థిక బలం లేని అభ్యర్థులకు చేదోడు వాదోడుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను బరిలోకి దింపి రేపటి ఎన్నికల్లో గెలవబోతారని చెబుతున్న ఇండిపెండెంట్ల మీద ఆ పార్టీ వల వేస్తున్నది.
మరోవైపు టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలపైనా కాంగ్రెస్ వల విసురుతున్నది. టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ టిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ కాల్ చేసి హంగ్ వస్తే కాంగ్రెస్ కు సపోర్ట్ చేయాలని కోరినట్లు తెలిసింది. ఈ విషయమై మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో మర్రి జనార్దన్ రెడ్డి మీడియాకు వివరించారు. టిఆర్ఎస్ నేతలను ముందుగానే లాక్కునే ప్రయత్నాలు చేస్తోందని టిఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు హంగ్ వచ్చే పరిస్థితే ఉంటే టిఆర్ఎస్ కంటే ఒక సీటు కూటమికి ఎక్కువ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించేలా చేయాల్సిన కార్యాచరణ మొత్తం సోమవారం చేసేసింది. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఒకవేళ హంగ్ వచ్చి కూటమికి ఎక్కువ సీట్లే వస్తే కచ్చితంగా తమ సమూహాన్ని ఆహ్వానించాలంటూ గవర్నర్ నరసింహన్ ను కోరింది కాంగ్రెస్ పార్టీ. సోమవారం మధ్యాహ్నం కూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎల్ రమణ, కోదండరాం, సిపిఐ నేతలు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ తో భేటీ అయ్యారు. గతంలో హంగ్ వస్తే జరిగిన పరిణామాలు, సుప్రీంకోర్టు తీర్పులను గవర్నర్ నోటీసుకు తీసుకుపోయారు. అంతేకాకుండా తాము ఎన్నికల ముందే కూటమి కట్టాము కాబట్టి తమ సమూహాన్ని ఒక పార్టీగానే పరిగణించాలని కోరారు.
ఇదిలా ఉంటే హంగ్ వచ్చే పరిస్థితే ఉంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తన ఫ్రెండ్లీ పార్టీ అయిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకున్నది. వంద సీట్లు గెలవబోతున్నామని చెబుతున్నవారు ఎంఐఎం సపోర్ట్ తో గట్టెక్కాలని భావిస్తున్నారంటూ కాంగ్రెస్ విమర్శకు దిగుతున్నది. ఈ భేటీ ఇక్కడ జరుగుతండగానే కూటమి నేతలు గవర్నర్ ను కలిశారు.
మొత్తానికి తెలంగాణ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. హంగ్ అనే మాటతో అన్ని పార్టీలు గడగడ వనికిపోతున్నాయి. ఈ ఉత్కంటకు అతి కొద్ది గంటల్లోనే తెర పడనుందా? లేదంటే హంగ్ వచ్చి మరింత ఉత్కంఠ షురూ కానుందా అన్నది చూడాలి.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ పై టిఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..?
తెలంగాణ భవన్ లో మంత్రి లక్ష్మా రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జీవన్ రెడ్డి , ఎమ్మెల్సీ లు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. వారేమన్నారో చదవండి.
మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ…
కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోంది. కూటమి ఏర్పాటు తో నీచ రాజకీయాలకు పాల్పడ్డ కాంగ్రెస్ ఇపుడు ప్రలోభాలకు తెరలేపింది. కాంగ్రెస్, టిఆర్ఎస్ లకు చెరి సగం సీట్లు వస్తున్నాయంటూ తమకు ప్రభుత్వ ఏర్పాటు లో సహకరించాలంటూ ఓ కాంగ్రెస్ నేత మా నాగర్ కర్నూల్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి కి ఫోన్ చేశారు. కాంగ్రెస్ కు సీట్లు రానే రావు. టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీ తో రాబోతున్నది. ఇలాంటి ప్రలోభాలను కాంగ్రెస్ వెంటనే ఆపాలి.
మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ…
నాకు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి కాంగ్రెస్ లోకి రమ్మని ప్రలోభ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. మేము కెసిఆర్ సైన్యం లో ఉన్నాం. మాకు 80 నుంచి 90 సీట్లు వస్తాయని విశ్వేశ్వర్ రెడ్డి తో చెప్పాను. ఇలాంటి నీచమైన ప్రలోభాలు మంచివి కావని చెప్పాను. రెండు సార్లు ఫోన్ చేసినా అదే చెప్పాను. చంద్రబాబు దర్శకత్వం లోనే ఇదంతా జరుగుతోంది. కెసిఆర్ సీఎం కావాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారు. కెసిఆర్ ను ఎవ్వరూ వీడే ప్రసక్తి లేదు. ఇలాంటి వెకిలి చేష్టలు కాంగ్రెస్ మానుకోవాలి. నాకు విశ్వేశ్వర్ రెడ్డి మొదటి వాట్సాప్ కాల్ ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 2 .07 గంటలకు, రెండో కాల్ మధ్యాహ్నం 2 .56 కు చేశారు. .9490861960 నంబర్ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇక ముందు ఇలాంటి కాల్స్ చేయొద్దని చెప్పాను.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ…
ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి జూనియర్ రేవంత్ రెడ్డి గా మారారు. టిఆర్ఎస్ నేతలు నిప్పు లాంటోళ్ళు. మా వాళ్ళ ని కాంగ్రెస్ నేతలు టచ్ చేస్తే చేతులు కాలిపోతాయి. టిఆర్ఎస్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. కాంగ్రెస్ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.