తెలంగాణ కేబినేట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్

తెలంగాణ కేబినేట్ విస్తరణ పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు 30 వ తారీఖు ముగియనున్నాయి. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31 లేదా ఫిబ్రవరి 10 వ తేదిన మంచి ముహూర్తాలు ఉండడంతో మంత్రి వర్గ విస్తరణ ఈ రెండు తేదిల్లో ఏదో ఒక రోజు ఉండవచ్చని అంతా భావిస్తున్నారు.

రాజ్ భవన్ లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో ఏకాంతంగా గంట పాటు  చర్చించారు. ఇందులో ముఖ్యంగా మంత్రి వర్గ విస్తరణ, ఎమ్మెల్సీ ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కేబినేట్ లోకి ముందుగా 8 మందిని తీసకొని లోక్ సభ ఎన్నికల తర్వాత మరో ఐదుగురిని తీసుకోనున్నారని తెలుస్తోంది. సహస్ర చండీయాగం విజయవంతంగా ముగియడం, ,పంచాయతీ ఎన్నికల్లో కూడా కారు జోరు కొనసాగడంతో ఇక ప్రభుత్వ ఏర్పాటు పై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు.

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకం చేపట్టాల్సి ఉందని, ఖాళీలపై ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వగానే పేర్లను ప్రతిపాదిస్తామని, వాటికి ఆమోద ముద్ర వేయాలని గవర్నర్ ను సీఎం కేసీఆర్ కోరినట్లు సమాచారం.

ఈ నెల 30తో పంచాయతీ ఎన్నికలు ముగుస్తుండటంతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. మార్చి మొదటి వారంలోగా లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ లోగా ఫిబ్రవరి మూడో వారంలోగా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉన్నందున ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుదని భావిస్తున్నారు.. యాగం ముగిసిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి మంచిదని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారట. జనవరి 31 తిథి పరంగా పుష్య మాసం బహుళ ఏకాదశి, గురువారం రోజు మంచి ముహూర్తమని అదే రోజు మంత్రి వర్గ విస్తరణ చేస్తారని అంటున్నారు. అది తప్పితే ఫిబ్రవరి 10 న మంచి రోజు ఉంది. దీంతో ఈ రెండు రోజుల్లో ఏదో ఓ తేదిన ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. 

ఈ సారి కొత్త వారికి ప్రముఖ స్థానం కల్పించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గత కేబినేట్ లో చేసిన కొంత మంది సీనియర్లకు మొండిచేయి తప్పదని తెలుస్తోంది. ప్రతిసారి సీనియర్లకే పట్టం కడితే రెండు మూడు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారి పరిస్థితి ఏంటని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కేబినేట్ కూర్పు చేయాలని సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్తవారికి రెండో విడత కేబినేట్ విస్తరణలో ప్రాముఖ్యం ఇవ్వనున్నారు. 

కేబినేట్ వీరికి ముందుగా అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది

కడియం శ్రీహరి

హరీష్ రావు

ఈటల రాజేందర్

కేటిఆర్

జగదీష్ రెడ్డి

పద్మా దేవేందర్ రెడ్డి

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

తలసాని శ్రీనివాస్ యాదవ్ లేదా పద్మారావు గౌడ్