తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే బీజేపీపై ఊహించని కామెంట్స్ పెరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నిర్ణయాల్లో ఆలస్యం చేస్తుందని ఎద్దేవా చేసిన కమలం పార్టీ, ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి నియామకంపై నెలలుగా స్పష్టత లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసహనం వ్యక్తమవుతోంది. నాయకత్వ మార్పు తేలిపోయేలా సంకేతాలు వచ్చినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడం పార్టీ గడ్డు పరిస్థితిని తలపిస్తోంది.
కిషన్ రెడ్డి రెండు పదవులు కలిగి ఉండటమే ప్రధాన సమస్యగా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన రాష్ట్ర బీజేపీ చీఫ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయితే, ఎనిమిది నెలలుగా కొత్త అధ్యక్షుడిని ప్రకటించకపోవడంతో తెలంగాణ బీజేపీ కార్యాచరణలో స్పష్టత లేకుండా పోయింది. జనవరిలో కొత్త అధ్యక్షుడు ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పుడు కొన్ని రోజుల అనంతరం చూస్తామని చెబుతున్నారు. ఈ గందరగోళం వల్ల పార్టీ శ్రేణులు నిరాశకు గురవుతున్నాయి.
ఇదే సమయంలో బీజేపీ గ్రాఫ్ క్షీణిస్తున్నా, కేంద్ర నేతలు సరైన నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. తెలంగాణలో పార్టీని పటిష్ఠంగా నిలబెట్టాలంటే మేనేజ్‌మెంట్ మెథడ్స్ కంటే, గట్టి నాయకత్వం అవసరం. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ తరహాలో నాన్చే ధోరణిని అవలంభించడం పార్టీకి మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్‌ను ఎప్పుడూ నిర్ణయాల్లో ఆలస్యం చేస్తుందని విమర్శించిన బీజేపీ, ఇప్పుడు అదే విమర్శలను ఎదుర్కొంటుండటం హాట్ టాపిక్ గా మారింది.
ఈ పరిణామాలతో బీజేపీ లోపలే అసంతృప్తి చెలరేగుతోంది. పార్టీకి కొత్త నాయకత్వం అవసరమని, త్వరగా నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఆలస్యం చేసుకుంటూ పోతే తెలంగాణలో బీజేపీకి ఎదురైన అవకాశాలు చేజారిపోవడం ఖాయమని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి, కమలం పార్టీ ఎప్పుడు స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.