కేసిఆర్ కు దమ్ముంటే దీనిపై మాట్లాడాలి : టిడిపి రేవూరి

సెప్టెంబర్ 2న  టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించబోయే ప్రగతి నివేదన సభలో గత ఎన్నికల మేనిఫెస్టో వాగ్దానాలపై జవాబు చెప్పాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హన్మకొండ భవాని నగర్ లోని ఉమ్మడి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి గత 4 సంవత్సరాల 3నెలల పాలనలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.  ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చారో మీకు ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఏమాత్రం నమ్మకం ఉన్నా సెప్టెంబర్ 2న నిర్వహించే ప్రగతి నివేదన సభలో వెల్లడించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవూరి ప్రకాశ్ రెడ్డి సవాల్ విసిరారు.

ఎన్నికల మేనిఫెస్టో తనకు భగవద్గీత అని, తన టేబుల్  డ్రా లో పెట్టుకుని రోజూ చూస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అవి ఎంత మేరకు అమలు చేశారో చెప్పాలన్నారు. బలహీనవర్గాల గృహ నిర్మాణం పై మీ మేనిఫెస్టోలో పేజీ నంబర్ 14లో చెప్పిన విషయాన్ని గుర్తున్నాయా? లేక మమ్మల్ని గుర్తు చేయమంటారా అని నిలదీశారు. బలహీనవర్గాలకు గౌరవప్రదమైన నివాసగృహాలు దేశ చరిత్రలోనే వినూత్నంగా ప్రతిష్టాత్మకమైన గృహ నిర్మాణ పథకం ప్రకటిస్తున్నామని మేనిఫెస్టోలో తెలిపారని అన్నారు. ఒకే ఒక గదిలో భార్య భర్త పిల్లలు ఏ విధంగా నివాసముంటున్నారు అని ప్రతి నిరుపేదకు 125 గజాల స్థలం లో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన వాగ్దానం 4 సంవత్సరాలుగా 3 నెలలు గడిచి నా ఇప్పటివరకు నెరవేర్చిన పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 2,37,000 ఇల్లు నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుని గృహనిర్మాణ హామీ ఇస్తే ఇప్పటి వరకు పూర్తి చేసినవి కేవలం 5183 మాత్రమే అన్నారు. ఇక ఐదేళ్లలో మిగిలిన కొద్ది సమయంలో ఏ విధంగా మిగతా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.

మీడియా సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి

ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కేసిఆర్ కోల్పోయామని అన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న ఇంద్రకరణ్రెడ్డి కి చెందిన సొంత నియోజకవర్గం లో ఒక్క ఇల్లు నిర్మించలేదని మొత్తం 31 జిల్లాలలో 15 జిల్లాల్లో ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టించి ఇవ్వలేదన్నారు. ముమ్మాటికీ ఇది నిరుపేదలను మోసం చేయడమేనని ప్రకాష్ రెడ్డి అన్నారు. గృహ నిర్మాణం పేరుతో హడ్ కో నుండి 1200 కోట్లు ప్రభుత్వము డ్రా చేసిందని కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 186786 రెండు విడతలుగా ఇల్లు మంజూరు చేస్తూ1594 కోట్లు నిధులు విడుదల చేసిందని మొత్తం 2794కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నిధులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. మిషన్ కాకతీయకు లేదా రీడిజైన్ కొరకు ఖర్చు పెట్టారా అని ప్రకాశ్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు.

2015 జనవరి నెలలో ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్లో రెండు రాత్రులు మూడు రోజులు గడిపి ఆరు మురికివాడల్లో పర్యటించి జి ప్లస్ వన్ ఇండ్లు నిర్మించి ఇస్తానని ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు వస్తానని అన్న విషయాన్ని రేవూరి గుర్తు చేశారు. జనాలు దావత్ ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగి మరీ ఇచ్చిన హామీకి కట్టుబడి లేదంటే ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసిఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి వాగ్దానంపై తెలుగుదేశం పార్టీ తరుపున నిలదీస్తూనే ఉంటామన్నారు. మీరిచ్చిన వాగ్దానాలలో ప్రధానమైన వాటిలో రోజుకో వాగ్దానంపై ప్రెస్ మీట్ పెట్టి బండారం బయట పెడతామన్నారు. ప్రగతి నివేదిన  సభలో ప్రభుత్వపరంగా వైట్ పేపర్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను డిమాండ్ చేశారు. లేనట్లయితే ప్రజలు మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో తరిమికొడతారని ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

ఈ విలేకరుల సమావేశంలో జనగామ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్ గారు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాటీతో  సంతోష్ నాయక్  ఎస్సీ సెల్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు అనుమకొండ సాంబయ్య  వరంగల్ గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏంది రహీం రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి జయపాల్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం టిఎస్ఎన్వి రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ నాయకులు  బానోతు వీరన్న నాయక్ ఈశ్వర్ ఆచారి మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.