సెప్టెంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ప్రగతి నివేదన సభ ప్రజలను మభ్య పుచ్చడానికే నని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ భవానీనగర్‌లోని ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం రేవుారి మీడియా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ముందు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రైతు సంక్షేమానికి సంబంధించి అద్భుతమైనటు వంటి ప్రణాళిక నా దగ్గర ఒకటి ఉందని, విత్తన భాండాగారంగా తెలంగాణను రూపుదిద్దుతానని, భూసార పరీక్షలు పంటల బీమా రైతుల రుణమాఫీ గిట్టుబాటు ధరలు ఇస్తామని ఇలా అనేక హామీలు ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చారని చెప్పారు. 4సంవత్సరాలు గడిచిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని సెప్టెంబర్ 2న మీరు నిర్వహించనున్న ప్రగతి నివేదన సభలో రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడదల చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని 9వ పేజీలో రైతులందరికీ లక్ష రూపాయల రుణమాఫీ రైతు ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని 10వ పేజీలో తెలంగాణ రాష్ట్రాన్ని ‘సీల్ బోల్ ఆఫ్ ఇండియా”గా మారుస్తానని హామీ ఇచ్చినట్లు చెప్పారు. కరువు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతుల కోసం కొత్త విధానాన్ని రూపొందిస్తామని కల్తీ లేని నాణ్యమైన విత్తనాలను ప్రభుత్వమే అందిస్తుందని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి మార్కెట్ ఇంటర్ వెన్షన్ సదుపాయం కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చి 4సంవత్సరాల 3నెలలు గడిచినా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మీరు రైతులను ఆదుకునేందుకు చేపట్టిన చర్యలు ఏమిటో ప్రగతి నివేదన సభలో ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
రైతు సమగ్ర సర్వే వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. రైతులకు లేనిపోని సమస్యలు సృష్టించి ఆర్థికంగా నష్టపర్చారని రెవెన్యూ అధికారుల జేబులు నింపేందుకు మాత్రమే ఉపయోగపడిందన్నారు. రైతు బంధు పథకం వల్ల వాస్తవంగా సాగులో ఉన్న రైతులకు జరిగిన మేలు ఏమీ లేదని కేవలం భూస్వాములకు కార్పొరేట్ సంస్థలకు మాత్రమే మేలు జరిగిందని అన్నారు. నకిలీ విత్తనాలు ఎరువులతొ ఒకవైపు రైతులు పంటలు నష్టపోతుంటే గిట్టుబాటు ధర లేక ప్రకృతి సహకరించక ప్రభుత్వం సహకరించక అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పట్ల నిర్లక్ష్యం వహించారని ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు.
విడతల వారీగా రుణాలు మాఫీ చేయడంతో ఇచ్చిన నిధులు వడ్డీకి సరిపోయాయని అసలు అప్పుగానే మిగిలి ఉందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వారికి క్వింటానికి ప్రతి రైతుకు ఎకరాకు పంట సీజన్‌కు 4 వేల చొప్పున గత 4సంవత్సరాలుగా మొత్తం 32 వేలు నష్టపోయారని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి సహాయం కింద కేవలం ఎకరానికి 4 వేలు ఇస్తే ఎంత వరకు సరిపోతుందని ప్రశ్నించారు. నియోజకవర్గానికి లక్ష ఎకరాలు రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి అదనంగా ఒక్క ఎకరానికి సాగునీరు అందించకపోగా రీడిజైన్ల పేరుతో లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు భారంగా మిగిల్చారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాయితీతో ఇచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లను అర్హులైన రైతులకు అందించకుండా పార్టీలు మారిన వారికి అలాగే టిఆర్ఎస్ నాయకులకు ఇచ్చారని ఆరోపించారు. ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో తరలి రావాలని పిలుపునివ్వడం సిగ్గు చేటు అని ప్రకాశ్ రెడ్డి అన్నారు
ప్రగతి నివేదన సభలో నిలదీసేందుకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలు సిద్ధంగా ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పేందుకు అన్ని వర్గాల ప్రజలు సన్నద్ధం అయ్యారని ప్రకాశ్ రెడ్డి అన్నారు. ప్రగతి నివేదన సభ అట్టర్ ఫ్లాప్ అవుతుందని ఏ మాత్రం మీకు చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఇచ్చిన హామీలు ఎన్నికల మానిఫెస్టో అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తమ డిమాండ్ స్వీకరించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రకాశ్‌రెడ్డి కోరారు. రైతులు కోరుకునేది పండించిన పంటలకు గిట్టుబాటు ధరలను రైతు బంధు పథకం కాదన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తాండూరు సభలో తీర్మానించి ప్రభుత్వానికి పంపిన నివేదిక ఆధారంగా నైనా రైతులు పండించిన పంటలకు క్వింటాల్ పత్తికి పసుపుకు 8వేలు మిర్చికి 9వేలు మొక్కజొన్నకు1500లు వరికి 2000లు కందికి 7500లు గిట్టుబాటు ధరలు ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. పెట్టుబడి సాయం కింద ఇచ్చే మొత్తాన్ని 4 వేల నుండి సీజన్‌కు ఎకరానికి పది వేలు చెల్లించాలని ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ శాసన సభ్యులు బండి పుల్లయ్య, రాష్ట్ర పార్టీ కార్య నిర్వాహక కార్యదర్శి గట్టు ప్రసాద్ బాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పుల్లూరు అశోక్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ జాటోతు సంతోష్ నాయక్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ బాబా ఖాదర్ అలీ, ఎస్సీసెల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హన్మకొండ సాంబయ్య, గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి ఎండి రహీం, జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి మార్గం సారంగం, జిల్లా నాయకులు బైరపాక ప్రభాకర్ వల్లెపు శ్రీనివాస్, గంటా దేవేందర్‌రెడ్డి, భూక్యా రాజేష్ నాయక్, బానోతు వీరన్న, దుడ్డు సందీప్ పోతరాజు, అనిల్ కాగితాల, జయశంకర్, కొంగర ప్రభాకర్, పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హరికృష్ణకు నివాళులు
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగుదేశంపార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సినీ నటుడు నందమూరి హరికృష్ణ చిత్రపటానికి రేవూరి ప్రకాశ్ రెడ్డితో పాటు టిడిపి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ హరికృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కుమారుడుగా కాకుండా నిబద్ధతతొ కూడిన నిజాయితీ గల నాయకుడిగా పార్టీలో మంచి గుర్తింపు గౌరవం పొందారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని అన్నారు. సీతయ్యయ మరణం తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతికి తీరని నష్టమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు