మహా కూటమికి మహిళా నేత షాక్, రెబెల్ గా బరిలోకి

తెలంగాణ మహా కూటమిలో సీట్ల సర్దుబాటు పక్రియ ఒకవైపు సాగుతుంటే సీట్లు రానివారంతా తమ దారి తాము వెతుక్కుంటున్నారు. దీంతో కూటమి పార్టీల్లో ఉన్న నేతలు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అంతు చిక్కడంలేదు. సీటు రాని నాయకులు, రాదనుకున్న కూటమి నేతలు ఎక్కువ మంది అయితే బిజెపి వైపు చూస్తున్నారు. మరికొందరు బిజెపిలోకి వెళ్లడం ఇష్టంలేక ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి కూటమిని భయపెడుతున్నారు. 

కూటమి రెబెల్స్ సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. తాజాగా టిడిపి మహిళా నేత కూటమి రెబెల్ అవతారమెత్తనున్నారు. ఆమె తనకు సీటు ఇవ్వాలని టిడిపి పెద్ద లీడర్లందరినీ వేడుకున్నారు. కానీ ఆమెకు చేదుకబురే అందింది. పార్టీ అధినేత చంద్రబాబు మొదలుకొని, తెలంగాణ అధ్యక్షులు ఎల్. రమణ వరకు అందరినీ కలిసి తనకు సీటు ఇప్పించాలని కోరుకున్నారు. కానీ వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకూ ఎవరామె? ఎక్కడ బరిలో ఉంటారు అన్న వివరాలివి.

తన మద్దతుదారులతో సమావేశమైన బండ్రు శోభారాణి

బండ్రు శోభారాణి మాజీ మావోయిస్టు నేత. ఆమె, తన భర్త ఇద్దరూ నక్సల్ పార్టీ నుంచి జన జీవన స్రవంతిలో కలిశారు. శోభారాణి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. అయితే ఆమె ఎంఎల్ పార్టీలో ఉండగానే బిసి (యాదవ) సామాజికవర్గానికి చెందిన నేతను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె తొలుత టిఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. తర్వాత దేవేందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ ప్రజా పార్టీలో చేరారు. ఆ  తర్వాత కాలంలో టిడిపిలో చేరారు. ప్రస్తుతం టిడిపి మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఆమె యాదాద్రి జిల్లాలోని ఆలేరు సీటును ఆశిస్తున్నారు. కానీ అక్కడ బిసి సామాజికవర్గానికి చెందిన డిసిసి అధ్యక్షులు బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీకి నల్లగొండ జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా బలమైన రెడ్డి నేతలే ఉన్నారు. దీంతో ఎవరినీ కదిలించలేని పరిస్థితి కాబట్టి ఆలేరు మాత్రమే గౌడ్ సామాజికవర్గానికి చెందిన భిక్షమయ్యకు టికెట్ ఖరారు చేశారు. దీంతో కూటమిలో ఆ సీటును టిడిపి ఎంతగా కోరినా కాంగ్రెస్ పార్టీ నేతలు ఒప్పుకోలేదు. ఆ ఒక్క సీటైనా నల్లగొండలో బిసిలకు ఇవ్వకపోతే రెడ్ల కూటమి అన్న ముద్ర పడి పుట్టి మునిగిపోతుందేమో అని కాంగ్రెస్ భయభ్రాంతులకు గురైంది. అందుకే ఆలేరు సీటును కదిలించే ప్రసక్తే లేదని టిడిపికి తేల్చి చెప్పింది.

ఆలేరు టిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునితారెడ్డి

ఇదే సమయంలో ఆ సీటును ఆశించిన శోభారాణి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇక లాభం లేదనుకుని కూటమి రెబెల్ గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఒక దశలో ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టిడిపి పెద్ద నేతలను కలిసి కంటతడి పెట్టుకున్నారు. అయినప్పటికీ ఆ సీటును కాంగ్రెస్ ససేమిరా అన్నది. దీంతోనే తాను ఎలాగైనా రెబెల్ గా బరిలోకి దిగి తాడో పేడో తేల్చుకుంటానని శోభారాణి ఇండిపెండెంట్ గా పోటీకి దిగబోతున్నారు.

మరి తెలంగాణలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ కల్చర్ ను కాంగ్రెస్ ఇష్టపడుతున్న పరిస్థితుల్లో ఆలేరులో కూడా ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు ఒప్పుకుంటే శోభారాణికి టిడిపి సైకిల్ గుర్తు దొరుకుతుంది. లేదంటే ఇండిపెండెంట్ గా ఏదో ఒక గుర్తుతో పోటీ చేయక తప్పదు. 

గురు, శిష్యూరాలు ఇద్దరూ బరిలో…

మోత్కుపల్లి, శోభారాణి ఇద్దరూ బరిలోకి

ఆలేరులో శోభారాణికి టిడిపిలో గురువు లాంటి వ్యక్తి అయిన మోత్కుపల్లి నర్సింహులు కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నారు. ఆయనకు బిఎల్ఎఫ్ మద్దతు ప్రకటించింది. ఆయన టిడిపికి గుడ్ బై చెప్పిన తర్వాత కాంగ్రెస్ నుంచి కానీ, టిఆర్ఎస్ నుంచి కానీ ఆహ్వానం దొరకలేదు. దీంతో తన సొంత నియోజకవర్గంలో తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నారు. ఆయన ఇప్పటికే ప్రచారం లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన శిష్యురాలైన శోభారాణి కూడా అదే నియోజకవర్గంలో కూటమి రెబెల్ గా బరిలోకి దిగబోతున్నది. ఈ ముగ్గురి ముచ్చట ఇట్లా ఉంటే టిఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతారెడ్డి మీద సొంత పార్టీలోనే కుంపట్లు రాజేస్తున్నారు అసమ్మతివాదులు.

ఈ పరిణామాలన్నీ చూస్తే ఆలేరులో హాట్ పాలిటిక్స్ సాగుతున్నాయని చెప్పవచ్చు.