ఆలేరు కాంగ్రెస్ లో రగిలిన చిచ్చు (వీడియో)

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెబతారు. ఈ జిల్లాలో ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ వాళ్లే ఎక్కువగా గెలుస్తుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కాంగ్రెస్ కు బలమైన పునాదులు ఉన్నాయి నల్లగొండ జిల్లాలో.

కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బలం, బలగం అంతా రెడ్డీలే. ఏ నియోజకవర్గంలో చూసినా రెడ్డి లీడర్లే కనబడుతుంటారు ఈ పార్టీలో. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు లీడర్లు రెడ్డీలే పెద్ద లీడర్లుగా ఉంటారు. వైఎస్సార్ సిఎంగా ఉన్న సమయంలో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి రెడ్డీలంతా దగ్గరయ్యారు. అంతకుముందు కూడా రెడ్డీలే కాంగ్రెస్ పార్టీలో హవా చెలాయించారు.

అయితే జిల్లా మొత్తం బూతద్దం పెట్టి వెతికినా కాంగ్రెస్ పార్టీలో బిసి లీడర్లు పెద్దగా కనబడరు. ఒక్క ఆలేరులో మాత్రం బూడిద భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా నిలదొక్కుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ పెద్ద పోస్టు ఇచ్చింది. ఎఐసిసిలో పదవి ఇచ్చింది. అంతేకాదు యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులుగా నియమించింది. ఆలేరులో మళ్లీ బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

గత ఎన్నికల్లో ఆయన గొంగిడి సునీతారెడ్డి మీద ఓటమిపాలయ్యారు. ఆమె మళ్లీ ఈసారి కూడా ఆలేరులో టిఆర్ఎస్ తరుపున బరిలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో మాత్రం బూడిద భిక్షమయ్య గౌడ్ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది. ఆయనకు తప్ప వేరే ఎవరికీ టికెట్ ఇచ్చేది లేదని కాంగ్రెస్ తేల్చింది. 

ఒకవేళ ఆలేరులో బూడిదను పక్కన పెడితే ఉన్న ఒక్క బిసి సీటు కూడా రెడ్లు గుంజుకున్నారన్న అపవాదు మోయాల్సి వస్తదని పిసిసి ఉత్తమ్ ఇటీవల ఒక మీటింగ్ లో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆలేరులో పోటీ చేసేందుకు అన్ని వనరులు ఉన్న కొందరు రెడ్డి ప్రముఖులు ఉత్తమ్ ను సంప్రదించిన సమయంలో ఇలా మాట్లాడారని చెబుతుంటారు.

అయితే తాజాగా బూడిద భిక్షమయ్య గౌడ్ కు గట్టి షాక్ తగిలేలా ఉంది. ఎందుకంటే స్థానిక యువ నేత ఉదయ్ చంద్ రెడ్డి పోటీకి సై అంటున్నాడు. తాను ఆలేరులో పోటీ చేస్తానని స్పష్టమైన ప్రకటన చేశాడు. పదేళ్లుగా పార్టీ జెండా మోసినట్లు చెప్పారు. తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే పార్టీ తరుపున పోటీ చేస్తానని, రాకపోతే రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగుతానని చెబతున్నారు. 

ఉదయ్ చంద్ రెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రసిడెంట్ గా కూడా పనిచేశారు. బూడిద భిక్షమయ్య గౌడ్ కు ఎఐసిసిలో పదవి, డిసిసి ప్రసిడెంట్ గా పదవి ఇవ్వడంతో పాటు పిసిసిలో కూడా తన సతీమణికే పదవి ఇప్పించుకున్నారని ఉదయ్ ఆరోపించారు. ఇన్ని పదవులు తీసుకుని మళ్లీ ఆలేరు నియోజకవర్గంలో ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు. జనాల్లో పనిచేసిన తనలాంటి వారికి టికెట్ ఇవ్వాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రెబెల్ గా అయినా బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు ఉదయ్.

ఉధయ్ చంద్ రెడ్డి ఏమంటున్నారో కింద వీడియో చూడండి.

 

uday chand reddy