యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నేతలంతా వరుసబెట్టి పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మొన్నటికి మొన్న తుర్కపల్లి జడ్పీటిసి జ్యోతి అయోధ్యరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆమె బహిరంగ లేఖ రాసి ఆ పార్టీని ఎందుకు వీడుతున్నానో వివరించారు.
ఆలేరు టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి గొంగిడి సునితా మహేందర్ రెడ్డి తీరు నచ్చకనే రాజీనామా చేశారు. ఆమెతోపాటు చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. సునితామహేందర్ రెడ్డి అవినీతి అక్రమాలను సహించలేక పార్టీని వీడుతున్నట్లు చెప్పారు.
తాజాగా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో అసమ్మతి చిచ్చు ఇంకా చల్లారలేదు. ఆలేరు నియోజకవర్గంలోని వైస్ ఎంపీపీ, ఎంపిటిసి, సర్పంచులు తమ అనుచరగణం 200 మంది మూకుమ్మడిగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.
అంతేకాకుండా రేపు ఉదయం వరకు మరికొంత మంది రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నేతలు పార్టీని వీడవచ్చని నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది.
తాజాగా రాజీనామా చేసిన వారిలో యాదగిరిగుట్ట 1 ఎంపిటిసి శత్రజ్ఞ, యాదగిరిగుట్ట ఎంపిటిసి 3 వినోద్, కాచారం ఎంపిటిసి అరుణ ఆంజనేయులు ఉన్నారు. గొంగిడి సునీతారెడ్డి నిరంకుశ వైఖరిని నిరసిస్తూ రాజీనామా చేసినట్లు వారు మీడియాకు చెప్పారు.