ప్రగతి భవన్ కు జనగామ అల్లుళ్ల బస్సు యాత్ర, అరెస్ట్

2014 ఎన్నికల సభల్లో కేసిఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయనను ఇరకాటంలో పడేలా చేశాయి. తెలంగాణలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని కేసిఆర్ ప్రతి సభలో జనాలకు చెప్పారు. దీంతో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తదేమో అన్న ఆశతో జనాలు ఓట్లు గుద్దుడు గుద్దారు. దాంతో కేసిఆర్ అధికారంలోకి వచ్చారు. 

పొన్నాల లక్ష్మయ్య వినూత్న కార్యక్రమం

 

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊరికో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించిన పరిస్థితి లేదు. కేవలం కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించారు. దాన్ని చూపించి ఇవిగో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అవిగో అంటూ… జనాలను ఊదరగొడుతున్నారు. దీంతో నాలుగున్నరేళ్లలో తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాకపోవడంతో జనాలు ఊసూరుమంటున్నారు.

 

అల్లుళ్ల బస్సు యాత్రకు జెండా ఊపి ఆరంభించిన పొన్నాల లక్ష్మయ్య

 

ఎన్నికల సభల్లో బిడ్డ అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలె? కోల్లు, మేకలు ఎక్కడ ఉంచుకోవాలె? ఆడవాళ్లు బట్టలు మార్చుకోవాలంటే ఎక్కడ మార్చుకోవాలె? అంటూ పంచ్ డైలాగులు కొట్టారు. ఆ డైలాగులను మరోసారి గుర్తు చేసేలా మాజీ మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

ప్రగతి భవన్ కు బయలు దేరిన జనగామ అల్లుళ్లు

 

తమ అత్త మామకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని ఓట్లేయించుకున్న కేసిఆర్ ఇంకా వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని, వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి అల్లుల్లు అయిన తమ గౌరవాన్ని కాపాడాలంటూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన అల్లుల్లందరూ బస్సులో ప్రగతి భనవ్ కు బయలుదేరారు. వీరి బస్సు యాత్రకు పొన్నాల లక్ష్మయ్య జెండా ఊపి ప్రారంభించారు. 

 

ఆలేరు వద్ద బస్సును నిలిపి అరెస్టు చేసిన పోలీసులు

 

అయితే జనగామ నుంచి బయలుదేరిన అల్లుళ్ల బస్సుయాత్రకు పోలీసులు బ్రేకులు వేశారు. ఆలేరు పరిసరాల్లోకి రాగానే అల్లుళ్లందరినీ పోలీసులు అడ్డుకుని స్టేషన్ లో నిర్బంధించారు.  శాంతియుతంగా ప్రగతిభవన్ కు వెలుతున్న బచ్చన్నపేట మండలం అల్లుల్లను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించిన వైనాన్ని వారు నిరసించారు. తమను అరెస్టు చేయడం దారుణమన్నారు. 

 

ఆలేరు పోలీసు స్టేషన్ లో అల్లుళ్ల నిరసన

 

అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున యాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అల్లుళ్లు అయినా, ఇంకెవరైనా యాత్ర చేయాలంటే అనుమతి తీసుకోవాలని వారు సూచించారు. మరోవైపు ప్రగతి భవన్ కు వెళ్తున్నందున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మొత్తానికి పొన్నాల లక్ష్మయ్య వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం చర్చనీయాంశమైంది.