టిఆర్ఎస్ అభ్యర్థికి సొంత పార్టీ నేతల షాక్

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిఆర్ఎస్ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. తమ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి అంతా సద్దుమణిగిపోయిందని  ఒకవైపు పార్టీ అధినేత కేసిఆర్ తనయుడు కేటిఆర్ ప్రకటించారు. ఆయన ఆ ప్రకటన చేసి 48 గంటలు గడిచాయో లేదో  అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో అసమ్మతి భగ్గుమన్నది. పార్టీ అభ్యర్థిని మార్చాల్సిందే అంటూ ఆలేరు నియోజకవర్గానికి చెందిన కీలక టిఆర్ఎస్ నేతలంతా పట్టు పడుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు టిఆర్ఎస్ అసమ్మతి నేతలు శుక్రవారం కీలక సమావేశం నిర్వహించారు. నియోజవర్గంలోని పలు గ్రామాల పార్టీ నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారంతా ముక్త కంఠంతో ఆలేరు తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి గొంగిడి సునితారెడ్డిని మార్చాలంటూ డిమాండ్ చేశారు.  

సమావేశమైన ఆలేరు టిఆర్ఎస్ అసమ్మతి నేతలు

నిజమైన తెలంగాణ వాదులను అవమానించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి వ్యతిరేకి అయిన తాజా మాజీ ఎమ్మెల్యే సునీతను అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే టిఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. అవినీతి, అక్రమాలు, గొంగిడి మహేందర్ రెడ్డి గూండాయిజం, దాడులు, బెదిరింపులు వంటి వాటిపై నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సునీతను మార్చాలని పార్టీలో అన్ని స్థాయిల్లో పోరాడుతున్నా పార్టీ నాయకత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తిచేశారా..? ఒక్క ఎకరానికి అదనంగా నీరు వచ్చిందా..? అని నిలదీశారు. ఉద్యమకాలంలో త్యాగాలు చేసిన ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. 

ఇప్పటికైనా సునీత అభ్యర్థిత్వాన్ని మార్చకుంటే అతి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. మరోవైపు గౌరాయ పల్లిలో టీఆరెస్ కార్యకర్త గొట్టం కృష్ణా రెడ్డిపై గొంగిడి మహేందర్ రెడ్డి, అతని అనుచరుల దాడిని సమావేశంలో పాల్గొన్న నాయకులు ఏకగ్రీవంగా ఖండించారు. గొంగిడి మహేందర్ రెడ్డిపై కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఈ అసమ్మతి సమావేశంలో పాల్గొన్న నాయకులు వీరే

1. సుంకరి శెట్టయ్య, ఆలేరు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్
2. కొంతం మోహన్ రెడ్డి.. మాజీ జెడ్పీటిసి, యాదగిరిగుట్ట
3. వంచ వీరా రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్
4. బోళ్ళ కొండల్ రెడ్డి గతంలో సునీత ఎన్నికల ఇన్ ఛార్జ్
5. గుడిపాటి మధుసూదన్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్
6. మంద సంజీవ రెడ్డి.. బొమ్మల రామరాం మాజీ ఎంపీపీ
7. ఉప్పలయ్య… ఎంపీటీసీ, గుండాల
8. రేణుక .. వైస్ ఎంపీపీ రాజపేట
9. గట్టు నరేందర్
10. బోరెడ్డి ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. 

వీరితోపాటు కల్లూరి మనోహర్ రెడ్డి, పలుగుల శ్రీనివాస్, రాజమల్లయ్య, సింగిరెడ్డి నరోత్తం రెడ్డి, అంబల మల్లేశం
ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ మండల నాయకులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

అభ్యర్థి మార్పు అయ్యే పనేనా ?

ఒకవైపు ప్రకటించిన అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని కేసిఆర్ మొదలుకొని, కేటిఆర్ సహా బల్ల గుద్ది చెబుతున్నారు. అభ్యర్థులను మారిస్తే క్రెడిబులిటీ పోతుందని వారు చాలా స్పష్టంగా చెబుతున్నారు. అభ్యర్థుల ప్రకటన వెలువడిన వెంటనే చాలా నియోజకవర్గాల్లో ఈ తరహా డిమాండ్లు వచ్చాయి. ఏకంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి భారీ సభలు ఏర్పాటు చేసి హల్ చల్ చేశారు. అలాగే చాలా నియోజకవర్గాల్లో అస్మమతి నడిచింది. కానీ కేటిఆర్ ఒక్కొక్కరినీ పిలిచి వారికి నచ్చచెప్పారు. పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు.

కేటిఆర్ అందరినీ కన్విన్స్ చేశానని రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఇక టిఆర్ఎస్ కు తిరుగే లేదని చెప్పారు. ప్రకటించిన అభ్యర్థులను మార్చే ప్రసక్తే లేదని చెప్పగానే అందరూ సిట్ రైట్ అయ్యారని ధీమా వ్యక్తం చేశారు. కానీ కేటిఆర్ ప్రకటన వెలువడిన తర్వాత ఆలేరులో తిరుగుబాటు బావుటా ఎగురవేయడం సంచలనం రేపింది. ఇప్పటికే గొంగిడి సునీత ఆలేరులో ప్రచారం జోరుగా చేపట్టారు. అయితే ఆమెకు ఎక్కువగానే వ్యతిరేకత కనబడుతున్నది. కేటిఆర్ కూడా ఆమె నియోజకవర్గంలో ప్రచారం చేశారు. 

మరి ఈ పరిస్థితుల్లో అభ్యర్థిని మారుస్తారా? లేదంటే అసమ్మతి నేతలంతా కారు దిగి వెళ్లిపోతారా అన్నది హాట్ టాపిక్ గా మారింది.