అది ప్రగతి సభ కాదు, తాగుబోతులు పెట్టిన సభ : కాంగ్రెస్ శ్రవణ్

ప్రగతి నివేదన సభ రాజకీయ పార్టీ సభలా కాకుండా తాగుబోతుల సభ లా ఉందని తెలంగాణ పిసిసి ముఖ్య అధికార ప్రతినిధి  శ్రవణ్ దాసోజు విమర్శించారు. తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వచ్చిన వారికి మందు సరఫరా చేసి మహిళలను, యువలకును మందుకు బానిసలను చేసి లక్షలాది మందిని తరలించడం సిగ్గుచేటని దాసోజు అన్నారు. తెలంగాణా అనగానే మందు, మటన్ తో చిందులేయడం తప్ప మరోటి కాదన్నట్లు, ఇక్కడి సంస్కృతిని సంప్రదాయాలను అవమాన పరిచే రీతిలో రాజకీయ సభను నిర్వహించడం కేసీఆర్ కు తగదని విమర్శించారు. ఇవాళ గాంధీ భవన్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రాజకీయ సభ పేరిట తాగుబోతుల సభ ను నిర్వహించారని ఎద్దేవా చేశారు. బస్సుల్లో కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టు తాగుతుంటే మొబైల్ బార్లలా మారుస్తుంటే పట్టించుకోలేదని తక్షణమే ఆర్టీసి అధికారులు, ట్రాక్టర్లలో జనాన్ని తరలిస్తున్న పట్టించుకోని ఆర్టీయే అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ నాయకులకు డబ్బంటే లెక్కలేదని ఇష్టారీతిగా డబ్బులు గాల్లోకి వెదజల్లుతూ పైశాచికానందం పొందడం సరికాదన్నారు. ప్రకృతికూడా టీఆర్ఎస్ ఆగడాలను భరించడం ఇష్టం లేక వంద గోడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వాన కు నేలకూలినట్లు అట్టహాసంగా పెట్టిన ఫ్లెక్సీ నేలకూలిందన్నారు. కేవలం 47 నిమిషాల పసలేని ప్రసంగం కోసం లక్షలమంది జనాన్ని తరలించి కోట్లాది రూపాయల ఖర్చుచేసి ఈవెంట్ మానేజ్ మెంట్ చేయాల్సిన అవసరమేంటన ప్రశ్నించారు.

జనం రాక వెలవెలబోయిన కేసీఆర్

లక్షల మంది జనం సభకు వస్తున్నరంటూ ఊదరగొట్టిన టీఆర్ ఎస్ నేతలు తీరా సభ ప్రారంభం అయ్యే వరకు జనం కనిపించక పోయే సరికి కంగుతిన్నారని హెలీకాప్టర్ లో పైన తిరిగిన కేసీఆర్ మొహంలో భయం కనిపించిందని ఎద్దేవా చేశారు. తన ప్రసంగంలో ఢిల్లీ వర్సెస్ గల్లీ అంటూ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములంటూ సెంటిమెంట్ పండించాలని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టిందన్నారు. ఢిల్లీకి గులాములెవరో కేసీఆర్ కే బాగా తెలుసన్నారు. ఆనాడు తెలంగాణా బిల్లు పెట్టిన సమయంలో ప్రాణాలకు తెగించి పొన్నం ప్రబాకర్, తదితర నేతలు కొట్లాడక పోతే తెలంగాణా వచ్చేదా అంటూ నిలదీశారు.

మోడీ చేతిలో కీలుబొమ్మ కేసీఆర్

ముందస్తు ఎన్నికలంటూ వారం రోజుల పాటు పెద్ద యెత్తున హంగామా చేసిన కేసీఆర్ మోడీ చేతిలో కీలుబొమ్మలా మారారని , ఆయన వద్దన్నందుకే ఎన్నికల ప్రస్తావన తేలేదన్నారు. గులామ్ గా మారిన కేసీఆర్ విభజన హామీలను సాదించలేక పోయారని ఎద్దేవా చేశారు.

ఉద్యమకారులను అవమానించిన కేసీఆర్

తొలి తరం ఉద్యమంనుంచి కీలక పాత్ర పోషించిన ఆచార్య జయశంకర్ సారు ను గౌరవించలేదని సభలో ఆయన చిత్రపటం పెట్టలేకపోయారన్నారు. ఉద్యమ సమయంలో కొన్ని అంశాలు తాను చెబుతుంటే ఆయన డిక్టేట్ చేసుకునే వారని చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని జయశంకర్ ను అవమానించడమేనన్నారు. 1500 మంది అమరుల చనిపోతే ఒక్కరినీ ఆదుకోలేదన్నారు. అమరులకు కుటుంబాలకు ఎందరికి ఉద్యోగావకాశాలు కల్పించారో గుండెపై చేయేసుకుని చెప్పాలన్నారు. తొలితరం ఉద్యమకారుడు దేశిని చినమల్లయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీ, గూడ అంజన్న లాంటి ప్రముఖ ఉద్యమకారులు చనిపోతే కనీసం పరామర్శించలేదని ప్రభుత్వలాంఛనాలతో ఎందుకు వారి అంత్యక్రియలు జరిపించలేకపోయారని శ్రవణ్ ప్రశ్నించారు.

సభ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్దాలు

పాడిందే పాట పాటరా పాసుపళ్ల అదేదో అన్నట్లు.. చెప్పిన విషయాలే చెప్పి బోరుకోట్టించడ మినహా సభలో కొత్త విషయాలేం లేవన్నారు. 2000 సంవత్సరంలో విద్యుత్ జరిగిన రైతుల పోరాటంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పోరాటం జరిగి 14 రోజులు నిరాహార దీక్ష చేపడితే.. తాపీగా నిద్రలేచిన కేసీఆర్ మూడు వారాల తర్వాత లేఖ రాసి తనవల్లే ప్రభుత్వం స్పందించిందనడం పచ్చి అబద్దమన్నారు. రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని కడుపుచించుకుని సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణా రాష్ట్రం సిద్దించేదా అంటూ ప్రశ్నించారు.

వలసలు నివారించేందుకు చేసిందేంటి..?

టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మహబూబ్ నగర్ వలసలు ఆగాయని అబద్దం చెప్పుతున్నారని నేటికి బొంబాయి తదితర ప్రాంతాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయని శ్రవణ్ అన్నారు. మహబూబ్ నగర్ లో 90 శాతం పూర్తయిన సాగునీటి ప్రాజెక్ట్ లు నెట్టెంపాడు,కల్వకుర్తి, భీమా కోయిల్ సాగర్ తదితర ప్రాజెక్ట్ పూర్తిచేస్తే వలసలు ఆగే అవకాశం ఉన్నా రీడిజైనింగ్ పేరిట కోట్లాది రూపాయలు దండుకున్నారే తప్ప ప్రాజెక్ట్ లుపూర్తిచేయలేదన్నారు. అట్టహాసంగా ఎన్నారై పాలసీ ప్రకటిస్తామని ఏటా వెయ్యి కోట్ల నిధిని ఏర్పరుస్తామంటూ ప్రగల్భాలు పలికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు.వలస కార్మికులను ఏనాడూ ఆదుకోలేదన్నారు.

కాంగ్రెస్ ముందుచూపుతోనే నిరంతర కరెంట్

గత యూపిఏ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ముందుచూపుతో ఎన్నో కొత్త పవర్ ప్రాజెక్ట్ లను ప్రారంభిస్తే తద్వారా కరెంట్ ఉత్పత్తవుతోందని, నాలుగేళ్ల ప్రభుత్వంలో ఒక్క యూనిట్ ఉత్పత్తిచేయకుండా అదంతా తన ఘనతేనని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. భూపాల్ పల్లి, జైపూర్ ప్లాంటులు కాంగ్రె స్ స్ధాపించవో కావో చర్చించేందుకు సిద్దమా అంటూ సూటిగా ప్రశ్నించారు. తక్కువ ధరలకే కరెంట్ అందుబాటులో ఉన్నా అధిక ధరలకు చత్తీస్ గఢ్ కరెంటు ఎందుకు కొంటున్నారో స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు

కులవృత్తుల పై సవతి తల్లి ప్రేమ

తెలంగాణా పల్లెల్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి బిడ్డలు పనులు లేక పిట్టలు రాలినట్లు రాలుతుంటే బీసిలకు కోట్లాది రూపాయలతో ఆదుకుంటున్నమని దొంగమాటలు చెబుతున్నరని బీసీ ల నోట్ల మన్నుగొట్టి గొర్రెలు, బర్రెలు చేపలు ఇస్తూ అవమానిస్తున్నరన్నారు. సంచార జాతులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఎంబీసి లకు వెయ్యికోట్లుకేటాయింపు ఉత్తదేనని కేటాయింపులున్నా ఒక్క రూపాయి ఖర్చుచేయకుండా నానుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో గౌడన్నలకు నీర పేరిట సాఫ్ట్ డ్రింక్ లకు ఇస్తామన్న అనుమతేమయిందన్నారు. నాయా బ్రాహ్నణులకు డొమెస్టిక్ కరెంట్ పేరిట జీవో ఇచ్చినా నేటికి అమలుకు నోచుకోలేదని . నిజంగా అమలు చేస్తే తాను అరగుండుతో తిరుగుతానని మీరుసిద్దమా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజంగా జీవో ఇచ్చినా ముఖ్యమంత్రి మాట అధికారులు వినడం లేదోమోనని అపహాస్యం చేసారు.

మైనార్టీ ల నోట్లో మట్టిగొట్టిన కేసీఆర్

పాలకుల మాట వేదంలా ఉండాలని దార్శనికతతో ఉండాలని శ్రవణ్ అన్నారు. మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారిని నిండా ముంచి సభలో పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు. ముస్లీంలకు దేశవ్యాప్తంగా 4వేల కోట్లు కేటాయిస్తే తాను మాత్రం ఏటా 2 వేలకోట్లు ఖర్చుచేశామనడం దారుణమన్నారు.కేటాయించారా ఖర్చుచేశారా స్పష్టంచేయాలన్నారు, 2014 -15 లో 1052 కోట్లు కేటాయించి 326 కోట్లు ఖర్చుచేశారని 2015- 16 లో1111 కోట్లు కేటాయించి , 556 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, 2016-17 లో రూ.1343 కోట్లు కేటాయించి,రూ 859 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని, 2017- 18 లోరూ. 1249 కోట్లు కేటాయించి రూ 916 కోట్లు మాత్రమే ఖర్చుచేశారని మొత్తం రూ. 4750 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది రూ.2658 కోట్లు మాత్రమేనన్నారు. మిగిలించుకుంది రూ.2100 కోట్లన్నారు. 45 శాతం కూడా ఖర్చు చేయలేదని చేసింది సగం కూడా లేదన్నారు. అట్టహాసంగా ప్రకటించి నాలుగు నెలల్లో తెస్తానని చెప్పిన 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు తేలేకపోయారో సభలో స్పష్టం చేయలేదన్నారు. వక్ఫ్ బోర్డుకు జ్యూడిషియల్ అధికారాలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేదన ప్రశ్నించారు. రూ.5000 వేల కోట్ల విలువయిన అన్యాక్రాంతమయిన భూములను ఎందుకు మళ్లించలేకపోయారో అడ్డుకున్నశక్తులేంటో స్పష్టంచేయాలని గల్లాపట్టి అడుగాలని ముస్లీం సోదరులకు పిలుపునిచ్చారు. ఓట్లకోసం పెద్దయెత్తున అబద్దాలు మాట్లాడే ముఖ్యమంత్రి కేసీఆరే నని శ్రవణ్ దుయ్యబట్టారు.

తండాలకు బిల్డింగులేవి..?

తండాలను గ్రామపంచాయితీలుగా మార్చినా బిల్డింగులు నిర్మించకపోతే లాభమేంటని, ఆగమేఘాల మీద ప్రగతి భవన్, ఎమ్మెల్యేల భవన్ లు నిర్మించిన కేసీఆర్ గ్రామపంచాయితీ భవనాలెందుకు నిర్మించలేకపోయారో చెప్పాలన్నారు. గిరిజనులు, లంబాడాల మధ్య చిచ్చుపెట్టారని ప్రశాంతంగా ఉన్న తండాలను,గిరిజన గూడాలను అల్లకల్లోలంగా మార్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మిషన్ భగీరథ ఓ విఫల ప్రయత్నం

మిషన్ భగీరధ ద్వారా 22 వేల గ్రామాలకు నీరిచ్చినామని మరో 13వందల గ్రామాలకు పదిహేను రోజుల్లో నీరిస్తామనడం పెద్ద మోసమని, పచ్చి అబద్దమని శ్రవణ్ అన్నారు. తెలంగాణా లో మొత్తం 10 వేల గ్రామాలుంటే మిగితా గ్రామాలెక్కడివని ప్రశ్నించారు. గజ్వేల్ పరిసరాల్లో మినహా మరెక్కడా మిషన్ భగీరధ నీరు రాలేదని ఒకవేళ అధికారపార్టీ నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని.. మీరు సిద్దమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు.

ఇసుక మాఫియా ను ప్రోత్సహిస్తూ ఆదాయం అంటారా..?

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్యవరణ సమతుల్యత కోసం ఇసుకను ఇష్టారీతిగా తవ్వడం నేరమని ప్రభుత్వాది నేతలకు తెలియక పోవడం శోచనీయమని, గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం ఇసుకనుంచి 19 కోట్ల ఆదాయం వస్తే తమ హాయాంలో 1900 కోట్లు వచ్చిందని చెప్పడం ముఖ్యమంత్రి అజ్నానానికి నిదర్శనం అన్నారు. అవగాహాన ఉన్నవారెవరూ సాండ్ మైనింగ్ పేరిట అడ్డగోలు తవ్వకాలు చేపట్టరాదని, రాష్ట్రానికి ఆదాయం కల్పిస్తున్నామన్న పేరిట వేలాది కోట్లు దండుకుని ఇసుక మాఫియాను ప్రోత్సహించారని అన్నారు. టీఆర్ఎస్ అడ్డగోలు దొపిడి వల్లే నేరెళ్లలో లారీ టైర్లకింద పడి అమాయకులు చనిపోయారన్నారు.

దయ్యాలు వేదాలు వల్లించినట్లు

రాజకీయ అవినీతిగురించి కేసీఆర్ చెప్పడం దయ్యలు వేదాలువల్లించినట్లుందని శ్రవణ్ ఎద్దేవా చేశారు. కలెక్టర్ స్ధాయి నుంచి అటెండర్ స్ధాయి వరకు అందరూ అవినీతిలో మునిగితేలుతున్నరన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి సిరిసిల్ల మున్సిపల్ మహిళా ఛైర్ పర్సన్ మాటలే నిదర్శనమన్నారు. ఆరోపణులు చేసిన ఆమెను వెంటనే పదవినుంచి తప్పించారని, డిప్యూటీ సియం రాజయ్య పై తప్ప మియాపూర్ ల్యాండ్ స్కాం నుంచి మొదలు ఎమ్మెల్యేలు అధికారులు చేసిన ఏ అవినీతి పై చర్యలు తీసుకోలేదన్నారు.

జోన్లు పెద్ద బోకస్

మోడీని ఇస్తవా సస్తవా అంటూ జోన్ల విషయం ప్రస్తావించిన కేసీఆర్ సాధించిందేమీ లేదన్నారు. కొత్తగా తెచ్చిన జీవో వల్ల ఇతర ప్రాంతాల వారు నాలుగు సంవత్సరాలు వరుసగా చదివితే లోకల్ గా మారే ప్రమాదముందన్నారు. దీని వల్లపరిగణించడంవల్ల అసలైన తెలంగాణా జిల్లాలకు చెందిన అభ్యర్దులకు తీవ్ర అన్యాయం జరగనుందన్నారు.

ఐటీఐఆర్ ను అటకెక్కించి ఐటీ అభివృద్ది చెందిందంటారా..?

ఐటీ ఇండస్ట్రీని ఆగం బట్టించి గొప్పగా ఉందని చెప్పడం సరికాదన్నారు. చిత్తశుద్ది ఉంటే 50 లక్షల మందికి ఉపాధి కల్పించే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ను ఎందుకు తేలేకపోయారని ముఖ్యమంత్రి. ఐటీ శాఖామంత్రి అసమర్ధతకు నిదర్శనమని చెప్పారు.

పేదల భూములు లాక్కొంటూ కేసులేస్తున్నమంటారా . ?

ప్రాజెక్ట్ లు కడుతుంటే కేసులేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడాన్ని శ్రవణ్ తప్పుపట్టారు. ప్రాజెక్ట్ ల పేరిట పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యవసాయ భూములను అక్రమంగా లాక్కొంటుంటే కాంగ్రెస్ నేతలు దామోదర్ రాజనర్సింహ్మ, హర్షవర్ధన్ లాంటి నేతలు పేదల పక్షాన నిలిచి పోరాటం చేశారన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన పేదల పై లాఠీచార్జీలు చేయిస్తూ అధికారులను దళారులుగా మార్చుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని, కేసులు పెట్టి వేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో సగం కూడా ఖర్చు చేయకుండా కోట్లాది నిధులు మంజూరుచేశామని చెప్పడం హాస్యాస్సదమన్నారు

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరోమారు సెంటిమెంటు ను పండించాలని కేసీఆర్ చూస్తున్నారని ప్రజలెవరూ మోసపోవద్దని పిలుపునిచ్చారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన కవులు కళాకారులను మోసంచేసారని ఇందుకు చెరుకు సుధాకర్, విమలక్క లాంటి ఎందరో బలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. వేలాది మంది రైతులు చనిపోతే వారి గురించి మాట్లాడలేదన్నారు. కోట్లాది రూపాయలు అడ్వర్టయిజ్ మెంట్ల రూపంలో విచ్చల విడిగా ఖర్చుచేశారని కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని ప్రజాస్వామిక తెలంగాణా కోసం మరో మారు పోరాటం చేసేందుకు ప్రజలంతా సిద్దం కావాలని శ్రవణ్ పిలుపునిచ్చారు.