మాజీ మంత్రి దానం నాగేందర్ పరిస్థితి టిఆర్ఎస్ లో గందరగోళంలో పడింది. అసెంబ్లీ రద్దైన రోజే పార్టీ అధినేత కేసిఆర్ 105 సీట్లు ప్రకటించారు. కానీ అందులో దానం పేరు లేదు. దానం నాగేందర్ కోరిన సీట్లలో ప్రస్తుతం అభ్యర్థులను ఖరారు చేయలేదు కేసిఆర్. అయినప్పటికీ దానం సీటెక్కడ అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దానం నాగేదర్ పేరు రెండు సీట్లలో ఏదో ఒక దానిలో ఫైనల్ చేయవచ్చని చెబుతున్నారు.
ఖైరతాబాద్ లో పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు దానం నాగేందర్. కానీ ఇప్పటి వరకు అధినేత నుంచి క్లియరెన్స్ రాలేదు. ఈ తరుణంలో సోమవారం ఒక పిడుగు లాంటి వార్త సోషల్ మీడియాలో గిర్కీలు కొడుతున్నది. అదేమంటే దానం నాగేందర్ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో రహస్యంగా ఒక హోటల్ లో సమావేశమైనారన్నది. ఈ విషయంపై ఇటు కాంగ్రెస్ వర్గాల నుంచి కానీ, అటు టిఆర్ఎస్ వర్గాల నుంచి కానీ స్పష్టత రాలేదు.
కానీ సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్న అంశమిది. దీనిపై దానం నాగేందర్ స్పందించారు. జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. అభ్యర్థులు దొరకక కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. కావాలని కుట్రపూరితంగా తనను వివాదంలోకి గుంజుతున్నారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. కేసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అని తేటతెల్లం చేశారు.
నిజానికి దానం నాగేందర్ టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దానం నాగేందర్ పార్టీ మారతారంటూ ఒకసారి పెద్ద ఎత్తున ఉదయం ఖైరతాబాద్ పరిసరాల్లో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. అంతలోనే ఆ ఫ్లెక్సీలన్నీ మాయం చేశారు. ఆ సమయంలో కేసిఆర్ సమక్షంలో అయితేనే టిఆర్ఎస్ లో చేరతానని దానం నాగేందర్ కండీషన్ పెట్టారట. కానీ ఆ సమయంలో కేసిఆర్ సమక్షంలో కాకుండా మంత్రుల సమక్షంలో జాయిన్ కావాలని టిఆర్ఎస్ సూచించింది. దీంతో దానం వెనుకంజ వేశారు.
అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ లోనే దానం కొనసాగినా.. రేపో మాపో టిఆర్ఎస్ లోకి పోవాలన్న ఉద్దేశంతో ఉన్న ఆయన పెద్దగా కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేయలేదు. అంతిమంగా దానం నాగేందర్ కొద్దిరోజుల కిందట కేసిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు. బిసిలకు కాంగ్రెస్ లో నష్టం జరుగుతదంటూ పల్లవి అందుకుని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అయినప్పటికీ ముందస్తు నేపథ్యంలో దానం సీటుపై పీఠముడి పడింది. ఖైతారబాద్ సీటును దానం ఆశిస్తున్నారు. కానీ గ ోషామహల్ లో పోటీ చేయలని దానం ను టిఆర్ఎస్ నాయకత్వం కోరినట్లు తెలుస్తోంది. ఈ రెండు సీట్లు కాకపోతే సికింద్రాబాద్ లేదా మల్కాజ్ గిరి ఎంపి సీటులో దానం కు చాన్స్ ఇవ్వొచ్చని చెబుతున్నారు.
తాజాగా ఒక హోటల్ లో దానం నాగేందర్ ఉత్తమ్ తో భేటీ అయినట్లు పుకార్లు షికారు చేయడం చర్చనీయాంశమైంది. భేటీ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దానం నాగేందర్ పిసిసి చీఫ్ ఉత్తమ్ తో భేటీ అయింది వాస్తవమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ సన్నిహితుడొకరు తెలిపారు. వీరిద్దరి సమావేశం తర్వాత దానం నాగేందర్ తన సన్నిహితులు, అంతరంగీకులతో భేటీ అయ్యారని తనకు సమాచారం ఉందని, రేపో మాపో దానం తిరిగి సొంత గూటికి చేరే చాన్స్ ఉందని ఆయన స్పష్టం చేశారు.
అయిదే ఈ వార్తలపై దానం రియాక్షన్ మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తాను కలవలేదని స్పష్టంగా చెప్పారు. అభ్యర్థులు దొరకక కాంగ్రెస్ పార్టీ సతమతమవుతున్నదని, అందుకే ఇలాంటి చీఫ్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. ఏది ఏమైనా టిఆర్ఎస్ లో దానం ఉక్కిరిబిక్కిరి అవుతన్నమాట నిజం. ఇప్పటి వరకు ఆయనకు టికెట్ ఖరారు కాలేని మాట నిజం. అందుకే ఇలాంటివన్నీ ప్రచారం జరుగుతున్నాయన్నమాట కూడా నిజమే.