కొత్త రకం నిరసన… ఆఫీస్‌ లో పామును వదిలారు!

నిరసనలు పలు రకములు… అయితే నిరసనలందు ఈ రకం నిరసనలు వేరయా అన్నట్లుగా ఉంది తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఒక నిరసన! అధికారుల సహాయం కోసం గంటల తరబడి నిరీక్షించినా ఫలితం లేకుండా పోయిందని, వారు పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన యువకుడు తన సమస్యను ఆఫీసుకు తెచ్చాడు!

ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు హైదరాబాద్‌ ను అల్లకల్లోలం చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుతోంది. ఇక మురుగు కాలువలు పొంగి పొర్లి ఇళ్లలోకి నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో పాములు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒక చోటుచేసుకుంది.

అవును… అల్వాల్‌ లోని భారతీనగర్‌ కు చెందిన తన ఇంట్లోకి పాము ప్రవేశించిందని సంపత్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. అల్వాల్ డివిజన్‌ లోని అల్వాల్ ఆలయానికి సమీపంలోని ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. అయితే ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా కూడా జి.హెచ్.ఎం.సి. సిబ్బంది పట్టించుకోలేదు.

దీంతో ఎంతసేపటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో ఆ యువకుడికి బీభత్సమైన కోపం వచ్చింది. పామును నేరుగా జి.హెచ్.ఎం.సి. ఆఫీసుకి తెచ్చి వదిలాడు. ఆఫీసులోని టేబుల్‌ పై పామును పెట్టి సంపత్ తన నిరసన వ్యక్తం చేశాడు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనపై జి.హెచ్.ఎం.సి. అల్వాల్‌ సర్కిల్‌ మేనేజర్‌ ప్రవీణ స్పందించారు. కొన్ని నెలల క్రితమే తాను బాధ్యతలు స్వీకరించినందున అల్వాల్‌ లోని భరత్‌ నగర్‌ పై ఎలాంటి క్లూ లేదని చెబుతున్నారని తెలుస్తుంది.

కాగా రానున్న 24 గంటల్లో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రమాదకరమైన భవనాలు, ఒంటరిగా ఉండే చెట్లకు దూరంగా ఉండాలని జి.హెచ్.ఎం.సి. ప్రజలకు సూచించింది.

ఈ సందర్భంగా గ్రేటర్ ప్రజలు సహాయం కోసం 040-21111111, 9000113667కు డయల్ చేయాలని సూచించింది. ఇదే సమయంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ అధికారులు… హిమాయత్ సాగర్ వద్ద నాలుగు గేట్లను తెరిచి అదనపు నీటిని మూసీ నదికి దిగువకు వదిలారు.