Snake: ఇంటి చుట్టూ ఈ మొక్కలుంటే పాములు రమ్మన్నారావు.. సహజ రక్షణ రహస్యం..!

సాధారణంగా గ్రామాలు, అడవులకు సమీప ప్రాంతాల్లో నివసించే వారిలో ఒకటే భయం.. పాములు. పంట పొలాలు, తోటలు, పెరట్లో దాక్కునే పాములు ఒక్కసారిగా ఇళ్లలోకి చొరబడితే ప్రాణాపాయం తప్పదు. విషపూరితమైన పాము కాటుకు నిమిషాలే కీలకం. అలాంటి ప్రమాదాన్ని ముందే అడ్డుకోవాలంటే ఖరీదైన కెమికల్స్ లేదా మందులే కాదు.. మన ఇంటి చుట్టూ నాటే కొన్ని సాధారణ మొక్కలే చాలు అంటున్నారు నిపుణులు.

పాములు ఎక్కువగా వాసనల ద్వారా పరిసరాలను గుర్తిస్తాయి. కొన్ని ఘాటైన, చేదు సువాసనలు వాటి జ్ఞానేంద్రియాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి వాసన వచ్చే మొక్కలు మీ ఇంటి అంచుల్లో, తోట చుట్టూ ఉంటే పాములు దగ్గరికి రావడానికే వెనకాడతాయి. ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన సర్పగంధ మొక్క పేరు చెప్పినట్లే పాములను దూరంగా ఉంచుతుంది. దీని ఘాటైన వాసనకు పాములతో పాటు తేళ్లు, ఇతర కీటకాలు కూడా దరిచేరవు. ముఖ్యంగా ఇంటి ప్రవేశ ద్వారాల వద్ద ఈ మొక్క ఉంటే సహజ రక్షణలా పనిచేస్తుంది.

ఇక పాములకు అస్సలు పడని మరో వాసన బంతి పూలది. మన ఇళ్లలో అలంకరణ కోసం నాటే ఈ పూలే పాములకు పెద్ద శత్రువులు. వీటి వేర్లు, ఆకుల్లో ఉండే సహజ రసాయనాల వల్ల వచ్చే ఘాటైన వాసనను పాములు భరించలేవు. తోట చుట్టూ బంతి పూల వరుస ఉంటే పాములు ఆ దారినే మార్చుకుంటాయి. వంటింట్లో రోజూ ఉపయోగించే వెల్లుల్లి, ఉల్లి కూడా ఇదే పని చేస్తాయి. వీటిలో ఉండే సల్ఫర్ వాసన పాములపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెరట్లో లేదా తోట అంచుల్లో అల్లియమ్ జాతి మొక్కలు ఉంటే పాములు ఆ ప్రాంతాన్ని దాటే ప్రయత్నమే చేయవు.

మనకు హాయిగా అనిపించే లెమన్ గ్రాస్ సువాసన పాములకు మాత్రం అసహ్యం. ఇందులో ఉండే సిట్రోనెల్లా నూనె పాములు, దోమలు, కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇంటి చుట్టూ కంచెలా ఈ మొక్కలు ఉంటే సహజ రక్షణ వలయం ఏర్పడుతుంది. అలాగే తులసి మొక్క, ముఖ్యంగా వన తులసి వాసన కూడా పాములకు నచ్చదు. పుదీనా కుటుంబానికి చెందిన ఈ మొక్కల్లోని నూనెలు పాములను అడ్డుకుంటాయి.

పాముల చర్మం చాలా సున్నితమైనది. అందుకే ముళ్లు ఉన్న మొక్కలు వాటికి పెద్ద అడ్డంకి. గులాబీ మొక్కలు, చిన్న కాక్టస్ జాతి మొక్కలు పెరట్లో ఉంటే ముళ్లు గుచ్చుకుంటాయనే భయంతో పాములు లోపలికి రాకుండా వెనుతిరుగుతాయి. పుదీనా మొక్క మరో ప్రత్యేకత. ఇది వేగంగా విస్తరిస్తూ ఘాటైన వాసనను చుట్టుపక్కల వ్యాపింపజేస్తుంది. ఈ వాసనను తట్టుకోలేక పాములు ఆ ప్రాంతాన్ని దూరంగా ఉంచుతాయి.

ఇక చాలా మందికి తెలియని వార్మ్‌వుడ్ మొక్క కూడా సహజ రక్షకుడే. దీని చేదు, ఘాటైన వాసన పాములకు మాత్రమే కాదు… ఇతర జంతువులకు కూడా నచ్చదు. ఈ మొక్కల్ని సరైన చోట్ల నాటితే పాముల భయం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే నిపుణులు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. ఈ మొక్కలు పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి గానీ, పూర్తిగా ప్రమాదం లేదని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, చెత్త పేరుకుపోకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రకృతి ఇచ్చిన ఈ సహజ రక్షణను తెలివిగా ఉపయోగించుకుంటే.. పాముల భయానికి గుడ్‌బై చెప్పవచ్చు.