సాధారణంగా పాము అంటేనే మనలో చాలా మందికి భయం పుట్టుకొస్తుంది. కాటు వేస్తే ప్రాణాలకే ముప్పు అని అందరికీ తెలుసు. కానీ ఒక పాము మాత్రం కరవాల్సిన అవసరమే లేకుండా, దగ్గరకు కూడా రాకుండానే మనిషిని అంధుడిని చేయగలదంటే మీరు నమ్మగలరా.. కానీ ఇది సినిమా కథ అనుకుంటే పొరపాటే. ప్రకృతిలో నిజంగా ఇలాంటి పాము ఉంది. అదే మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా.
ఈ పాము మిగతా పాముల్లా కాటుతో విషం ఎక్కించదు. శత్రువు ఎదురుగా కనిపించగానే తన కోరల నుంచి విషాన్ని గాలిలోకి ఫౌంటెన్‌లా చిమ్ముతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ విషపు జెట్ ఏకంగా 9 అడుగుల దూరం వరకు వెళ్లగలదు. అంతేకాదు, ఇది ఎటు పడితే అటు కాదు.. ఎదురున్న ప్రాణి కళ్లనే లక్ష్యంగా చేసుకుంటుంది.
శత్రువును గమనించిన క్షణంలో ఈ కోబ్రా తలను వేగంగా ఊపుతూ విషాన్ని చిమ్ముతుంది. ఆ కదలిక వల్ల విషపు చుక్కలు విస్తృతంగా వ్యాపించి తప్పకుండా కళ్లలోకి ప్రవేశించేలా చేస్తాయి. ఇదే దీని అత్యంత ప్రమాదకరమైన ఆయుధం. కాటుకు అవకాశం ఇవ్వకుండానే ప్రత్యర్థిని నిర్వీర్యం చేసే అరుదైన సామర్థ్యం దీనికి ఉంది. ఈ పాము చిమ్మిన విషం కళ్లలో పడితే పరిస్థితి భయంకరంగా మారుతుంది. మొదట తీవ్రమైన మంట, కళ్లలో మండుతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే చూపు మసకబారుతుంది. సరైన సమయంలో కళ్లను శుభ్రం చేసి వైద్యం అందకపోతే, కంటి కణాలు పూర్తిగా దెబ్బతిని శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేవలం కళ్లకే కాదు.. ఈ పాము విషం చర్మానికి కూడా ప్రాణాంతకం. ఇది సైటోటాక్సిక్ రకానికి చెందిన విషం. అంటే, ఇది చర్మ కణాలను, కణజాలాన్ని నేరుగా నాశనం చేస్తుంది. విషం తగిలిన చోట తీవ్రమైన వాపు, గాయాలు ఏర్పడి, పరిస్థితి విషమిస్తే ఆ శరీర భాగం కుళ్లిపోయే స్థితికి కూడా దారి తీస్తుంది. ఆఫ్రికా ప్రాంతాల్లో ముఖ్యంగా మొజాంబిక్, దక్షిణ ఆఫ్రికా పరిసరాల్లో ఈ స్పిట్టింగ్ కోబ్రాలు ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రివేళ చురుకుగా ఉండే ఈ పాములు ప్రమాదం అనిపిస్తే వెంటనే విషాన్ని చిమ్మి తప్పించుకుంటాయి. ప్రకృతి సృష్టించిన ఈ ప్రాణి, పాములు కేవలం కాటుతోనే కాదు.. చూపుతోనే భయం పుట్టించగలవని నిరూపిస్తోంది.
