తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా మాట్లాడితే ఆచితూచి మాట్లాడతారనే పేరుంది. ఏదైనా చేసేట్టు ఉంటేనే చెబుతారని లేకుంటే మాట జారరని అంటుంటారు. కేసీఆర్ సైతం అనేక సందర్భాల్లో చెప్పిన పనులు చేసి చూపించారు. కాళేశ్వరాన్ని కడుతామని బల్లగుద్ధి చెప్పి పూర్తిచేసి చూపించారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడ అంతే. ముందే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ తర్వాతే ప్రకటన చేసేవారు. అనంతరం అమలు కార్యక్రమం మొదలయ్యేది. ఆ జాగ్రత్త మూలంగానే ఆయన మాటకు జనంలో అంత విలువ ఉంది. అలాంటి కేసీఆర్ ఇటీవల సిద్దిపేటలో జరిగిన సభలో సిద్దిఇప్పకు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీంతో అందరి దృష్టి సిద్దిపేట జిల్లా మీద పడింది.
అక్కడే గనుక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వస్తే సిద్ధిపేట సహా చుట్టుపక్కల జిల్లాలు కూడ అభివృద్ధి చెందుతాయని అనుకున్నారు. విమానాశ్రయం రావాలని కోరుకున్నారు. కేసీఆర్ చెప్పారు కాబట్టి వచ్చేస్తుందని ఆశపడ్డారు. కానీ కొందరు మాత్రం సిద్దిపేటలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా సాధ్యమని ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. అయితే శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొన్నేళ్ల పాటు ఇంకొక విమానాశ్రయాన్ని నిర్మించకూడదనే నిబంధన ఉంది. ఈ 30 ఏళ్ల సమయం ఇంకా పూర్తికాలేదు. పైనా సిద్ధిపేట 150 కిలోమీటర్ల పరిధిలోకి రావొచ్చని అంటూ కేసీఆర్ చేసిన ఈ ప్రకటనలో విశ్వసనీయత లేదని, మభ్యపెట్టడానికి చేశారని ఎద్దేవా చేశారు.
ఇలా వాదనలు జరుగుతుండగానే కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దీంతో సిద్ధిపేట జనంలో విమానాశ్రయం మీద ఆశలు చిగురించాయి. కేసీఆర్ చెప్పినట్టే విమానాశ్రయాన్ని త్రీసుకొస్తారని, ఈ పర్యటనలో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి అనుమతులు తీసుకొస్తారని అనుకున్నారు. ఆ ప్రకారమే కేసీఆర్ పౌరవిమానయాన శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిశారు. విమానాశ్రయాల అంశాన్ని చర్చించారు. అయితే ఈ చర్చల్లో సిద్ధిపేట అంతర్జాతీయ వియమానాశ్రయం లేకపోవడం అందరికీ షాకిచ్చింది. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్ కేంద్రం, నిజామాబాద్, మహబూబ్ నగర్ భద్రాద్రి కొత్తగూడెంలలో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటుచేయాలని మాత్రమే కేసీఆర్ కోరారు.
ఇవన్నీ డొమెస్టిక్ ఎయిర్ లయన్స్ విమానాశ్రయాలే. జిల్లాలను రాజధాని హైదరాబాద్ తో అనుసంధానాన్ని పెంచే విమానాశ్రయాలు. వీటి గురించే కేసీఆర్ చర్చించారు తప్ప సిద్ధిపేట అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మాట్లాడలేదట. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఆశపడిన సిద్ధిపేట జనం నిరుత్సాహానికి గురవుతున్నారు. అంత గొప్పగా సభలో చెప్పి ఇప్పుడేమో అసలు ప్రతిపాదనే చేయలేదని, కేసీఆర్ చెప్పిన మాటలు చెవిలో పువ్వులేనని అనుకుంటున్నారు.