బిజెపి జిల్లా అధ్యక్షురాలికే సొంత పార్టీ బిగ్ షాక్

ఆమె పేరు రావు పద్మ. వరంగల్ జిల్లా బిజెపి నాయకురాలు. వరంగల్ అర్బన్ జిల్లా బిజెపికి ఆమె అధ్యక్షురాలు. జిల్లా అధ్యక్షురాలు అయితే మాత్రం ఏం లాభం ఆమెను చీపురుపుల్ల మాదిరిగా తీసి పారేసింది బిజెపి పెద్ద నాయకత్వం. బిజెపి వెలువరించిన రెండో జాబితాలో ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ వివరాలు చదవండి.

వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ పార్టీ కోసం నిత్యం పనిచేస్తూ ఉన్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఆమె నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పనిచేస్తున్నారు. ఇల్లు ఇల్లు, గడప గడప తిరుగుతున్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఆమెకు సీటు గ్యారెంటీ అని అందరూ భావించారు. 

రెండో జాబితా విడుదల చేసిన బిజెపి ఆ జాబితాలో రావు పద్మజారెడ్డి సీటు గల్లంతు చేసింది. దీంతో ఆమెతోపాటు ఆమె అనుచరగణం అగ్రహోదగ్రులయ్యారు. పార్టీ కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన రావు పద్మకు టికెట్ ఇవ్వకుండా సీనియార్టీ పేరుతో వేరేవారికి కట్టబెట్టడమేంటని వారు ప్రశ్నించారు. 

వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున యూత్ ను రావు పద్మ బిజెపిలో చేర్పించారు. నిత్యం ప్రజా ఉద్యమాలు చేపడుతూ వరంగల్ నగరంలో హల్ చల్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక జిల్లా అధ్యక్షురాలికే సీటు రాకపోతే పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఏముంటుందని ఆమె వర్గం ఆగ్రహంగా ఉంది.

అంతేకాకుండా ఆరుసార్లు పోటీ చేసి ఓడిపోయిన ధర్మారావు కు టికెట్ ఇచ్చి రావు పద్మకు మొండిచేయి చూపారెందుకని ఆమె వర్గం సీరియస్ గా ఉంది. ఆమె 2014లో వరంగల్ ఈస్ట్ లో పోటీ చేశారు కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కొండా సురేఖ మీద ఓడిపోయారు. అయితే అప్పుడు వరంగల్ లో పెద్దగా బిజెపి కి జనాల్లో క్రేజ్ లేదు. దాంతోపాటు వరంగల్ ఈస్ట్ లో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి బసవరాజు సారయ్య, టిఆర్ఎస్ నుంచి కొండా సురేఖ పోటీ చేశారు. కొండా సురేఖ గెలిచారు. 

ప్రధాని మోదీతో రావు పద్మ

ఆ తర్వాత వరంగల్ వెస్ట్ సీటులో రావు పద్మ కేంద్రీకరించి పనిచేస్తూ వచ్చారు. తనకే వరంగల్ వెస్ట్ సీటు వస్తుందని ఆమె ఆశతో ఉంటే ఆమె ఆశల మీద కేంద్ర బిజెపి, రాష్ట్ర బిజెపి కలిసి నీళ్లు చల్లారు. తనకు ఆశించిన సీటు ఇవ్వకుండా వద్దనుకున్న సీటును ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అనుచరులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుతం వరంగల్ ఈస్ట్ సీటును పెండింగ్ లో పెట్టింది బిజెపి నాయకత్వం. ఆ సీటు రావు పద్మకు ఇచ్చే చాన్స్ ఉందని బిజెపి రాష్ట్ర పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే రావు పద్మ కు బిజెపి రెండో లిస్టు లో పేరు లేకపోవడం ఆమె కోరిన వరంగల్ వెస్ట్ లో సీనియర్ నేత పేరుతో ధర్మారావును ప్రకటించడం పట్ల ఆమె నిప్పులు చెరిగారు. రావు పద్మ హుటాహుటిన తన అనుచరగణంతో హైదరాబాద్ బిజెపి ఆఫీసుకు చేరుకున్నారు. మాటిమాటికి ఓడిపోయి ఆరు సార్ల ఓటమితో రికార్డు నెలకొల్పిన ధర్మారావుకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. జిల్లా పార్టీ అధ్యక్షురాలికే ఇలా అవమానించడం సరికాదని ఆమె అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రావు పద్మకు టికెట్ నిరాకరణ అంశం  బిజెపి వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

బిజెపి తెలంగాణా ఎన్నికల ఇంచార్జ్ జేపీ నడ్డా ప్రకటించిన 28 మందితో కూడిన మలి జాబితా కింద ఉంది చూడండి.

జాబితాలో 24వ పేరు వరంగల్ వెస్ట్.

1.సిర్పూర్ – శ్రీనివాసులు

2.ఆసిఫాబాద్ -అజ్మీర రామ్ నాయక్

3.ఖానాపూర్- సతుల అశోక్

4.నిర్మల్- సువర్ణ రెడ్డి.

5.నిజాంబాద్ అర్బన్- ఎండల లక్ష్మీనారాయణ

6.జగిత్యాల -రవీందర్ రెడ్డి

7.రామగుండం -బాలుమురి వనిత
8.సిరిసిల్ల- మంగళగిరి నర్సాగౌడ్

9.సిద్దిపేట- నాయిని నరోతం రెడ్డి

10. కూకట్ పల్లి – మాధవరం కాంతారావు

11.రాజేంద్రనగర్- బద్దం బాల్రెడ్డి

12.శేర్లింగంపల్లి -యోగానంద

13.మాలక్ పెట్ -అరే జితేంద్ర

14.చార్మినార్- ఉమా మహేంద్ర

15 చంద్రానిగుట్ట – శహజాది

16. యాకత్ పురా – రూప్ రాజ్

17 బహదూర్ పురా – హనీఫ్ అలీ

18. దేవరకద్ర – ఎగ్గేని నర్సింహాలు సాగర్

19. వనపర్తి – కొత్త అమరేందర్ రెడ్డి

20. నాగర్ కర్నూల్ – నెందురీ దిలీప్ చారి

21 నాగార్జున సాగర్ – కనకాల నివేదిత

22. ఆలేర్ – దొంతిరి శ్రీధర్ రెడ్డి

23.స్టేషన్ ఘనపూర్ – పెరమండ్ల వెంకటేశ్వర్లు

24 వరంగల్ వెస్ట్- ధర్మారావు

25 వర్ధన్నపేట- కొత్త సాగర్ రావు

26.ఇల్లందు – మోకాళ్ళ నాగ స్రవంతి

27 వైరా- భూక్య రేషమ్మ బాయి

28. అశ్వరావుపేట – భూక్య ప్రసాద్ రావు