వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర కావొస్తోంది. ఈ ఏడాదిన్నర పాలనలో వైఎస్ జగన్ పనితీరు ఎలా ఉందనే ఫీడ్ బ్యాక్ తీస్తే జగన్ అభిమానులు, వైసీపీ నేతలు ఆకాశాన్ని అంటేలా గొప్పలు చెబుతుంటారు. మా జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని అంటుంటారు. వైసీపీలో ఒక్కోక ఎమ్మెల్యే, ఎంపీ చెప్పే మాటలు అసాధారణ రీతిలో ఉంటాయి. కొడాలి నాని, రోజాగార్లు అయితే ఏపీ చరిత్రలో జగన్ వంటి గొప్ప ముఖ్యమంత్రి యింకొకరు లేరని అంటుంటారు. విజయసాయిరెడ్డి సంగతి చెప్పనక్కర్లేదు. జగన్ పాలనను చూస్తుంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి పాలన గుర్తుకు వస్తుంది అంటుంటారు. ఇక ప్రతిపక్షాలైతే ఎప్పటిలాగే అసమర్థ పాలనని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోందని, జగన్ పదవీకాలం ముగిసే నాటికి లక్షల కోట్ల అప్పు మిగులుతుందని అంటున్నారు.
ఇలా సొంత వ్యక్తులు గొప్పగా, ప్రత్యర్థులు ఆరోపణల్లా ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మామూలే. కానీ అ జగన్‌కు అత్యంత సన్నిహితులని అనిపించుకున్న వ్యక్తులే నెగెటివ్ అభిప్రాయం చెబితే. అది తప్పకుండా ఆలోచించాల్సిన అంశమే అవుతుంది. వైఎస్ కుటుంబానికున్న వీరవిధేయుల్లో కొండా దంపతుల కుటుంబం కూడ ఒకటి. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వీరు వైఎస్ మరణించాక కూడ జగన్ పక్కనే నిలబడ్డారు. అయన కోసం రాజీనామాలు కూడ చేశారు. అసలు జగన్ కొత్త పార్టీ పెట్టడానికి ప్రోత్సాహం కొండా దంపతుల రాజీనామాలే అంటుంటారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కూడ కొండా ఫ్యామిలీ జగన్ వెంటే ఉన్నారు.
కానీ తర్వాత రాష్ట్రం విడిపోవడం వారు తెలంగాణ రాజకీయాలకు పరిమితం కావడం, టీఆర్ఎస్ పార్టీ నుండి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగాయి. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కొండా దంపతులు జగన్ పాలన గురించి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. జగన్ పాలనను వైఎస్ పాలనతో పోల్చడం గురించి మాట్లాడిన కొండా సురేఖ వైఎస్ పాలనకు, జగన్ పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. వైఎస్ ఎన్నికలు పూర్తై పాలన చేపట్టాక రాజకీయం మర్చిపోయి అందరినీ ఒకేలా చూసేవారని, కానీ జగన్ కక్షపూరిత చర్యలకు దిగుతున్నారని, అది ఏమాత్రం వైఎస్ఆర్ పద్దతి కాదని మొహమాటం లేకుండా అనేశారు. ఈ మాటలు అన్నది వేరే ఎవరైనా అయితే అంత ప్రభావం ఉండేది కాదు కానీ కొండా సురేఖ అనడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్థులు ఆమె మాటల ఆధారంగా విమర్శలు గుప్పిస్తున్నారు.