చక్రం తిప్పిన హరీష్, మహా కూటమికి మరో షాక్

టిఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు చక్రం తిప్పారు. మహా కూటమికి మరో షాక్ తగిలింది. అసలేం జరిగిందో వివరాల కోసం చదవండి.

మహా కూటమిలో కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలు ఉన్నాయి. ఈ నాలుగు పార్టీల్లో చాలా మంది ఆశావహులు ఉన్నారు. కానీ టికెట్ మాత్రం ఒకరికే దక్కుతున్నది. దీంతో మిగతా పార్టీల్లో ఉన్న వారంతా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాల్సిన పనే లేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు లేదా ముగ్గురు ఆశావహులు ఉన్నారు. వారందరినీ బుజ్జగించి ఒకరికే సీటు కట్టబెట్టడం కష్టసాధ్యమైన పనే. అలాంటిడి ఇప్పుడు కూటమి ఏర్పడింది. దీంతో మరింత కష్టాలు తప్పేలా లేవు. దీన్ని ఆసరాగా తీసుకున్న టిఆర్ఎస్ నేత, మంత్రి హరీష్ రంగంలోకి దిగి కూటమికి ఝలక్ ఇచ్చారు.

హరీష్ రావు

మహా కూటమిలో భాగంగా దుబ్బాక సీటు తెలంగాణ జన సమితికి దక్కింది. ఆ సీటులో మాజీ టిఆర్ఎస్ జడ్పీటిసి చిందం రాజేష్ కు సీటు కేటాయించారు. చిందం రాజేష్ బిసి సామాజికవర్గానికి (మున్నూరు కాపు)  చెందిన నాయకుడు. దుబ్బాకలో ప్రస్తుతం టిఆర్ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు. ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో అక్కడ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి  టికెట్ రేస్ లో ఉన్నారు. కానీ జన సమితికి రావడంతో ఆయన నైరాశ్యంలోకి వెళ్లిపోయారు.

ఆయనకు టికెట్ రాలేదని తెలియడంతో ఆదివారం హరీష్ రావు రంగంలోకి దిగారు. తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి నేరుగా చెరుకు ముత్యం రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు. ఇద్దరూ ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించారు. కాంగ్రెస్ లో సీనియర్ నేత అయినా అన్యాయం చేశారని ఆయన వద్ద వ్యాఖ్యానించారు. దీంతో వారి ఆహ్వానంపై చెరుకు ఆలోచనలో పడ్డారు. 

హరీష్ రావు రాగానే చెరుకు ముత్యం రెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. సీనియర్ నేత అయినా తనను పట్టించుకోకుండా కూటమిలో సీటు ఇవ్వలేదని బాధపడ్డారు. దీంతో వెంటనే హరీష్ రావు ఆయనను ఓదార్చారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కుమ్ములాటలు కామనే కదా అని ఆయనను సముదాయించారు. టిఆర్ఎస్ లో సముచిత స్థానం దక్కుతుందని, పార్టీలో జాయిన్ కావాలంటూ ఆహ్వానించారు.

మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి

విశ్వసనీయ సమాచారం ప్రకారం చెరుకు ముత్యంరెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరవచ్చని తెలుస్తోంది. అయితే దీనిపై మరికాసేపట్లో క్లారిటీ రాబోతున్నది. చెరుకు ముత్యంరెడ్డి, హరీష్ రావు జాయింట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది.

మరి రామలింగారెడ్డిని మార్చి చెరుకు ముత్యంరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారా? లేదంటే రామలింగారెడ్డికి చెరుకు మద్దతు ఇస్తారా అన్నది కూడా తేలాల్సి ఉంది.

టిఆర్ఎస్ తో చెరుకు కు సత్సంబంధాలు 

టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెరుకు ముత్యంరెడ్డికి టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మాజీ మంత్రిగా ఉన్న చెరుకు ముత్యంరెడ్డి గతంలో అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయన వైద్యానికి ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలని సిఎం కేసిఆర్ అప్పట్లో ఆదేశాలు ఇచ్చారు. చెరుకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించింది. దీంతో చెరుకు మళ్లీ మామూలు మనిషి అయ్యారు.

చెరుకు ముత్యంరెడ్డితో భేటీ అయిన హరీష్, సోలిపేట రామలింగారెడ్డి

 

కేసిఆర్ చేసిన సాయాన్ని మరచిపోనని అప్పట్లో చెరుకు మీడియా ముందు చెప్పారు. అప్పటినుంచి చెరుకు కాంగ్రెస్ లోనే ఉన్నప్పటికీ హరీష్ రావుతో, కేసిఆర్ తో సత్సంబంధాలు కంటిన్యూ చేశారు. అయితే మహా కూటమిలో సీటు రాకపోవడంతో ఆయనకు టిఆర్ఎస్ వల వేసింది. ఆయన కూడా టిఆర్ఎస్ లో చేరేందుకు సై అన్నట్లు తెలుస్తోంది.