ఆ లక్ష మంది తెలుగు ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ షాక్

అవును మీరు చదివింది నిజమే. అక్షరాలా లక్ష మంది తెలుగు ఓటర్లకు ఎన్నికల కమిషన్ షాక్ ఇవ్వనుంది. అల్లాంటి ఇల్లాంటి షాక్ కాదు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనుంది. వారి నిర్వాకానికి తగిన బుద్ధి చెప్పేందుకు రెడీ అయింది. అంతగా ఆ లక్ష మంది ఏం తప్పు చేశారు? వారికి ఎందుకు షాక్? ఏ రకమైన పనిష్ మెంట్ అన్నది తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

రకరకాల విమర్శలు, ఓట్లను తొలగిస్తున్నారన్న అపవాదులు ఒకవైపు ఎన్నికల కమిషన్ మీద గుప్పిస్తున్నాయి విపక్ష పార్టీలు. ఎన్నికల కమిషన్ అధికార పార్టీల కనుసన్నల్లో పనిచేస్తుందని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఓట్లు గల్లంతవుతున్నాయని ఆ పార్టీలు ఆరోపించాయి. దీంతో ఎన్నికల కమిషన్ ఈనెల 9వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టింది. కొత్తగా నమోదు చేసుకున్న వారి ఓట్లను అనుబంధ ఓటరు జాబితాలో పొందుపరుస్తామని ప్రకటించింది.

ఎన్నికల కమిషన్ రాష్ట్ర సిఇఓ రజత్ కుమార్

ఈనెల 9వ తేదీతో నూతన ఓటరు నమోదు ప్రక్రియ ముగియగా తెలంగాణ మొత్తంలో 2,76,29,610 మంది ఓటర్లు ఉన్నట్లు కమిషన్ లెక్క తేల్చింది. ఇందులో పురుష ఓటర్లు 1,39,35,705 ఉండగా స్త్రీలు 1,36,91,290 మంది ఉన్నారని తేల్చింది. ఇక ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,615 మంది ఉన్నారు. వీరంతా రేపటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.

అయితే లక్షా 16వేల మందికి మాత్రం ఓటు హక్కు ఉన్నప్పటికీ ఓటు వేసేందుకు అనుమతిచ్చేది లేదని ఎన్నికల కమిషన్ సిఇఓ రజత్ కుమార్ తేల్చి చెప్పారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు సందర్భంగా 1.16 లక్షల మంది ఒకటికి మించిన ప్రాంతాల్లో ఓట్లు కలిగి ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. ఓటర్ల తుది జాబితాలో ఆయా వ్యక్తుల పేర్లు ఉన్నప్పటికీ వారిని ఓటు మాత్రం వేయనివ్వబోమని కమిషన్ తేల్చి పారేశింది. వారిని ఏ దశలో వీలైతే ఆ దశలో ఓటు వేసేందుకు రాకుండా అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పింది. పోలింగ్ సమయంలో ఓటర్లకు స్లిప్స్ పంపిణీ చేసే సమయంలోనూ మరో దఫా పరిశీలించి వారిని ఓటు వేయకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఈ 1.16 లక్షల మంది ఓటర్లంతా తెలంగాణలోని ఇతర ప్రాంతల్లో, అలాగే సీమాంధ్రలో సైతం రెండో ఓటును కలిగి ఉన్నట్లు కమిషన్ గుర్తించింది. అందుకే వారికి ఓటు వేసే చాన్స్ ఇవ్వడంలేదని స్పష్టం చేసింది.

ఇలా ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నవారిని కమిషన్ సులువుగానే గుర్తు పట్టింది. ప్రతి ఓటుకు ఆధార్ అనుసంధానం అయి ఉంది కాబట్టి రెండు ఓట్లు కలిగిన వారిని వెంటనే ఆధార్ ద్వారా ఫౌండ్ అవుట్ చేసింది ఎన్నికల కమిషన్. గతంలో ఆధార్ లేని సమయంలో ఒక వ్యక్తి రెండు, మూడు చోట్ల కూడా ఓటు హక్కు కలిగి ఉండేవారు. గ్రామాల్లో ఓటు ఉంచుకుని సిటీల్లో కూడా ఓటు తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ఆధార్ వల్ల అలాంటి ఓటర్లకు చెక్ పడింది. 

ఇక్కడ ఇప్పుడు ఓటు వేసి తర్వాత ఎపిలో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయాలనుకున్న కొందరు దురాశపరులైన ఓటర్లకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం గుణపాఠం లాంటి హెచ్చరిక పంపింది. అయితే కొందరు గ్రామాల్లో ఓటు హక్కు ఉందన్న విషయం మరచిపోయి నగరాల్లో, ఇతర చోట్ల ఓటు హక్కు పొంది ఉన్నారు. దీంతో వారికి కూడా ఓటు హక్కు చాన్స్ లేదంటున్నది ఎన్నికల సంఘం. 

కుల మీటింగ్ ల పై సీరియస్

కుల మీటింగ్ లు పెట్టినట్లు తెలిస్తే సీరియస్ చర్యలు తీసుకోబుతున్నట్లు ఎన్నికల సిఇఓ రజత్ కుమార్ హెచ్చరించారు. మంత్రులు ఈ కుల సంఘాల మీటింగుల్లో పాల్గొని లెక్చర్లు దంచితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే కొందరు నేతలు కుల సంఘాల మీటింగ్ లకు వెళ్లినట్లు ఈసికి ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, పదవుల్లో ఉన్న ఛైర్మన్లు ఈ కుల మీటింగులకు పోతే చర్యలు కఠినంగా ఉంటాయని రజత్ కుమార్ వెల్లడించారు.