ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి చాలెంజింగ్ గా మారాయి. ఎందుకంటే అధికార పార్టీ.. అందులోనూ హైదరాబాద్ ఎన్నికలు అంటే మామూలు విషయం కాదు కదా. గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ ఓడిపోతే ఇంకేమన్నా ఉందా? అందుకే ఈ ఎన్నికల్లో గెలవడం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే అన్నిరకాల ప్లాన్లను సిద్ధం చేసుకుంటోంది.
అయితే.. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికల కోసం ఈసీ ఇప్పటికే అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలోని అన్నిపార్టీల అభిప్రాయాలను కోరింది. గుర్తింపు పొందిన మొత్తం 50 రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం అవడంతో పాటుగా లేఖలు కూడా రాసింది.
దీనిపై 26 పార్టీలు తమ స్పందనను తెలియజేశాయి. వాటిలో మూడు పార్టీలు మాత్రం ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరగా.. మిగిలిన 23 పార్టీలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని విన్నవించాయి.
మెజారిటీ పార్టీలు బ్యాలెట్ పద్ధతి వైపే మొగ్గు చూపడంతో ఎన్నికల సంఘం కూడా మెజార్టీ పార్టీల నిర్ణయంతో ఏకీభవించింది.
అయితే.. టీఆర్ఎస్ పార్టీ కూడా ముందు నుంచి బ్యాలెట్ పద్ధతి ద్వారానే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు పండగ చేసుకుంటున్నారు.
ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలన్నీ బ్యాలెట్ ద్వారానే జరిపామని.. జీహెచ్ఎంసీతో పాటు మిగిలిన కార్పొరేషన్ల ఎన్నికలు కూడా బ్యాలెట్ లోనే నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.