2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గాని,సీఎం జగన్మోహన్ రెడ్డిని కానీ ఇప్పట్లో కొట్టే ఛాన్స్ లేదని అందరు అనుకున్నారు కానీ కరోనా వచ్చి అందరి ఊహలను, అంచనాలను తారుమారు చేసింది. కరోనా వల్ల జగన్ అధికారంలోకి వచ్చిన్నప్పటి నుండి అభివృద్ధి ఏమి జరగలేదు. కరోనాను దాటుకుని ప్రభుత్వం తీసుకున్న దాదాపు అన్ని నిర్ణయాలు కోర్ట్ ల దగ్గర ఆగిపోతున్నాయి. ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇలా కరోనా వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జగన్ కు స్థానిక ఎన్నికల రూపంలో మరో ఇబ్బంది వచ్చిపడింది. వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్ణయాల వల్ల ప్రజల్లో ఇప్పుడు కొంతవరకు వ్యతిరేకత ఉంది. అలా వ్యతిరేకత ఉన్నప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తే ఇబ్బందేనని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.
కొత్త జిల్లాల ప్లాన్ ను అడ్డంకి వేసిన ఈసీ
అభివృద్ధి ఎలాగో కరోనా వల్ల స్తంభించిపోయింది కాబట్టి కనీసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్తే కొంత వరకు ప్రజల్లో వ్యతిరేకత తగ్గి స్థానిక ఎన్నికల్లో జెండా ఎగరవేయవచ్చని వైసీపీ నేతలు భావించారు కానీ ఎన్నికల కమిషన్ దానికి అడ్డుకట్ట వేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాల విభజన చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త జిల్లాల పేరుతోనైనా ఓట్లు అడుగుదామనుకున్న వైసీపీ నేతలకు చిక్కు ఎదురైంది. ఒకవేళ ఈసీ కాదని జిల్లాల విభజనకు పూనుకున్నా కూడా ఫిబ్రవరి వరకు పూర్తి కాదు కాబట్టి ఆ పని కూడా చెయ్యలేరు. స్థానిక ఎన్నికలు ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి చాలా ఇబ్బందులు తేవడమే కాకుండా ఏపీలో రాజకీయ సమీకరణలను మార్చనుంది.
స్థానిక ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటనుందా!!
కరోనా వల్ల వైసీపీ ఎలాంటి అభివృద్ధి పనులను చేయలేకపోయింది కాబట్టి ఈ విషయం ఇప్పుడు టీడీపీ బాగా కలిసి రానుంది. అలాగే మూడు రాజధానుల పేరుతో వైసీపీ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ప్రజలు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ విషయం కూడా టీడీపీకి, చంద్రబాబు నాయుడుకు కలిసి రానుంది. అలాగే ఇప్పుడు వైసీపీ చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాల పట్ల కూడా ప్రజల్లో కొంత వరకు వ్యతిరేకత ఉంది. ఇలా అనేక అంశాలు టీడీపీకి కలిసి రానున్నాయి. ఫిబ్రవరిలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఓడించి టీడీపీ మళ్ళీ తన సత్తాను చాటుకుంటుందో లేదో చూడాలి.