తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధానంగా టీ.ఆర్.ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. వైఎస్సార్టీపీ పార్టీ ద్వారా తెలంగాణలో సత్తా చాటాలని షర్మిల భావిస్తున్నా పార్టీలో షర్మిల మినహా కీలక నేతలు లేకపోవడం మైనస్ అవుతోంది. ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటో తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ కూడా అదే విధంగా ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే షర్మిల ఏకంగా తాను రాష్ట్రానికి సీఎం అవుతానని చెబుతున్నారు.
విశ్లేషకులు మాత్రం షర్మిల సీఎం కావడం అసాధ్యమని ఓవర్ కాన్ఫిడెన్స్ షర్మిలకు మంచిది కాదని సూచనలు చేస్తున్నారు. నెగిటివ్ కామెంట్లకు ధీటుగా బదులివ్వడం కంటే ప్రజలకు మరింత దగ్గర కావడంపై షర్మిల ప్రధానంగా దృష్టి పెట్టాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ఇతర పార్టీలలో చేరి ఉంటే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేవారని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే షర్మిల అనుకున్న విధంగా జరగడం అంత తేలిక కాదు. వైఎస్సార్ కొడుకు అయినప్పటికీ ఏపీ ప్రజలు జగన్ ను నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఏపీలో వైసీపీ హవా కొనసాగుతుందని చెప్పడం కంటే ఇతర పార్టీలు వీక్ గా ఉన్నాయని చెప్పడం కరెక్ట్. తెలంగాణలో మళ్లీ టీ.ఆర్.ఎస్ పార్టీదే అధికారం అని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటే ఈ పరిస్థితి మారే ఛాన్స్ ఉంటుంది.
జగన్ సపోర్ట్ ఉంటే మాత్రమే వైఎస్సార్టీపీకి ప్లస్ అవుతుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్ మాత్రం వైఎస్సార్టీపీ గురించి మాట వరసకైనా మాట్లాడటానికి ఆసక్తి చూపించడంలేదు. అన్నతో విభేదాలు లేవని చెబుతున్న షర్మిల రాబోయే రోజుల్లో జగన్ మద్దతును సొంతం చేసుకుంటుందేమో చూడాలి.