అలా చేస్తే మాత్రమే తెలంగాణలో షర్మిల సక్సెస్ అవుతారా.. ఏం చేయాలంటే?

తెలంగాణ రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న నేతలలో వైయస్ షర్మిల కూడా ఒకరనే సంగతి తెలిసిందే. కేసీఆర్ పై తరచూ విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న షర్మిల తాజాగా కేసీఆర్ పై మరో మారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని ఆమె వెల్లడించారు. రాష్ట్ర ప్రజలను సైతం కేసీఆర్ మోసం చేశారని ఆమె చెప్పుకొచ్చారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇస్తానని చెప్పి మోసం చేశారని షర్మిల అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం బంగారం లాంటి రాష్ట్రమని కేసీఆర్ వల్ల ప్రస్తుతం ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయ్యిందని ఆమె పేర్కొన్నారు. 16 వేల కోట్ల రూపాయల మిగులు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉండటానికి కేసీఆర్ కారణమని షర్మిల కామెంట్లు చేశారు. కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇవ్వలేదని ఆమె అన్నారు.

షర్మిల చేసిన కామెంట్లపై కేసీఆర్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ షర్మిల కేసీఆర్ పై ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. అయితే షర్మిల మినహా మరో బలమైన నేత లేకపోవడం వల్ల షర్మిల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ నుంచి సపోర్ట్ లేకపోవడం కూడా షర్మిలకు ఒకంత మైనస్ అని చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టిపి పార్టీ బలపడటానికి షర్మిల కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర రాజకీయ నాయకుల నుంచి విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ముందడుగులు వేస్తే షర్మిల కోరుకున్న సక్సెస్ దక్కడానికి ఎంతో సమయం పట్టదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.