సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. గురువారం అర్ధరాత్రి తరువాత నుండి వాంతులు మొదలయ్యాయి. దానికితోడు ఛాతినొప్పి కూడా తీవ్రంగా రావటంతో మోత్కుపల్లిని హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక పరీక్షలు చేసిన తర్వాత వెంటనే హైదరాబాద్ లోని సుప్రజ ఆసుపత్రికి తరలించారు. అవసరానికి అంబులెన్సు రాకపోవటంతో వేరే దారిలేక సొంత వాహనంలోనే మోత్కుపల్లిని ఆసుపత్రికి తరలించారు.
ఎన్నికల్లో మోత్కుపల్లి యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుండి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్ధిగా పోటీలో ఉన్నారు. ప్రచారంతో ఇన్ని రోజులు చాలా బిజీగా ఉన్న మోత్కుపల్లి హఠాత్తుగా పోలింగ్ కు ముందు రోజు తీవ్ర అస్వస్ధతకు గురికావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో దెబ్బతినటం, పోటీ చేస్తున్న మిగిలిన అభ్యర్ధుల కన్నా అన్నీ విధాల వెనకబడటం లాంటి అనేక కారణాల వల్ల మోత్కుపల్లిలో టెన్షన్ పెరిగిపోయుంటుందని అనుకుంటున్నారు.
చాలా కాలంగా మోత్కుపల్లికి చంద్రబాబునాయుడుతో పడటం లేదు. టిఆర్ఎస్ లో పొత్తుపెట్టుకోవాలని, లేకపోతే విలీనం చేసేయాలని ఎప్పటి నుండో మోత్కుపల్లి డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంటే టిడిపిలోనే ఉంటు మోత్కుపల్లి టిఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడేవారు. పొత్తులు, విలీనంపై మోత్కుపల్లి గోల ఎక్కువైపోవటంతో చేసేది లేక చివరకు మోత్కుపల్లిని చంద్రబాబు పార్టీ నుండి బహిష్కరించారు.
పార్టీ నుండి బహిష్కరణకు గురవ్వగానే తాను అన్నీ పార్టీలు నెత్తిన పెట్టుకుంటాయని మోత్కుపల్లి అనుకున్నారు. అంటే ఒక విధంగా తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకున్నారు. అయితే ఏ పార్టీ కూడా మోత్కుపల్లిని పిలవలేదు. టిడిపిలో ఉన్నంత వరకూ ఏ పార్టీ తరపునైతే మాట్లాడారో కనీసం ఆ పార్టీ (టిఆర్ఎస్) కూడా మోత్కుపల్లిని పట్టించుకలేదు. దాంతో చేసేది లేక బిఎల్ఎఫ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. చివరకు ఈరోజు అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చేరారు.