టీడీపీకి సూపర్ షాక్: సీనియర్ నేత వికెట్ డౌన్.?

తెలుగుదేశం పార్టీకి సూపర్ షాక్ తగలబోతోందట. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ప్రాతినిథ్యం వష్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీని వీడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ‘నేనిప్పుడు మాట్లాడలేను’ అంటూ పార్టీ వీడటం గురించి మీడియా ప్రశ్నిస్తే సమాధానమిచ్చారు గోరంట్ల. అంటే, గోరంట్ల తీవ్ర అసంతృప్తితోనే పార్టీ అధిష్టానంపై వున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం ఆయన్ని బుజ్జగిస్తుందా.? బుజ్జగింపులకు ఆయన దిగొస్తారా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. గోరంట్ల అసహనం టీడీపీకి కొత్తేమీ కాదు. గతంలో ఆయన పలుమార్లు పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో గుస్సా అయ్యారు. ఈసారి మాత్రం రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారట.

టీడీపీని వీడటంతోపాటుగా ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేయాలన్నది గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, ఆయన రాజకీయాల్లో కొనసాగుతారనీ, టీడీపీలోనే వుంటారనీ.. టీడీపీ నేతలు కొందరు చెప్పుకొస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణ పరాజయం తర్వాత పార్టీకి పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. అందులో పలువురు ఎమ్మెల్యేలు కూడా వున్నారు. ఎంపీల విషయానికొస్తే, కేశినేని నాని కొంత అసహనంతో వున్నారు పార్టీ అధిష్టానంపైన. ఓ వైపు నారా లోకేష్, టీడీపీకి కొత్త ఉత్సాహన్ని తీసుకొస్తున్నారనే ప్రచారం తెలుగు తమ్ముళ్ళ నుంచి గట్టిగా సాగుతుండగా, ఇంకోపక్క టీడీపీలో యధాతథంగా అసంతృప్తి పెరిగిపోతుండడం గమనార్హం. ‘ఈ వారంలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడబోతున్నారు..’ అంటూ టీడీపీ అనుకూల మీడియా స్పష్టంగా పేర్కొంటుండడం గమనార్హం.