తెలంగాణలో టిఆర్ఎస్ అవుట్, మహా కూటమిదే అధికారం

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ కు బిగ్ షాక్ తగలనుందా? ముందస్తు ఎన్నికలకు పోయిన ఆ పార్టీని జనాలు తిరస్కరించే చాన్స్ ఉందా? మహా కూటమి భారీ మెజార్టీతో అధికారం చేజిక్కించుకోబోతున్నదా? అంటే ఒక కోయిల ముందే కూసినట్లు ఒక సర్వే ఇదే మాట చెప్పింది. సంచలనం రేపిన కొత్త సర్వే ఫలితాలు.. ఆ వివరాలేంటో చదవండి.

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమవుతున్నాయని పసిగట్టిన కేసిఆర్ ఆ పార్టీల ఫ్రెండ్ షిప్ ఫిక్స్ కాకముందే ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి మళ్లీ గెలవాలనుకున్నారు.  ప్రతిపక్ష కూటమిని చావుదెబ్బ తీయాలనే ఉద్దేశంతో ముందస్తు సమరానికి తెర తీశారు. అసెంబ్లీ రద్దు వెనువెంటనే 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంలచనం రేపారు.

కానీ క్షేత్ర స్థాయిలో కేసిఆర్ కు అంతటి సానుకూలత లభించడేంలేదని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో మహా కూటమిదే అధికారం అని ఒక సర్వే సంచలనం రేపింది. అయితే ఈ సర్వే అసెంబ్లీ స్థానాలను పరిగణలోకి తీసుకుని చేసింది కాదు. పార్లమెంటును పరిగణలోకి తీసుకుని చేశారు. జాతీయ మేడియాలో మేటి సంస్థగా ఉన్న రిపబ్లిక్ టివి వారు ఈ సర్వే చేపట్టారు. ఈ సర్వే వివరాల ప్రకారం తెలంగాణలో గతం కంటే టిఆర్ఎస్ కు ఆదరణ తగ్గిందని తేలింది. కూటమి పార్టీలకు ఓటింగ్ శాతం పెరిగిందని తేల్చింది రిపబ్లిక్ సి ఓటర్ సర్వే.

రిపబ్లిక్ సర్వే ప్రకటించిన లెక్కల ప్రకారం తెలంగాణలో మహా కూటమిదే అధికారం ఖాయమని తేలింది. మహా కూటమిగా జట్టు కట్టిన పార్టీలకు లోక్ సభ సీట్ల, ఓటింగ్ శాతం పెరగబోతున్నట్లు తేల్చింది. ఈ ఎన్నికల్లో బిజెపి, ఎంఐఎం పార్టీలు మళ్లీ చెరొక పార్లమెంటు సీటు సాధిస్తాయని చెప్పింది.

టిఆర్ఎస్ గత ఎన్నికల్లో 11 సీట్లు సాధిస్తే ఈసారి ఆ సంఖ్య 7కు పడిపోతుందని రిపబ్లిక్ సర్వే తేల్చింది.

కాంగ్రెస్, టిడిపి అలయెన్స్ కు 8 సీట్లు వస్తాయని లెక్కలు వెల్లడించింది సర్వే.

2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ 11 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. బిజెపి ఒక సీటు, ఎంఐఎం ఒక సీటు, వైసిపి ఒక సీటు గెలిచాయి.

కానీ తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో బంగారు తెలంగాణ పేరుతో టిడిపి ఎంపి (మల్కాజ్ గిరి – మల్లారెడ్డి) టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. వైసిపి ఎంపి (ఖమ్మం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి) టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. కాంగ్రెస్ ఇద్దరు ఎంపీల్లో ఒక ఎంపి (నల్లగొండ – గుత్తా సుఖేందర్ రెడ్డి) బంగారు తెలంగాణ కోసం నడుం బిగించి టిఆర్ఎస్ లో చేరిపోయారు. ఇలా 11 సీట్లు గెలిచిన టిఆర్ఎస్ మరో మూడు సీట్ల బలం పెంచుకుని 14కు చేరింది. 

అంటే ఇప్పుడున్న అనధికార లెక్కల ప్రకారం చూస్తే 14 సీట్ల బలం నుంచి టిఆర్ఎస్ సగానికి సగం పడిపోతుందని తేల్చి పారేసింది రిపబ్లిక్ సి ఓటర్ సర్వే. ఈ సర్వే పార్లమెంటు సీట్లకోసమే చేసినా అసెంబ్లీకి కూడా రిఫ్లెక్ట్ అవుతాయని రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. 

అంతేకాకుండా ఓటింగ్ శాతాన్ని కూడా రిపబ్లిక్ వెల్లడించింది. యూపిఎ కూటమి (కాంగ్రెస్ పార్టీకి) 32.2 శాతం ఓటింగ్ రాబోతుందని తేల్చింది.  అలాగే ఎన్డీఎ కూటమి (బిజెపి) కి 19 శాతం ఓట్లు రాబోతున్నాయని చెప్పింది. ఇక టిఆర్ఎస్ కు 30.4 శాతం ఓటింగ్ మాత్రమే రాబోతున్నట్లు తేల్చింది. దాంతోపాటు ఎంఐఎం పార్టీకి 3.9 శాతం ఓటింగ్ నమోదు కావొచ్చని అంచనాలు వేసింది.

ఈ లెక్కలు చూసినా టిఆర్ఎస్ కంటే యుపిఎ కూటమి గా చెప్పబడుతున్న కాంగ్రెస్ కు 2.2 శాతం ఓటింగ్ పెరిగిందని తేలింది. ఇతరులకు 14.6 శాతం ఓటింగ్ చూపెట్టింది. ఈ 14.6 శాతంలో కూటమి పార్టీల ఓటింగ్ కూడా ఉన్నట్లు చెప్పినట్లైంది. ఈ ఓటింగ్ శాతం లెక్కలు ఎటు కూడినా, తీసేసినా కాంగ్రెస్ కూటమికే ఎడ్జ్ ఉందని తేల్చింది రిపబ్లిక్ సర్వే. టిఆర్ఎస్ ఓటింగ్ ఎంఐఎం కూడితే 34.3 శాతంగా నమోదయ్యే చాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ యుపిఎకు 32.2కు ఇతరుల కోటాలో ఉన్న 14.6 ఓటింగ్ లో ఏమాత్రం కలిపినా కాంగ్రెస్ విజేతగా నిలిచే చాన్స్ ఉంది. 

రిపబ్లిక్ సి ఓటర్ సర్వే జాతీయ స్థాయిలో పేరున్న సర్వే సంస్థగా నిలిచింది. ఈ సర్వే ఫలితాలు చాలా సందర్భాల్లో వాస్తవాలను ప్రతిబింబించాయి. అయితే కొన్నిసార్లు ఈ సర్వే నివేదికలు కూడా తప్పాయనుకోండి.

కేసిఆర్ సర్వేల మాటేమిటి? 

తెలంగాణలో కేసిఆర్ సర్కారు కొలువుదీరిన నాటినుంచి సర్వేలు చేస్తూ వచ్చారు. ఆయన చేయించిన ప్రతి సర్వేలో టిఆర్ఎస్ కు అనుకూలంగానే వచ్చాయని చెప్పుకున్నారు. అసలు మిగతా పక్షాలు సోదిలోనే లేవు అన్నట్లు కేసిఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. మొన్న కొంగర కలాన్ సభ తర్వాత జరిగిన సభల్లోనూ, తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలోనూ మిగతా పక్షాలన్నీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతాయన్నారు.  మరి ఈ సర్వే మాత్రం ఇలా చెప్పంది ఏంటి చెప్మా అని రాజకీయ వర్గాలు ఆసక్తి కరమైన చర్చల్లోకి దిగాయి.