ఉస్మానియా విద్యార్థులకు రాహుల్ గాంధీ బంపర్ ఆఫర్

ఉస్మానియా యూనివర్శిటీ అగ్ని కెరటం లాంటిది. ఎంతోమంది రాజకీయ నాయకులను ఉస్మానియా యూనివర్శిటీ తయారు చేసింది. నాటి జైపాల్ రెడ్డి మొదలుకొని నేడు బాల్క సుమన్, గాదరి కిశోర్ వరకు ఎంతో మంది నాయకులు ఉస్మానియా నుంచే పుట్టుకొచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర మరవలేనిది. హైదరాబాద్ గడ్డమీద సీమాంధ్ర ఆధిపత్యం ఎక్కువగా ఉన్న తరుణంలో ఉస్మానియా యూనివర్శిటీనే ఉద్యమాన్ని నడిపింది. ఈ యూనివర్శిటీ విద్యార్థులే హైదరాబాద్ లోనూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిలబెట్టారు.

తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉస్మానియా పరిస్థితులు కంప్లీట్ డిఫ్రెంట్ అయ్యాయి. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ నేతలు ఉస్మానియాలో కాలు పెట్టాలంటే గజగజ వనికిపోయారు. టిఆర్ఎస్ నేతలు ఉస్మానియాలో స్వేచ్ఛగా తిరిగారు. టిఆర్ఎస్ నేతలను అప్పుడు భుజాల మీద మోశారు ఉస్మానియా స్టూడెంట్స్. కానీ మరి తెలంగాణ వచ్చిన తర్వాత సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ నేతలకు ఉస్మానియాలోకి ఎంట్రీ దొరికింది. వారు స్వేచ్ఛగా ఉస్మానియాలో తిరిగే వెసులుబాటు వచ్చింది. టిఆర్ఎస్ నేతలు మాత్రం ఉస్మానియా పొలిమేరల్లో కూడా కాలు పెట్టలేని వాతావరణం ఏర్పడింది. అంతేకాదు పెద్ద సంఖ్యలో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని సిఎం కేసిఆర్ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సమయంలోనే విద్యార్థులు తమ తడాఖా చూపించారు. కేసిఆర్ సిఎం హోదాలో శతాబ్ధి ఉత్సవాల్లో మాట్లాడకుండానే వెనుదిరిగారు. ఇది అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

ఉస్మానియా విద్యార్థి నేతలతో సమావేశమైన రాహుల్, ఉత్తమ్.

ఇక ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలన్నా.. ఆ పార్టీని రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నా ఉస్మానియా లాంటి బలమైన విద్యార్థి శక్తిని వినియోగించుకోవాలన్న ఉద్దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. అందుకే మొన్న ఉస్మానియాలో రాహుల్ గాంధీతో సభ పెట్టించేందుకు ప్రయత్నం చేసింది. కానీ తెలంగాణ సర్కారు నుంచి అనుమతి రాలేదు. దీంతో సభ జరపలేదు. కానీ అతి తొందరలోనే ఉస్మానియాలో సభ జరిపేందుకు ఓయు జెఎసి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకునైనా సభ ఏర్పాటు చేసే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సెప్టెంబరులో రాహుల్ పర్యటన ఉన్న నేపథ్యంలో అప్పుడు రాహుల్ సభ ఉస్మానియాలో జరిపేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే రానున్న ఎన్నికల్లో ఉస్మానియా స్టూడెంట్స్ కు టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఇటు పిసిసి నాయకత్వం అటు రాహుల్ గాంధీ కూడా ఉన్నట్లు ఓయు జెఎసి నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఏ నియోజకవర్గాల్లో ఉస్మానియా విద్యార్థులకు టికెట్లు ఇచ్చే అవకాశం ఉందో అంచనాలు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన ఓయూ జెఎసి ముఖ్య నేతలకు టికెట్లు ఇచ్చింది. బాల్క సుమన్ ఎంపిగా టికెట్ ఇస్తే గెలిచారు. గాదరి కిశోర్ కు ఎమ్మెల్యేగా ఇస్తే గెలిచారు. అలాగే పిడమర్తి రవికి కూడా అసెంబ్లీ సీటు ఇస్తే ఓడిపోయారు. 2014లో టిఆర్ఎస్ పార్టీ ముగ్గురు ఉస్మానియా నేతలకు టికెట్లు ఇచ్చింది. అయితే ఉస్మానియాకు చెందిన బిసి, ఓసి లీడర్లెవరికీ టిఆర్ఎస్ టికెట్లు ఇవ్వలేదు. కేవలం ఎస్సీ విద్యార్థి నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చింది.

ఈసారి కాంగ్రెస్ కూడా ఉస్మానియా విద్యార్థులకు అవకాశాలు కల్పించనున్నట్లు చెబుతున్నారు. మొన్న రాహుల్ టూర్ లో కూడా ఓయూ స్టూడెంట్స్ తో 15 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో ఈ విషయమే ప్రధానంగా చర్చించినట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో 5 నుంచి 8 టికెట్లు ఉస్మానియా స్టూడెంట్స్ కు ఇచ్చే అవకాశముందని చెబుతున్నారు. ఇందులో దళిత, బిసి కాంబినేషన్ లో టికెట్లు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. టికెట్లు ఇచ్చే వారి జాబితా కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నది.

విద్యార్థి నాయకులు వారు ఆశిస్తున్న నియోజకవర్గాలు.

1.రాజారామ్ యాదవ్ – బాల్కొండ

2.వున్న కైలాష్ నేత – మునుగోడు లేదా భువనగిరి పార్లమెంటు

3.మానవతారాయ్ -సత్తుపల్లి

4.చారకొండ వెంకటేష్ – అచ్చంపేట.

5.దరువు ఎల్లన్న – ధర్మపురి.

6.దుర్గం భాస్కర్ – బెల్లంపల్లి.

7.మేడిపల్లి సత్యం – చొప్పదండి.

8.క్రిశాంక్ – కన్తోన్మెంట్.

9. కొనగాల మహేష్ – వేములవాడ.

వీరందరికీ టికెట్లు దక్కొచ్చన్న ప్రచారం అయితే జోరందుకుంది.అయితే రానున్న ఎన్నికల్లో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉంటే వీరిలో కొందరికి టికెట్లు రాకపోవచ్చు. వేరే నాయకులకు టికెట్లు రావొచ్చు. మొత్తానికైతే గత ఎన్నికల్లో ఒకే సామాజికవర్గం వారికి టిఆర్ఎస్ మూడు టికెట్లు ఇస్తే ఈసారి దళిత, బిసి వర్గాలకు 5నుంచి 8 టికెట్లు ఇవ్వాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టే ఏడెనిమిది టికెట్లు విద్యార్థి నేతలకు ఇచ్చే పరిస్థితి ఉంటే రానున్న ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ తో పాటు కొత్తగా బరిలోకి దిగనున్న తెలంగాణ జన సమితి కూడా ఇదే తరహాలో విద్యార్థి నేతలకు టికెట్లు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు.