ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా దొరికింది టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం. ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది మొదలు… విపక్షాలకు నోటినిండా పని దొరికింది. ఇదే సమయంలో సమర్ధించే ప్రయత్నంలో – డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో అడ్డంగా ఇరుకున్నారు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రి కేటీఆర్! అసలు ఆయనకేమి సంబంధం.. ఆయన విద్యాశాఖా మంత్రి కాదు.. హోం మంత్రీ కాదు.! కానీ… సకల శాఖా మంత్రి హోదాతో స్పందించారు.. సరెండర్ అయిపోయారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించడం లేదనే చెప్పాలి. వచ్చే ఎన్నికల వరకూ ఈ విషయం లైవ్ లో ఉండాలని ప్రతిపక్షాలు కొరుకుంటున్నాయో ఏమో తెలియదు కానీ… ఈ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది.. రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. దీంతో.. కాంగ్రెస్ – బీజేపీ – బీఎస్పీ లు వరుసపెట్టి ఆందోళనలు చేస్తున్నాయి. ఇక ఉస్మానియా యూనివర్సిటీ అయితే రణరంగంగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే… కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, విద్యార్థిసంఘాలు డిమాండ్ చేయడం ఇంకొకెత్తు.
ప్రశ్నపత్రాలు లీకేజీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా విలేకరుల ఎదుటకు కేటీఆర్ హాజరయ్యారు. వెంట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇంకా కొంతమందిని వెంట పెట్టుకొని వచ్చారు కానీ.. వారెవరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ మాత్రమే సమాధానం ఇచ్చారు. ఆ సమాధానలతో వ్యవహారం మొత్తాన్ని సమర్ధించేపనికి పూనుకున్నారు. సిట్ వెయ్యకముందే… దోషులు ఎంతమందో తేల్చి చెప్పేశారు. దీంతో ఈ వ్యవహారంలో కేటీఆర్ దే కీలక పాత్ర అనే పాయింటు వెలుగులోకి వచ్చిది.
సాధారణంగా అలాంటి పని జరిగినప్పుడు, ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు… స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థగా… ఇలాంటి సమయంలో సాధారణంగా టీఎస్పీఎస్సీ అధికారులు విలేకరుల ముందుకు రావాలి. జరిగిన తప్పు ఏమిటో చెప్పాలి. విలేకరులు సంధించే ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇవ్వాలి. కానీ టీఎస్పీఎస్సీ విషయంలో అది జరిగింది వేరు. దీంతో… ప్రతిపక్షాలు కేటీఆర్ ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ డిమాండ్ లపై స్పందిస్తున కేటీఆర్… అయితే తాను ఎలా బాధ్యుడిని అవుతానంటూ కేటీఆర్ తిరుగు ప్రశ్న వేస్తున్నారు.
దీంతో… సంబంధం లేనప్పుడు విలేకరుల సమావేశం ఎందుకు పెట్టారని కేటీఆర్ ను సూటిగా ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు. కేవలం ఆ ఒక్క కారణమే కాకుండా… టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం అనేది కంప్యూటర్లలో ఉంటుంది. దీనిని తెలంగాణ ఐటీ విభాగం పర్యవేక్షిస్తుంది. అంటే కేటీఆర్ అండర్ లో ఉన్న ఐటీ విభాగపు పరోక్ష పాత్ర లేకుండా ప్రశ్న పత్రం లీకెలా అవుతుంది. ఐటీ విభాగం గట్టిగా ఉన్నా కూడా లీకైంది అంటే… ఆ వింగ్ లో వారు కూడా ఇందులో భాగస్వాములు అనుకోవచ్చు . సో… అలా చూసినా కూడా తన శాఖ పనితీరులోని లోపాలకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
మరోవైపు సామాజిక మాధ్యమాల్లో కూడా #resignKTR అనే క్యాంపెనింగ్ కూడా మొదలుపెట్టాయి విపక్షాలు. దీంతో కేటీఆర్ స్పందించాల్సి రావడం అనివార్యం అయ్యింది. ఇందులో భాగంగా కార్యక్రమం ఏదైనా, సందర్భం మరేదైనా… ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇలా ఆఖరికి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాల్లోనూ కేటీఆర్ దీని గురించే పదే పదే ప్రస్తావించాల్సి వస్తోంది. దీంతో ఇలా కేటీఆర్ పదేపదే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితుల వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ ఆత్మరక్షణ వ్యవహారం కాస్తా.. వాస్తవాంగీకారంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు!