నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని దశమి కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో పేలుడు సంభవించి పాకాల శేఖర్ అనే కార్మికుడు చనిపోగా మరోక కార్మికుని పరిస్థితి విషమంగా ఉంది. దశమి కంపెనీ విస్తరణ పై నెల రోజుల కిందనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. గ్రామంతో పాటు మరో పది ఊర్ల ప్రజలు ఈ కంపెనీలు మాకొద్దురయ్యా అని మొత్తుకున్న కూడా పట్టించుకోకుండా అధికారులు, నాయకులు కుమ్మక్కై పరిశ్రమ విస్తరణకు అవకాశాలిచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
పరిశ్రమలో కనీస రక్షణ చర్యలు లేకుండా పని చేయిస్తున్నారని ఇతర రాష్ట్రాల కార్మికులను తీసుకొచ్చి వారి చేత గొడ్డు చాకిరి చేయిస్తున్నారన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాకాల శేఖర్ దశమి కంపెనీలో కార్మికునిగా పని చేస్తున్నాడు. శనివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కంపెనీలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శేఖర్ తో పాటు బీహార్ రాష్ట్రానికి చెందిన కార్మికుడు కూడా ఉన్నాడు. ఈ ప్రమాదంలో వీరిద్దరు కూడా పూర్తిగా కాలిపోయారు.
శేఖర్ కంపెనీలోనే మరణించాడని కానీ కంపెనీ వారు ఎవ్వరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారని ఆ తర్వాత హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారని గ్రామస్థులు తెలిపారు. అయితే బిహార్ కార్మికునికి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. శేఖర్ నిన్ననే చనిపోయినా కూడా ఠాగూర్ సినిమా సీన్ ను తలపించేలా కంపెనీ వాళ్లు చికిత్స అందించారని గ్రామస్తులు తెలిపారు. శేఖర్ చాలా పేదకుటుంబానికి చెందిన వాడని అతని కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని వారు కోరారు.
వెలిమినేడు గ్రామంలో కంపెనీల విస్తరణ వల్ల కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటామని ఈ ప్రమాదాల వల్ల ఇంకెంత మంది ప్రాణాలు బలిగొట్టారని పర్యావరణ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ నాయకులు గతంలో పర్మిషన్ ఇచ్చిన కంపెనీలని దానికి ఏం చేయలేమని చెప్పి నిస్సహాయత వ్యక్తం చేశారు. వాస్తవానికి గతంలో ఇచ్చినా ప్రస్తుత విస్తరణను ఆపే అధికారం ఉంటుందని అది కూడా తెలియని వారు నాయకులయ్యారని వారు ఎద్దేవా చేశారు.
గ్రామంలో సరిగ్గా నెల రోజుల కిందట తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. విస్తరణను ఆపాలని అన్ని గ్రామాల ప్రజలు కోరారు. దీనికి కంపెనీ వాళ్లు భారీ బందోబస్తు పెట్టి ప్రజల గొంతును అణచి వేసే ప్రయత్నం చేశారు. వారు కూడా అంతే పట్టుదలతో తిరగబడడంతో లాఠీ చార్జీ చేయించారు. అక్రమ అరెస్టులు చేయించారు.
కంపెనీ వాళ్ళు పోలీసులకు , రెవిన్యూ అధికారులకు లంచం ఇచ్చారని వాటన్నింటిని త్వరలోనే ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి బయట పెడుతామని గ్రామ యువకులు తెలిపారు. వారందరిని సస్పెండ్ చేసే వరకు తాము పోరాడుతామన్నారు. మనుషుల ప్రాణాలు లెక్కలేలా అంటూ వారు మండి పడ్డారు. నిన్న ఘటన జరిగినా కూడా పేపర్లు, టివిలలో రాకుండా మేనేజ్ చేశారని వారు తెలిపారు.
జెసి నారాయణ రెడ్డి, కంపెనీలకు మద్దతు పలికిన వారు, అధికారులు, పోలీసులు వీరంతా ఈ ప్రమాదం పై సమాధానం చెప్పాలన్నారు. తాము వద్దురయ్యా అని మొత్తుకున్నా కూడా పట్టించుకోకుండా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జెసి నారాయణ రెడ్డి … శేఖర్ ప్రాణాన్ని తెచ్చిస్తావా ఇప్పుడు అంటూ శేఖర్ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
శేఖర్ మృతికి జెసి తో పాటు కంపెనీ వారే కారణమని కలెక్టరేట్ ముందు శేఖర్ డెడ్ బాడీ ఉంచి నిరసన తెలుపుతామన్నారు. 50 లక్షల ఎక్స్ గ్రేషియా, శేఖర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. కొందరు మాత్రం ఈ ప్రమాదం వెనుక కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని శవాలపై పేలాలు ఏరుకునే వాళ్లకు తగిన బుద్ది తప్పదని గ్రామ యువకులు హెచ్చరించారు.