ఇందుకే కదా… పవన్ ని సార్ధక నామదేయుడు అనేది!

సాధారణంగా వారాహి యాత్రల సమయంలో మాత్రమే ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా కనిపించే పవన్ కల్యాణ్… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా చంద్రబాబు అరెస్టైనప్పటినుంచీ మరింత యాక్టివ్ గా కనిపిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఒకటి కాదు రెండు పార్టీల కేడర్ ను యాక్టివ్ గా ఉంచాల్సిన బాధ్యత ఉండటంతో… పనిలో పనిగా తెలంగాణ రాజకీయాలపైనా దృష్టి పెట్టారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన తర్వాత… ఆ గ్యాప్ ను లోకేష్ ఫిల్ చేయలేకపోయారు. రెండు మూడు రోజులు తండ్రికి క్యారేజ్ పంపడంపై శ్రద్ధ చూపించిన ఆయన… అనంతరం కేరాఫ్ హస్తినాపురం గా మారిపోయారు. ఢిల్లీలో ఎందుకు ఉన్నారు, అక్కడ ఏమి చేస్తున్నారు అనే విషయాల సంగతి కాసేపు పక్కనపెడితే… తాజాగా ఏపీకి వచ్చారు.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ కి బాధ్యత పెరిగిందని అంటున్నారు. అటు టీడీపీ కేడర్ ని ఉత్సాహంగా ఉంచడం కోసం నిత్యం వైసీపీపై అవాకులూ చెవాకులూ పేళాల్సిన బాధ్యత కూడా ఉంది. అలా సాగుతున్న పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయ వ్యూహాల సంగతి కాసేపు పక్కనపెడితే… తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ సుమారు 32 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు.

అయితే ఆ 32 నియోజకవర్గాలే ఎందుకు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉందా.. లేక, ఆ నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ ఫ్యాన్ బెల్ట్ ఉందా.. అదీగాక, అక్కడే బలమైన అభ్యర్థులు ఉండి, పోటీకి ఉత్సాహం చూపిస్తున్నార అంటే… ఆ ప్రశ్నలకు సమాధానం పవన్ దగ్గర కూడా లేదనే మాటలు వినిపిస్తున్నాయి.

అయితే ఏపీలో కలిసే పోటీ చేస్తున్న జనసేన – టీడీపీ… తెలంగాణలో మాత్రం ఎందుకు విడివిడిగా పోటీ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే… తెలంగాణలో జనసేన పోటీ చేయటం ద్వారా ఓట్ల చీలికకు తప్పించి మరి దేనికైనా ఉపయోగపడుతుందా అనేది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న!

ఏపీలో విడి విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోద్దని ఆందోళన వ్యక్తం చేస్తున్న పవన్ కల్యాణ్… తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీడీపీ లు ఇప్పటికే పోటీ పడుతుంటే… జనసేన కూడా రంగంలోకి, అది కూడా సింగిల్ గానే ఎందుకు పోటీ చేస్తుంది అనేది కీలకమైన ప్రశ్నగా ఉంది.

పైగా… తెలంగాణలో తన పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తాయా అనే విషయం మీద క్లారిటీ లేనప్పుడు పోటీకి దింపటం ద్వారా బలం కంటే బలహీనతను ప్రదర్శించుకున్నట్లవుతుందనే ఆలోచన పవన్ చేయడం లేదా అని అంటున్నారు. అయితే… తెలంగాణలో జనసేన పోటీ చేయడం వెనుక అధికార బీఆరెస్స్ కు ప్రయోజనం చేకూరడం కోసమే అని అంటున్నారూ పరిశీలకులు.

దీంతో… పైగా జనసేన పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో టైట్ ఫైట్ ఉంటుందని, అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు మరింత గండి కొట్టడం అవసరం అని చెబుతున్నారు. దీంతో… తన మీద ప్రత్యర్థులు తరచూ ఆరోపించే.. ప్యాకేజీ స్టార్ మాటకు తగ్గట్లే పవన్ తీరు ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పోటీ నిర్ణయం, ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.

దీంతో… వైసీపీ నేతలు “ప్యాకేజీ స్టార్” అని చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా… ఆ పేరుకు, బిరుదుకు న్యాయం చేసేలా పవన్ రాజకీయ ప్రయాణం చేస్తున్నారని అంటూ… ఇదేనేమో సార్ధక నామధేయుడు అంటే అని అంటున్నారు నెటిజన్లు!