షాకింగ్ న్యూస్ : తెలంగాణ అభ్యర్థులకు గుడ్లగూబ టెన్షన్

అవును మీరు చదివిన ముచ్చట నిజమే. తెలంగాణలో కొన్ని పార్టీల అభ్యర్థులకు గుడ్లగూబ టెన్షన్ పట్టుకున్నది. ఎక్కడ ఆ గుడ్లగూబలో తమను ఓడిస్తాయోనన్న భయంతో వనికిపోతున్నారు. అందరూ అలాగే ఉన్నారా అంటే అందరు కాదుగానీ కొందరు మాత్రం గుడ్లగూబ భయంతో ఉన్నారు. ఇంతకూ గుడ్లగూబలు అభ్యర్థులను ఎలా ఓడిస్తాయి? వాటికి భయపడుడేంది అనుకుంటున్నారా? చదవండి.

గుడ్లగూబ అనగానే ఎవరికైనా ఒల్లు జలదరిస్తది. గుడ్లగూబను నేరుగా చూడాలంటే కూడా భయం. ఎందుకంటే వాటి కండ్లు పెద్దగా ఉంటాయి. భయపెట్టేలా ఉంటాయి. వాటి కనుగుడ్లను బట్టే వాటికి ఆపేరు వచ్చినట్లుంది. ఆ గుడ్లగూబల రక్తంతో క్షుద్రపూజలు చేస్తే ప్రత్యర్థి పార్టీ క్యాడెంట్ ఒక్క దెబ్బకే ఓడిపోతాడని నమ్ముతూ కొందరు అభ్యర్థులు గుడ్లగూబ వేటలో పడ్డారు.

తెలంగాణ ఎన్నికల వేళ కొందరు అభ్యర్థులు గుడ్లగూబలను సేకరించే పనిలో పడ్డారు. ఈ విషయం ఎలా తెలిసిందంటే… కర్ణాటక రాష్ట్రంలోని సేడం పట్టణంలో రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తే వేటగాళ్లు పట్టుపడ్డారు. వారిని విచారించిన పోలీసులకు ఆశ్చర్యపోయే సమాధానాలు వచ్చాయి. ఆ వేటగాళ్ల సమాధానంతో పోలీసులు షాక్ తిన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి తన ప్రత్యర్థిని ఓడించేందుకు గుడ్లగూబల రక్తంతో క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించుకున్నారట. అదుకోసమే గుడ్లగూబలు కావాలని వారిని కోరినట్లు విచారణలో తెలిపారు ఆ వేటగాళ్లు. గుడ్లగూబలను బలి ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తే ప్రత్యర్థులకు కీడు జరగుతుందని ఆ అభ్యర్థి నమ్ముతున్నాడట. 

గుడ్లగూబలను సంహరించి పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందని చాలా రాష్ట్రాల్లో జనాల్లో మూఢ నమ్మకం ఉన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి మూఢ నమ్మకాల వల్ల దేశంలో ప్రతి ఏటా 80వేల గుడ్లగూబలు నాశనమైపోతున్నాయని అంచనాలున్నాయి.

ఆహారపు గొలుసు సమతుల్యతను కాపాడడంలో గుడ్లగూబలు క్రియాశీలక పాత్ర పోశిస్తున్నాయి. పంటల మీద చీడపీడలను తింటూ రైతుకు ఎంతో మేలు చేకూరుస్తున్న గుడ్లగూబలను మూఢ నమ్మకాలతో జనాలు బలి తీసుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఏకంగా తెలంగాణ ఎన్నికల్లోనూ ఈ తరహా కార్యక్రమానికి ప్రయత్నించడం బాధాకరమని జనాలు అంటున్నారు.

గతంలో మంత్రి పదవి కోసం వరంగల్ జిల్లాలోని పరకాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం ఇలాంటి పూజలేవో జరిపించారు. కోయదొరల చేత క్షుద్ర పూజలు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆయనకు కేసిఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. ఏం లేదు. అయితే తర్వాత తాను పూజలు చేసిన మాట వాస్తవమే కానీ మంత్రి పదవి కోసం కాదని చల్లా ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.

ఓట్ల రాజకీయం తుదకు క్షుద్ర పూజల వరకు వెళ్లడం బాధాకరమే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.