ఇది తెలంగాణ కాంగ్రెస్ కు షాకింగ్ న్యూస్. ఈనెల 13, 14 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ఓయు లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో ఇంటరాక్షన్ కార్యక్రమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది ఈ మేరకు ఆ పార్టీ విద్యార్థి నేతలు ఓయుూ వైస్ ఛాన్సలర్ రామచంద్రం కు వినతిపత్రం సమర్పించారు. రాహుల్ పర్యటనకు అనుమతించాలని కోరారు. వారి వినతిని ఓయూ విసి తోసిపుచ్చారు. ఉస్మానియాలో రాహుల్ పర్యటనకు అనుమతిని నిరాకరించారు.
కేసిఆర్ కాలు పెట్టలేని చోట రాహుల్ గాంధీ పర్యటన సజావుగా సాగడం జీర్ణించుకోలేకనే అనుమతి నిరాకరించారని ఓయు జెఎసి నేత కోటూరి మానవత్ రాయ్ విమర్శించారు. ఠాగూర్ ఆడిటోరియం లో రాహుల్ సదస్సు కు సిఎం కెసిఆర్ ఒత్తిడి కారణంగా భద్రతాకారణాలు చూపి శుక్రవారం మధ్యాహ్నం అనుమతి నిరాకరణ ఉత్తర్వులను ఎస్టేట్ సెల్ అధికారి జారీ చేశారని విమర్శించారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియం లో ఆగస్టు 14న రాహుల్ సదస్సు అనుమతి కోసం ఓయూ విద్యార్థులు విసి ఆచార్య రామచంద్రం కు ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసిన వారిలో రిసెర్చ్ స్కాలర్లు, పిజి విద్యార్థులు ఉన్నారు.
తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి, అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసిన తర్వాతే ఉస్మానియాలో కాలు పెట్టాలంటూ టిఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకుని తీరతామని హల్ చల్ చేశాయి. టిఆర్ఎస్ అనుకూల ఓయు జెఎసి నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్, టిఆర్ఎస్ వి నేతలు ఈ మేరకు డిమాండ్ చేశారు.
అయితే రాహుల్ పర్యటనకు మిగతా అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. అయినప్పటికీ సెక్యూరిటీ కారణాలు చూపి విసి రాహుల్ పర్యటనను అనుమతించలేదు.
గతంలో కేసిఆర్ శతాబ్ధి ఉత్సవాల్లో అధికారికంగా పాల్గొన్న సమయంలో విద్యార్థులు ఆయనకు షాక్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాహుల్ పర్యటన లో కూడా అటువంటి ఘటనలు చోటు చేసుకుంటాయన్న ఉద్దేశంతోనే విసి అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది.