తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఓయూ విద్యార్ధి నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఓయూ జేఏసీ నేతలు పలువురు అసెంబ్లీ సీట్లను ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ వారిలో ఒక్కరికి కూడా టికెట్లు కేటాయించలేదు. దీంతో అప్పటి నుంచి పలువురు జేఏసీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజారాం యాదవ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మంగళవారం ఉదయం టిఆర్ఎస్ ఎంపీ కవిత ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు.
రాజారాం యాదవ్ ఉద్యమ కాలంలో జేఏసీలో చురుకుగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అతనికి టిఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో టిడిపిలో చేరి ఆర్మూర్ నుంచి 2014 ఎన్నికల్లో పోటి చేశారు. అక్కడ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొంత కాలానికి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో బాల్కొండ నుంచి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించారు కానీ రాలేదు. దీంతో రాజారాం యాదవ్ అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు.
రాజారాం యాదవ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు. రేవంత్ రెడ్డితో కలిసి ఆయన పని చేశారు. మహా కూటమి నుంచి బాల్కొండ టికెట్ వస్తుందని ఆయన ఆశించారు. కానీ మహా కూటమి సీట్ల కేటాయింపులో ఆయనకు సీటు దక్కలేదు. ఇదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్, ఇబ్రహీం పట్నం క్యామ మల్లేష్, శేరిలింగంపల్లి భిక్షపతి యాదవ్ లకు కూటమిలో సీట్లు దక్కలేదు. దీంతో యాదవ నేతలు పార్టీలను వీడి టిఆర్ఎస్ లో చేరారు.
ఈ నేపథ్యంలో రాజారాం యాదవ్ కూడా ఎంపీ కవితతో ఉద్యమ కాలంలో ఉన్న సాన్నిహిత్యం ద్వారా టిఆర్ఎస్ లో చేరారు. రాజారాం యాదవ్ తో కవిత మనుషులు చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. కవిత తన స్కెచ్ తో కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న నేతలను టిఆర్ఎస్ లో చేరే విధంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఓ బిసి యువనేత, ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కలవరం మొదలైంది.
కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని కూడా విద్యార్థి నాయకులకు కేటాయించలేదు. ఈ ఎన్నికల్లోనైనా విద్యార్థి నేతలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇస్తుందని భావించినప్పటికీ మళ్లీ మొండి చేయి చూపింది. దీంతో విద్యార్థి నాయకులు.. కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. ఓయూ విద్యార్థులకు టీఆర్‌ఎస్ ఇప్పటికే 3 సీట్లు ఇచ్చిందని.. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ 5 సీట్లు తమకు ఇవ్వాలని ఓయూ జేఏసీ నేతలు కోరారు. అయినా కూడా కాంగ్రెస్ పెద్దలు పట్టించుకోకపోవడంతో విద్యార్థి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్టోబర్ చివరి వారంలో ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్‌ను ఓయూ జేఏసీ నేతలు కలిసి తమకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దరువు ఎల్లన్న(ధర్మపురి), మానవతారాయ్(స్టేషన్ ఘన్‌పూర్), కేతూరి వెంకటేశ్(కొల్లాపూర్), దుర్గం భాస్కర్(బెల్లంపల్లి), లోకేష్ యాదవ్(ఖమ్మం), బాలలక్ష్మి(జనగాం), చరణ్(ఉప్పల్), రాజారాం యాదవ్(ఆర్మూర్) టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో కొంతమంది నాయకులు ఢిల్లీలో మకాం వేసి టికెట్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తమకు టికెట్లు కేటాయించాలని ధర్నా కూడా చేశారు. తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానానికి మొర పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
రాజారాం యాదవ్ టిఆర్ఎస్ లో చేరడంతో ఓయూ జేఏసీ లో చర్చనీయాంశమైంది. ఎవరినైతే వ్యతిరేకించారో మళ్లీ వాళ్లతోనే రాజారం యాదవ్ కలిసిపోవడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఇటివల కాంగ్రెస్ అధిష్టానం ఓయూ నేతలందరికి కూడా టిపిసిసి ప్రచార కార్యదర్శులుగా, అధికార ప్రతినిధులుగా నియమించింది. అయినా కూడా నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.