సీట్ల కేటాయింపు వేళ కాంగ్రెస్ ఉత్తమ్ కు కొత్త టెన్షన్

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొత్త టెన్షన్ పట్టుకుందా? ఒకవైపు మహా కూటమి సీట్ల చర్చ, మరోవైపు కాంగ్రెస్ తొలిజాబితా నేపథ్యంలో ఉత్తమ్ ఒక విషయంలో మాత్రం ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అన్న చర్చ సర్వత్రా నెలకొంది. ఉత్తమ్ తీసుకునే నిర్ణయమే కాంగ్రెస్ పార్టీని శాసించే అవకాశాలున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు. బుల్డోజ్ చేసుకునిపోతారా? లేదంటే ఆ కోటా ఆశావహులందరికీ ఎసరు పెడతారా? ఉత్తమ్ కు వచ్చిన కొత్త టెన్షన్ పై ఫుల్ స్టోరీ చదవండి.

కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావిడి ఊపందుకున్నది. కూటమి పొత్తులపై చర్చలు, అభ్యర్థుల ఖరారు మీద పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తొలి జాబితా ఇదే అంటూ మీడియాకు లీకులు అందాయి. అందులో 41 మంది పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో సీనియర్లకు, సిట్టింగ్ లకు ఖరారయ్యాయి. కానీ ఇద్దరు సిట్టింగ్ లకు మాత్రం తొలి జాబితాలో చోటు దక్కలేదు. మరి ఆ ఇద్దరు సిట్టింగుల్లో ఒకరు నర్సంపేట తాజా మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాగా మరొకరు ఉత్తమ్ సతీమణి అయిన కోదాడ  తాజా మాజీ ఉత్తమ్ పద్మావతిరెడ్డి. 

రేవూరి ప్రకాష్ రెడ్డి, నర్సంపేట టిడిపి నేత

వీరిద్దరు సిట్టింగ్ లే అయినా వారి పేర్లు రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. నర్సంపేట సీటును టిడిపి గట్టిగా అడుగుతున్నది. అక్కడ సీనియర్ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి టిడిపికి ఉన్నారు. ఆయన సీటు తనదే అని ప్రచారం చేసుకుంటున్నారు. ఒకవేళ సిట్టింగ్ అని దొంతి మాధవరెడ్డికి ఇచ్చినా తాను రెబెల్ గా బరిలో ఉంటానని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనను మార్చడం కష్టమే అంటున్నారు. దీంతో దొంతి మాధవరెడ్డికి వేరే నియోజకవర్గం కేటాయించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంచితే ఉత్తమ్ ఫ్యామిలీ విషయం చూద్దాం.

ఉత్తమ్ పద్మావతిరెడ్డి కోదాడ నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఒక కుటుంబానికి ఒకే సీటు అన్న ఫార్ములా ఈసారి పటిష్టంగా అమలు చేసేదిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్నట్లు కనబడుతున్నది. ఆ ఫార్ములా అమలైతే తొలుత ఎగిరిపోయే సీటు ఉత్తమ్ సతీమణిదే. ఆమె అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ కోల్పోతారు. అయితే ఇందులో ఒక చిన్న క్లాజ్ ఉందని కూడా అంటున్నారు. అదేమంటే సిట్టింగ్ లకు ఈ ఫార్ములా వర్తించదు అన్న ప్రచారం కూడా ఉంది. కానీ సిట్టింగ్ ల పేరుతో ఉత్తమ్ సతీమణికి చాన్స్ ఇస్తే మిగతా నేతలంతా తమ కుటుంబసభ్యులకు కూడా ఇవ్వాలన్న డిమాండ్లు తెర మీదకు తెస్తున్నారు. 

ఉత్తమ్ పద్మావతిరెడ్డి, కోదాడ కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే

ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డిని పోటీకి దూరంగా ఉంచాలా లేదా అన్న చర్చ ఉంటే అదే సమయంలో కోదాడ సీటును టిడిపి బలంగా కోరుతున్నది. ఆ సీటులో తమకు బలమైన బిసి సామాజికవర్గానికి చెందిన నేత బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నట్లు ఆ పార్టీ అంటున్నది. కూటమిలో టిడిపి బలంగా కోరుతున్న సీట్లలో నర్సంపేట, కోదాడ కావడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో కోదాడలో ఉత్తమ్ పద్మావతిరెడ్డినే బరిలోకి దింపే పరిస్థితే ఉంటే కూటమి రెబెల్ గా బొల్లం మల్లయ్య యాదవ్ బరిలో ఉండే చాన్స్ ఉంది.

ఈ రెబెల్ కల్చర్ ను నివారించేందుకు ఉత్తమ్ పద్మావతిరెడ్డిని పోటీకి దింపకుండా టిడిపికే ఆ సీటును ఇచ్చి ఉత్తమ్ కుటుంబం త్యాగం చేస్తే యావత్ తెలంగాణ పార్టీలో ఆయన రోల్ మోడల్ గా ఉంటారన్న చర్చ ఉంది. అంతేకాకుండా ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు అన్న రీతిలో మిగతా నేతలంతా తమ వారసుల కోసం ఆరాటం బంద్ చేస్తారని కూడా అంటున్నారు. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి సోదరులు ఉన్నారు. వారు ఉంటూనే తమ వారసత్వాన్ని బరిలోకి దింపాలనుకుంటున్నారు. డికె అరుణ తన కూతురు ను బరిలోకి దింపాలనుకుంటున్నారు. జానారెడ్డి తాను ఉంటూనే తన కొడుకు ను దింపాలనుకుంటున్నారు. దామోదర రాజనర్సింహ్మ తన సతీమణి కి సంగారెడ్డి సీటు అడుగుతున్నారు. ఇలా జిల్లాకు ఐదారుగురు లీడర్లు తమకు ఒక సీటు తమ కుటుంబానికి ఇంకో సీటు అడుగుతున్నారు.

బొల్లం మల్లయ్య యాదవ్, కోదాడ నియోజకవర్గ టిడిపి నేత

ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ త్యాగం చేస్తే మిగతా వారందరికీ చెక్ పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా తనకు కంటగింపుగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా సమర్థవంతంగా ఉత్తమ్ చెక్ పెట్టవచ్చని అంటున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు బరిలోకి దిగాలని యోచిస్తున్నారు. అక్కడ ఇప్పటికే ఆయన ఏర్పాట్లలో ఉన్నారు. పార్టీ టికెట్ వస్తే పోటీ లేదంటే పోటీకి దూరం అన్న యోచనలో ఆయన ఉన్నారు. అయితే మనుగోడులో పాల్వాయి స్రవంతిరెడ్డి కూడా ఆశిస్తున్నారు. అంతేకాదు ఆ సీటును సిపిఐ బలంగా కోరుతున్నది. సిపిఐకి మునుగోడు నియోజకవర్గంలో బిసి నేత నెల్లికంటి సత్యం ఉన్నారు.

ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ సతీమణికి టికెట్ లేకుంటే కోమటిరెడ్డి సోదరులకు నల్లగొండ ఒక్క సీటుతోనే సరిపెట్టవచ్చని చెబుతున్నారు. కోమటిరెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి రానున్న ఎంపి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చే చాన్స్ కూడా ఉందంటున్నారు. ఒక కుటుంబానికి ఒక సీటు కోసం కానీ, కూటమి కోసం కానీ తమ కుటుంబంలో ఒక సీటును త్యాగం చేయడం ఉత్తమ్ కు పెద్ద కష్టమేమీ కాదని, ఆయన త్యాగం చేస్తే మిగతా నేతలంతా ఆ దారిలోనే నడుస్తారని పిసిసి కీలక నేత ఒకరు తెలుగురాజ్యం కు చెప్పారు. ఇందులో షశబిషలేమీ ఉండకపోవచ్చని ఆయన వెల్లడించారు.

మరి ఉత్తమ్ కుటుంబం ఒక సీటును త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి రోల్ మోడల్ గా ఉంటారా? లేదంటే ఏదో ఒక సాకుతో ఇద్దరూ పోటీ చేసి కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.