తెరాసను అధిగమిస్తాం అంటూ సవాళ్లు విసిరే కాంగ్రెస్ పార్టీకి ఇంటి పోరు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం పార్టీలో పీసీసీ చీఫ్ పదవి కోసం కీలక నేతల మధ్యన యుద్ధం జరుగుతోంది. ఎవరికివారు పదవి మాకు కావాలంటే మాకు కావాలని పట్టుబడుతున్నారు. తమ బలాబలాను అధిష్టానం వద్ద ప్రదర్శిస్తున్నారు. ఈ పోటీలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు హోరాహోరీగా తలపడుతున్నారు. ఈ ఇద్దరిలోనే ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కతుంది. మొదటి నుండి అధిష్టానం చూపు రేవంత్ రెడ్డి మీదనే ఉండగా కోమటిరెడ్డి మధ్యలో ఎంటరయ్యారు. పార్టీలో రేవంత్ కంటే సీనియర్ నాయకుడినని, పార్టీని నడిపే సత్తా తనకుందని చెబుతున్నారు. పార్టీలోని సీనియర్లు కూడ ఆయనకే మద్దతుగా ఉన్నారు. కోమటిరెడ్డికి పదవి ఇస్తే సహకరిస్తామని అదే రేవంత్ రెడ్డికి ఇస్తే మాత్రం పార్టీకి రాజీనామాలు చేస్తామని అంటున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి పదవి విషయంలో ఒక హామీ తెచ్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా అందరూ కలిసి రేవంత్ రెడ్డి మీద మూకుమ్మడిగా దాడికి తెగబడటాన్ని రేవంత్ అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఎలాగైనా రేవంత్ రెడ్డికి బలం చేకూర్చాలని చూస్తున్నారు. ఈ తరుణంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళుతున్నట్టు ప్రకటించారు. ఇది రేవంత్ వర్గానికి ఆయుధంగా మారింది. బీజేపీలోకి వెళ్లే విషయాన్ని తిరుమలలో ప్రకటించారు ఆయన. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేని చెప్పిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ బలపడుతుందని, కేసీఆర్ ఒంటెద్దు పోకడలు మానుకోలని హితవు పలికారు.
అసలే కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ అవలంభించిన ఆపరేషన్ ఆకర్ష్ విధానానికి విలవిల్లాడింది. ప్రతిపక్ష హోదాను కోల్పోయే ప్రమాదంలో పడింది. కీలకమైన నేతలు నిష్క్రమించడం వలనే కాంగ్రెస్ శక్తి క్షీణించిపోయింది. అదే బీజేపీని ముందగుడు వేసేలా చేసింది. సొంత నేతలను కాపాడుకోవడంలోనే తలమునకలైన కాంగ్రెస్ జనాల్లోని వెళ్లే విస్మరించింది. నేతలు పార్టీని వీడటాన్ని అరికట్టలేకపోయారని అప్పట్లో కాంగ్రెస్ నేతలే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విసుర్లు విసిరారు. ఇప్పుడు చూస్తే కొత్తగా చీఫ్ పదవిని ఆశిస్తున్న కొమిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడే పార్టీని వదిలేసి బీజేపీలోకి వెళ్లిపోతానని అంటుండటం సంచలనానికి దారితీసింది. దీన్ని ఆసరాగా తీసుకున్న రేవంత్ వర్గం ముందు సోదరుడిని పార్టీలోంచి వెళ్లకుండా ఆపుకోండి, ఆ తర్వాత అధ్యక్ష పదవిని అడగండి, సొంత తమ్ముడే నిలువరించలేని వారు మిగతావారిని ఎలా కంట్రోల్ చేస్తారని ఎత్తిపొడుస్తున్నారు.