తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ , సీపీ కమిషనర్ సజ్జనార్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. పోలీసులపై విమర్శలు గుప్పించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ నిన్న సజ్జనార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. గోవులు, ఎద్దులను తరలిస్తున్న వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని, వారి నుండి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారంటూ రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. సజ్జనార్ గారికి సవాల్ చేస్తున్నానంటూ రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మీ కమిషరేట్ పరిధిలో ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయని… ఆవులను, ఎద్దులను కోయడానికి ఆయా పోలీస్ స్టేషన్ల ముందు నుంచి ఇల్లీగల్ గా వాహనాలలో వాటిని తీసుకెళ్తున్నారా? లేదా? అనే విషయంపై వాటన్నింటి నుంచి రిపోర్ట్ తెప్పించుకుని చూడాలని అన్నారు.
తాను చెప్పింది నిజం కాకపోతే తనపై ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చని సవాల్ విసిరారు. గోవుల అక్రమ రావాణాను అరికట్టేందుకు టోల్ గేట్స్, మెయిన్ రోడ్లపై కానిస్టేబుళ్లను పెట్టాలని… అప్పుడు తాము రోడ్లపైకి రామని చెప్పారు. లేకపోతే తాము ఇలాగే చేస్తామని… ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు.