తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాత్రమే కాదు తెలంగాణ బీజేపీ కూడ తీవ్రంగా తహతహలాడుతోంది. ఇందుకోసం భారీగానే ప్రణాళికలు రచిస్తోంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ నాయకులు సత్తా చాటడంతో తిరుపతి ఉప ఎన్నికల భాద్యతను కూడ కేంద్రం వారి భుజాల మీదనే పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం టీ బీజేపీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ విషయాల్లో కలుగజేసుకోవడం చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది. మొదట్లో ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు ఇక పార్టీని ముందుండి నడిపించబోయేది తానేనన్నట్టు కలరింగ్ ఇచ్చారు. పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో 2024 ఎన్నికలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యమని అన్నారు. కానీ కేంద్ర నాయకత్వం ముందు ప్రతిపక్ష హోదా సాధిస్తే చాలని గాలి తీసేసింది.
అయినా వీర్రాజుగారు ఫీలవ్వలేదు. తనదైన పంథాలో సాగిపోయారు. జనసేనను వెంటేసుకుని హడావుడి స్టార్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని మించి కొన్ని విషయాలను రాద్ధాంతం చేశారు. ఒకానొక దశలో జగన్ మీద కూడ గురిపెడుతున్నట్టు కనబడ్డారు. కానీ ఏమైందో ఏమో కానీ జగన్ జోలికెళ్లడం మానేశారు. అధికార పార్టీని టార్గెట్ చేయకుండా ఎదగడమంటే గాల్లో మెడలు కట్టడమే. ఆ కట్టడం సోము వీర్రాజుకు అంతగా చేతకాలేదు. మెల్లగా చప్పబడిపోయారు. జనం తిరస్కరించిన టీడీపీ మీద ఎంత గొంతు చించుకున్నా ఫలితం ఉండదు కాబట్టి సైలెంట్ అయిపోయారు. దీంతో తెలంగాణ నాయకత్వం రంగంలోకి దిగింది.
తిరుపతి ఉప ఎన్నికల కోసం ప్రణాళికలు రచించడం స్టార్ట్ చేసింది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి తిరుపతిలో పర్యటించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకున్నారు. అనుకున్నట్టే గ్రౌండ్ లెవల్లో పార్టీ వీక్ అని తేలడంతో టీ బీజేపీ నాయకులను రంగంలోకి దింపారు. ఒక్క బండి సంజయ్ మినహా మిగతా నాయకులంతా ఏపీ వివాదాల్లో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే రాజాసింగ్ శ్రీశైలంలో అన్యమతస్థులు పెత్తనం పెరిగిందని ఆరోపణలు చేయగా రామతీర్థం వివాదంలో సైతం గట్టిగానే కలుగజేసుకంటూ జగన్ మీద, చంద్రబాబు మీద విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరొక సీనియర్ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కోరికతో పాటు కేంద్రం నుండి నిధులు రావాలంటే తమను గెలిపించాలని బెదిరింపు కూడ వదిలారు.
అది విన్న జనం అంటే ఇప్పుడు తిరుపతిలో బీజేపీ – జనసేన అభ్యర్థి గెలవకపోతే కేంద్రం నిధులు ఇవ్వదనా ఆయన చెప్పాలనుకున్నది అంటున్నారు. రానున్న రోజుల్లో బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ సైతం ఏపీ విషయాల్లో వేలు పెడతారు. సోము వీర్రాజుగారు మాత్రం వారికి వత్తాసు పలుకుతూ ఉండాల్సిందే. ఈ తంతు చూస్తుంటే వీర్రాజుగారికి అంత సీన్ లేదని ఊహించే టీ బీజేపీ నేతలు రంగంలోకి దిగుతున్నట్టుగా ఉంది.