పాక్షిక మేనిఫెస్టో లో ఆ ముచ్చటే చెప్పని కేసిఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి తాజా ఎన్నికల కోసం పాక్షిక మేనిఫెస్టో విడుదల చేసింది. పేరుకే పాక్షికమైన మేనిఫెస్టో అయినా ఫుల్ మేనిఫెస్టో లాగే ఉంది. ఎందుకంటే ఆ విధమైన ప్రకనటలు గుప్పించారు కేసిఆర్. 

తెలంగాణ భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులను క్రోడీకరించి కేసిఆర్ కు కమిటీ సభ్యులు వివరించారు. ఈ సమావేశం రెండు గంటల పాటు సాగింది. సమావేశం అనంతరం కేసిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మీడియాతోనూ సుదీర్ఘంగా మాట్లాడి పాక్షిక మేనిఫెస్టోలోని అంశాలను వెల్లడించారు. 

అయితే అనేక అంశాలను వెల్లడించిన కేసిఆర్ ఒక్క విషయాన్ని మాత్రం ఈ సమయంలో వెల్లడించలేదు. అదేమంటే నిరుద్యోగుల అంశం. రానున్న రోజుల్లో నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. బహుషా మిగతా మేనిఫెస్టో లో ఆ అంశాలను వెల్లడిస్తారో లేక అంతే సంగతులో అన్నది తేలాల్సి ఉంది. 

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నారు. ఆంద్రోళ్లందరూ తమకు దక్కాల్సిన ఉద్యోగాలన్నీ కొల్లగొడుతున్నారని అందుకే తమకు కొలువులు వస్తలేవని యూత్ ను ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీల నేతలు నమ్మబలికారు.. రెచ్చగొట్టారు. దీంతో తెలంగాణ వస్తే తమ తమకు బాగా కొలువులు వస్తాయని నమ్మిన యువత తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలిచారు.

అయితే తెలంగాణ రాష్ట్రమైతే వచ్చింది కానీ విద్యార్థి, నిరుద్యోగ యువత ఆశలు మాత్రం తీరలేదు. నాలుగున్నరేళ్ల తెలంగాణ స్వరాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఉద్యోగాలు అన్ని కలిపినా ఉద్యమ సమయంలో ప్రకటించిన దానిలో సగం దాటలేద. దీంతో నిరుద్యోగ యువత తీవ్రాతి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.  టిఎస్పిఎస్సీ వేసిన ఉద్యోగ ప్రకటనలన్నీ కోర్టుల్లో మూలిగిపోతున్నాయి. 

తెలంగాణ వస్తే ఒక్కటంటే ఒక్క దెబ్బకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఉద్యమ కాలంలో కేసిఆర్ ప్రకటన చేశారు. ఒకే దెబ్బలో లక్ష కుటుంబాలు సెటిల్ అయిపోతాయన్నారు. కానీ ఆ దిశగా నాలుగున్నరేళ్లలో నిరుద్యోగ యువతకు నమ్మకం కలిగించే చర్యలు మాత్రం టిఆర్ఎస్ సర్కారు తీసుకోలేకపోయిందన్న విమర్శలు మూటగట్టుకున్నది. 

ఇక ప్రభుత్వం రాగానే ఉస్మానియా విద్యార్థులతో కేసిఆర్ కయ్యం పెట్టుకున్నారు. ఉస్మానియాకు అన్ని ఎకరాల భూమెందుకు అని ప్రశ్నించారు. ఆ భూమిని డబుల్ బెడ్ర్రూమ్ ఇండ్ల కోసం తీసుకుంటానని ప్రకటించారు. ఈ ప్రకటనపై ఉస్మానియా విద్యార్థులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ఇంచు జాగ కూడా తీసుకోనిచ్చేది లేదని హెచ్చరించారు. అంతేకాకుండా ఉస్మానియా వందేళ్ల సంబరాల్లో కేసిఆర్ పాల్గొన్నప్పటికీ మాట్లాడకుండానే వెనుదిరిగారు. 

ఇదే కాకుండా ఒకవైపు వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరగా డిఎస్సీ వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ స్వరాష్ట్రంలో ఆందోళనలు చేస్తే కేసిఆర్ లైట్ తీసుకున్నారు. డిఎస్సీ వేయకపోతే ప్రపంచం మునిగిపోతదా అని వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ ప్రకటన కూడా తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగ యువతను బాధ పెట్టింది. 

ఇక నిరుద్యోగులను శాంతపరిచేందుకు తాజాగా వెల్లడించిన పాక్షిక మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేశారు. నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు (3016) చెల్లిస్తామని ప్రకటించారు. ఆ మూడు వేల రూపాయలను కూడా ఎవరికి ఇవ్వాలి? దానికి ఎవరు అర్హులు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల లోపు దానిపై క్లారిటీ తీసుకుని ఆ తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. 

మరి నిరుద్యోగుల అంశం చర్చకు వచ్చినప్పుడు ఉద్యోగాల మీద కూడా ప్రకటన వస్తుందేమో అని ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు మాత్రం ఆశాభంగం తప్పలేదు. బహుషా ఇక నిరుద్యోగుల విషయం ఇంతటితో ముగిస్తారా? లేదంటే తదుపరి మేనిఫెస్టోలో ఉద్యోగాల కల్పనపై క్లారిటీ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇది పాక్షిక మేనిఫెస్టో మాత్రమే అని, పూర్తి స్థాయి మేనిఫెస్టో త్వరలోనే ఉంటుందని కేసిఆర్ వెల్లడించారు కాబట్టి ఆ సమయంలో రానున్న రోజుల్లో  ఎన్ని ఉద్యోగాలు ఇస్తారన్నదానిపై వివరణ ఉండే అవకాశం ఉంది.