అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లలో కొత్త ట్విస్ట్
అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలోని బిజెపి సర్కారు సంకల్పించింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో బిల్లు పార్లమెంటుకు చేరింది. అయితే ఈ రిజర్వేషన్ల పై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కొన్ని సెక్షన్లు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నాయి. మరికొన్ని సెక్షన్లు రిజర్వేషన్లను సమర్థిస్తున్నాయి. ఈ సంఘటన మరోసారి యావత్ దేశాన్ని కుదిపేస్తున్నది. గతంలో నోట్ల రద్దు సంఘటన దేశాన్ని ఎంతగా కుదిపేసిందో ఈ రిజర్వేషన్ల అంశం అంతకంటే ఎక్కువగా కుదిపేస్తున్నది.
ఈ సమయంలో ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేష్లపై ప్రముఖ సామాజికవేత్త, తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ బిఎస్ రాములు సరికొత్త వాదన వెలుగులోకి తెచ్చారు. ఆర్థిక బలహీన వర్గాల రిజర్వేషన్ల కోటాలో కేవలం అగ్ర వర్ణ పేదలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు కూడా అర్హులే అని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కేవలం అగ్రవర్ణాలకే పరిమితం అనే భావన కరెక్టు కాదన్నారు. ఈ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
ఈ రిజర్వేషన్ ఫలాలను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల వారు ఎలా పొందవచ్చో కూడా రాములు వివరణ ఇచ్చారు. దానికి సంబంధించిన వివరాలు చదవండి.
ఈడబ్ల్యూఎస్ కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారు రిజర్వేషన్ పొందాలనుకుంటే బీసీ అభ్యర్థులు తమ కుల ధృవీకరణ పత్రాన్ని అవసరమైన చోట సమర్పించరాదని సూచించారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అభ్యర్థులకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఆటోమెటిక్ గా బిసి అభ్యర్థులు విద్య, ఉద్యోగాల్లో ఈడబ్లూఎస్ రిజర్వేషన్ సాధించవచ్చని వివరించారు.
బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారి జనాభా దేశంలో 70శాతం, తెలంగాణలో 85 నుంచి 89శాతం వరకు ఉందని చెప్పారు. సామాజికంగా, చారిత్రకంగా గౌరవం పొందుతున్న కులాల జనాభా 20 నుంచి 25 శాతము మాత్రమే ఉందన్నారు. జనరల్ కేటగిరీలోని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
రేషన్ కార్డు ద్వారా సబ్సిడీ బియ్యం పొందుతున్న వారంతా రిజర్వేషన్లకు అర్హులే అని వివరించారు. బిసి(ఇ) గ్రూపు నకు పెంచిన రిజర్వేషన్లను కూడా కేంద్రం ఆమోదిస్తే సామాజిక సామరస్యం వెల్లివిరుస్తుందని చెప్పారు.
అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం కాకుండా 25 శాతం పెట్టి ఉండాల్సిందని రాములు అభిప్రాయపడ్డారు. అప్పుడే పల్లెల్లో ఉండే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు పోగేసుకున్న సంపన్నుల కుటుంబాలతో కీలక ఉద్యోగాల పరీక్షల్లో ఇతర వర్గాల వారు పోటీ పడలేకపోతున్నారని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో ఊరట లభిస్తుందని చెప్పారు రాములు.
రాములు కామెంట్స్ రిజర్వేషన్ల వివాదంలో సరికొత్త చర్చను లేవనెత్తాయని చెప్పవచ్చు. ఒకవైపు బిసి సంఘాలు, బిసి ఉద్యమ నేతలు పదిశాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ర్యాలీ అవుతున్నవేళ తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ రాములు చేసిన ఈ కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. మరి ఈ రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి? ఏరకమైన ఫలితాలు వస్తాయన్నది చూడాలి.