ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారని, అందుకు పార్టీలో సీనియర్లతో కూడా చర్చలు జరిపి నిర్ణయం కూడా తీసుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా స్థానిక ఎన్నికల్లో లాభం పొందవచ్చని, జనసేనను కూడా దెబ్బ తీయవచ్చన్నది జగన్ వ్యూహంగా విశ్లేషణలు కూడా వెలువడ్డాయి. ఆ వార్తలకు బలం ఇస్తూ.. చిరంజీవి కూడా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్ధతు తెలిపారు. జగన్ ప్రతిపాదనను సమర్థించారు.
అయితే మండలి రద్దు నిర్ణయం తర్వాత జగన్ తన ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి ఎమ్మెల్సీ పదవులు ఆశించిన చాలా మంది నేతలు ఇప్పుడు మండలి రద్దుతో రాజ్యసభ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. పైగా గత కొంత కాలంగా బీజేపీ, వైసీపీకి మధ్య సాగుతోన్న మంతనాల్లో భాగంగా అమిత్ షా కూడా జగన్ ను ఒక రాజ్యసభ సీటు తాము సూచించిన అభ్యర్థికి కేటాయించాలని కోరారట. తాగాజా జార్ఖండ్ స్వతంత్ర ఎంపీ నత్వాని సైతం అంబానీ వెంట వచ్చి మరీ జగన్‌ను రాజ్యసభ సీటు కోరానని వెల్లడించారు. అయితే ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో బీసీల ఓట్లు చీల్చడం కోసమో లేదా, జనసేనకు చెక్ పెట్టడం కోసమో చీరంజీవికి సీటు ఇస్తారా అంటే.. అది అసాధ్యం అని స్పష్టమైపోయింది.
వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సైతం దీనిపై నర్మగగర్భంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ ఓటు బ్యాంకును దెబ్బ తీయడానికి చిరంజీవిని దగ్గరకు తీసేంత చీప్ మెంటాలిటీ జగన్‌కు లేదని అంటూనే చిరంజీవి కూడా రాజ్యసభ సీటు కోసం జగన్ దగ్గర పాకులాడే మనిషి కాదని వ్యాఖ్యలు అన్నారు. దీంతో చిరంజీవికి జగన్ రాజ్యసభ సీటు ఇవ్వడం లేదని ఖాయమైపోయింది.
చిరంజీవి కూడా తొలుత జగన్ తనకు రాజ్యసభ సీటు ఇస్తారని ఆశపడ్డారని, తర్వాత చోటు చేసుకున్న పరిణామాల రీత్యా ఇప్పుడు ఆ సీటు కోసం ఆశపడక మరేదైనా అవకాశం ఉంటే కల్పిస్తారన్న భరోసాతో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయలకు దూరంగా కొంత కాలం సినిమాలకే పరిమితం కావాలని కూడా నిర్ణయించారని అందుకే వరుసగా కథలు వింటున్నారని టాక్.