చంద్రబాబు డిమాండ్ నెరవేర్చిన జగన్!

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి డిమాండ్ ను ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తాను ఇవ్వాలనుకున్న విధంగా.. బాబు కోరిన విధంగానే.. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేశారు.

రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట రీత్యా విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు వల్ల బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకావాలి. అయితే మిగిలిన పదిశాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మొత్తం 34 శాతం రిజర్వేషన్ లభించనుంది.

జగన్ నిర్ణయంపై బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం అంతా కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

దీంతో టీడీపీ నేతలు సుప్రీంను ఆశ్రయించగా.. ఎన్నికలు తప్పనిసరిగా జరపవలసిన పరిస్థితుల్లో జగన్ బీసీలకు పార్టీ నుంచి అదనంగా 10 శాతం సీట్లను ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో బీసీల మనసులు గెలచుకోవడంతోపాటు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.