ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సరైన సలహాదారుల సమస్య ఉన్నట్లుందని బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. అనుభవంతో ఎటువంటి సమస్యలూ రాకుండా ఓ నిర్ణయం తీసుకునే ముందుగానే సరైన సలహాలు, సూచనలు ఇవ్వదగ్గ వారు లేకపోవడం వల్లేనేమో జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే వాటిలో చాలా నిర్ణయాలకు న్యాయస్థానంలో మొట్టికాయలు పడుతున్నాయని విమర్శలు కూడా వస్తున్నాయి.
తాజాగా రాజధాని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా మార్చే అంశంలో మరియు బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. గతంలో కూడా అనేక నిర్ణయాలకు సంబంధించి ఇదే పరిస్థితి. ఇలాంటి సందర్భాలే ప్రతిపక్షానికి కలిసి వస్తున్నాయి. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పనికివస్తున్నాయి. తాజాగా బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రతిపక్ష పార్టీ ఏకంగా సుప్రీంకు వెళ్లడంతోపాటు.. జగన్ సరైన న్యాయవాదిని పెట్టలేకపోయాడనే తీవ్ర ఆరోపణలు సైతం చేసింది.
జగన్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి తీసుకున్న అనేక నిర్ణయాల అమలుకు మాత్రం సమస్యలు ఎదురవుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల విషయంలో అయితే ప్రభుత్వం ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది. సుప్రీంకు వెళ్లే సమయం లేదు, నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించక తప్పదు. దీంతో ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా, ప్రభుత్వం తరపున న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించే లాయర్ల కోసం జగన్ ఇప్పుడు సమర్థవంతమైన లాయర్ వేటలో పడ్డారట. ఎలాగైనా ప్రభుత్వానికి అన్ని విధాలా సరైన సూచనలు చేసే లాయర్ కోసం వెతుకున్నారట. అలాగే ప్రభుత్వానికి నిర్ణయాలకు ముందే ఎలాంటి సమస్యలూ తలెత్తని విధంగా సలహాలు ఇచ్చే స్థాయిలో న్యాయ వ్యవస్థపై వారికి పట్టు ఉండాలని ఆయన కోరుకుంటున్నట్లు టాక్. ఇదే జరిగితే ఇకపై అయినా జగన్ ప్రభుత్వ నిర్ణయాలకు ఓ మంచి సలహాదారులు దొరికినట్లే.