దుబ్బాక ఉప ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల లెవల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. మూడు ప్రధాన పార్టీల హోరా హోరీ ప్రచారం, కేసులు, దీక్షలు, ఆరోపణలు, విమర్శలు, ఒకరు ఆత్మహత్యాయత్నం, హవాలా డబ్బు దొరకడం లాంటి సంఘటనలతో ఎన్నికల్లో హైటెంక్షన్ నెలకొంది. మాములుగా అయితే తెరాస సిట్టింగ్ సభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి మరణించారు కాబట్టి ఆ స్థానం తెరాసకే వదిలేయాలనేది ఒకప్పటి రూల్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్థానం ఏదైనా, పరిస్థితులు ఎలాంటివైనా పోటీచేయడంలో తప్పులేదు కాబట్టి అన్ని పార్టీలు బరిలోకి దూకాయి.
మొదట అందరూ ఇక్కడ సానుభూతి అంశం గట్టిగా పనిచేస్తుందని, తెరాసకు లక్ష మెజారిటీ ఖాయమని అనుకున్నారు. అందరూ సానుభూతి ఓట్ల మీదే ఎక్కువ దృష్టిపెట్టారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మరణించిన నేత సోలిపేట రామలింగారెడ్డి పేరు గత 10 రోజులుగా మాటల్లో కూడ లేదు. అందుకు కారణం పోటీలోని తీవ్రత. అధికార పార్టీని ఢీకొట్టడానికి కాంగ్రెస్, బీజేపీ రెండూ బాగానే సాహసించాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో సంచలన నిర్ణయం తీసుకుంటే బీజేపీ ప్రచారం చివరి ఐదారు రోజులు తెరాసతో బహిరంగ యుద్ధానికి దిగింది. ఫలితంగా కాంగ్రెస్, బీజేపీలోని పంతం హైలెట్ అయింది. అది జనాల దృష్టిని సానుభూతి అనే కోణం నుండి అభివృద్ధి వైపుగా మళ్లించింది.
ప్రత్యర్థి పార్టీల మాటలతో జనం కూడ ఇన్నేళ్ళలో నియోజకవర్గం ఎంతమాత్రం అభివృద్ధి చెందింది అనే లెక్కలు వేసుకుంటున్నారు. పక్కనే ఉన్న సిద్దిపేట గణీయంగా కొత్త సొబగులు దిద్దుకుంది. మరి మన నియోజకవర్గంలో ఏం చేశారు, ఏం చేయలేదు అనే లెక్కలు కడుతున్నారు. ఇదే అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రజలు సానుభూతి భావనలో ఓట్లు వేసేస్తారని అనుకున్నారు. ఇప్పుడు చూస్తే అది జరిగేలా లేదు. అందరూ కొత్త అభ్యర్థులే అన్నట్టు ఉంది వాతావరణం. ఈ వారతవరణంలో సానుభూతి ఓట్లు గనుక పెద్ద ఎత్తున పడకపోతే భారీ మెజారిటీ మీద కేసీఆర్ పెట్టుకున్న ఆశలు గల్లంతవడం ఖాయం. కేసీఆర్ ఆశలు గల్లంతైతే వాటిని మోస్తున్న హరీష్ రావు పరిస్థితి ఏమవుతుందో మరి.