తెలంగాణలో సత్తా చాటేందుకు బిజెపి అన్ని రకాల ఎఫర్ట్స్ పెడుతున్నది. దేశంలో బిజెపి సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో తెలంగాణలో బలం సాధించేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దానిలోభాగంగానే యూత్ ను ఎట్రాక్ట్ చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇక సినీ గ్లామర్ కూడా తెలంగాణ బిజెపికి అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ దిశగా జాయినింగ్స్ పై దృష్టి సారించింది. దీంతో ఇద్దరు యువ హీరోయిన్లు బిజెపి గూటికి చేరారు. అందులో ఒకరికి కీలక పదవిని కట్టబెట్టింది బిజెపి. ఇంతకూ తెలంగాణ బిజెపిలో చేరిన ఏ హీరోయిన్ కు పదవి ఇచ్చారు? ఏం పదవి ఇచ్చారు. ఆమె ఎవరు? ఏం కథ అనుకుంటున్నారా? చదవండి ఫుల్ స్టోరీ.
తెలంగాణ బిజెపి ఇప్పుడిప్పుడే సినీ గ్లామర్ ను సంతరించుకుంటున్నది. ఈ ఏడాది మే నెలలో ప్రముఖ సినీ హీరోయిన్ మాధవీలత బెపి తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి గడ్కరీ సమక్షంలో ఆమె బిజెపిలో చేరిపోయారు. మాధవీ లత ఉషాకిరణ్ మూవీస్ వారి సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. తర్వాత కాలంలో ఆమె జబర్దస్త్ లాంటి ఈటివి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అయితే సినిమాల్లో కొత్త వాళ్లు రావడంతో మాధవీలతకు అవకాశాలు అంతగా వస్తున్న పరిస్థితి లేదు. దీంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. అయితే అదే సమయంలో యాంకర్ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్న రోజులు. దీంతో యాంకర్ శ్రీరెడ్డికి కౌంటర్ గా పవన్ కు మద్దతుగా మాధవీలత రోడ్డెక్కారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా ఆందోళన కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో మాధవీలత పవన్ కళ్యాణ్ పార్టీలో చేరతారని అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా బిజెపిలో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే మే నెలలో ఆమె బిజెపిలో చేరినా ఇప్పటి వరకు పెద్దగా హడావిడి ఏమీ కనిపించలేదు.
ఇక మరో సినీ తార మాధవీలత కంటే ముందే బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. రేష్మా రాథోడ్ తెలంగాణలో పుట్టి పెరిగారు. లా చదివి మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె మహబూబాబాద్ జిల్లాకు చెందిన రేష్మా రాథోడ్ టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించారు. ఆమె రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆమె బిజెపి పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో పాలుపంచుకుంటానని చెబుతున్నారు. దీంతో పార్టీ నాయకత్వం ఆమెకు బిజెపి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టారు. ప్రస్తుతం రేష్మా రాథోడ్ యాక్టీవ్ గా వ్యవహరిస్తున్నారు. రేష్మా రాథోడ్ గతంలో జెమినీ టివిలో యాంకర్ గా పనిచేశారు. ఈ రోజుల్లో అనే సినిమాలో నటించి తెలుగులో పాపులర్ అయ్యారు. అదే సమయంలో బాలీవుడ్ సినిమాల్లో కూడా కొన్ని క్యారెక్టర్లలో నటించారు.
రేష్మా రాథోడ్ మహబూబాబాద్ పార్లమెంటుకు పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. మహబూబాబాద్ ఎంపి ఎస్టీ రిజర్వుడు సీటు. అయితే రేష్మా రాథోడ్ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అమ్మాయే కావడంతో ఆమె సేవలు పార్టీకి వినియోగించుకునే విషయమై పార్టీ నేతల పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళ కావడం, అంతేకాకుండా సినీ గ్లామర్ కూడా రేష్మా రాథోడ్ కు తోడవడంతో ఆమె తొందరగానే జనాల్లో పాపులారిటీ సంపాదించుకునే చాన్స్ ఉంటుందని బిజెపి నేతలు కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. చలాకీగా మాట్లాడే స్వభావం కూడా రేష్మా రాథోడ్ కు అదనంగా కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. అయితే ఆమె ఆర్థిక పరిస్థితులు (ఫైనాన్సియల్ కెపాసిటీ) ఎలా ఉన్నాయన్నదానిపైనా పార్టీలో డిస్కస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ పట్ల కమిట్ మెంట్, క్రమశిక్షణతో నడుచుకుంటే కచ్చితంగా ఆమెకు సీటు దక్కే చాన్స్ ఉందంటున్నారు.
అయితే రేష్మా రాథోడ్ కు పార్టీలో మంచి పదవి ఇవ్వడంతో అతి త్వరలో మాధవీలతకు కూడా ఏమైనా పోస్టు ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఆమె కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే పనిచేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణ బిజెపి ఒక్కో ఇటుకనూ పోగు చేసుకుంటూ బలం పెంచుకుంటున్నది. మరి 2019 లో ఏమేరకు ఈ బలం రిఫ్లెక్ట్ అవుతుందన్నది చూడాల్సి ఉంది.