నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ లా అండ్ ఆర్డర్ మెయింటెయిన్ చేయడంలో బాగా పనిచేస్తున్నారన్న పేరుంది. మిర్యాలగూడలో ప్రణయ్ అనే యువకుడి హత్య కేసును ఛేదించడంలో మంచి ఎఫర్ట్ పెట్టారు రంగనాథ్. హత్యకు ముందు కూడా తాను జిల్లాకు బదిలీ కాగానే పెండింగ్ కేసులన్నీ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ప్రణయ్, అమృత కేసు విషయంలో మారుతీరావును పిలిపించి మాట్లాడారు రంగనాథ్. అయినప్పటికీ తన కుట్ర బుద్ధిని బయటపెట్టుకున్న మారుతీరావు ప్రణయ్ ని కిరాయి మనుషులతో అంతం చేయించాడు. ఈ విషయమై మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా ఎస్పీ రంగనాథ్.
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఎస్పీ రంగనాథ్ సోషల్ మీడియాపై తన అసహనాన్ని ప్రదర్శించారు. ఈ కేసులో ప్రజా ప్రతినిధులను తప్పించారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నది కదా అన్న ప్రశ్నకు రంగనాథ్ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. ‘‘ఎవడెవడో ఏదేదో రాసుకుంటే ఎలా? వాడెవడో రాసుకుంటే అదే నిజమని సమ్మితే ఎలా? అసలు విషయాలు బయటపెట్టడానికే కదా? మేము ప్రెస్ మీట్ పెట్టింది… ఎవరో ఏదో మాట్లాడితే దానికి సమాధానం చెప్పడం కష్టం’’ అంటూ చిర్రుబుర్రు లాడారు. బాధ్యతాయుతమైన ఎస్పీ పదవిలో ఉన్న వ్యక్తి ఎవడు, వాడెవడో అంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. తొలుత ఎవడు, వాడు అన్న ఎస్పీ తర్వాత వెంటనే తన గొంతు సవరించుకుని ఎవరు అంటూ మామూలు భాషలో మాట్లాడారు.
ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారని వెల్లడించారు ఎస్పీ. మారుతీరావు ఎ1 కాగా ఆయన తమ్ముడు తిరునగరి శ్రావణ్ ఎ2 అని చెప్పారు. ప్రణయ్ ని వేటకొడవలితో హత్య చేసిన బిహార్ కు చెందిన సుభాష్ శర్మ ఎ3 అని, నల్లగొండకు చెందిన అజ్గర్ అలీ ఎ 4 , రౌడీషీటర్ అబ్దుల్ బారీ ఎ5 కాగా, మిర్యాలగూడకు చెందిన కాంగ్రెస్ నేత అబ్దుల్ కరీం ఎ6, మారుతీరావు కారు డ్రైవర్ సముద్రాల శివ గౌడ్ ఎ7 గా నిర్దారించారు పోలీసులు. వీరిలో ఎ6, ఎ 7 లకు బెయిల్ వచ్చే చాన్స్ ఉందని తెలిపారు. మిగతా ఐదుగురే ప్రధాన నిందితులు అని ఎస్పీ చెప్పారు.
అయితే ఈ కేసులో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు ముందుగా వినిపించాయి. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేరు ఉందంటూ ప్రచారం సాగింది. తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం ఈ విషయంలో స్పష్టమైన ఆరోపణలు చేశారు. వేముల వీరేశం మీద ఎందుకు కేసులు నమోదు చేయడంలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకుడు కాబట్టే పోలీసులు కేసులు పెట్టడంలేదని ఆరోపించారు.
అంతేకాకుండా అమృత కూడా ఒక టివి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని ఆరోపించింది. తన తండ్రి మారుతీరావుకు బీహార్ గ్యాంగ్స్ తో సంబంధాలు లేవని చెప్పింది. ఈ విషయంలో కచ్చితంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వీరేశం పాత్ర ఉందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు అమృత.
ప్రణయ్ ని హత్య చేయాలని నిర్ణయించుకున్న తర్వాతనే మారుతీరావు అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరాడని మాదిగ హక్కుల పోరాట సమితి అధినేత మంద కృష్ణ మాదిగ కూడా స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ అధికార టిఆర్ఎస్ పార్టీ కనుసన్నల్లోనే జరిగిన హత్య అని మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ప్రణయ్ కి న్యాయం జరగాలంటే ముందు మారుతీరావును టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.
అంతేకాకుండా జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి బర్త్ డే పేరిట మారుతీరావు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయనతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈనేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి ఈ హత్యతో సంబంధం ఉందని ప్రచారం సాగింది. అయితే ఈ విషయాన్ని జిల్లా ఎస్పీని ప్రశ్నించేసరికి ఆయన తీవ్రమైన కోపం తెచ్చుకుని ‘‘వాడు, వీడు, వాడెవడో అంటూ కస్సుబుస్సులాడడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది.