Munugodu By-Poll: మునుగోడు బై పోల్: ఎడ్జ్ తెలంగాణ రాష్ట్ర సమితి వైపేనట.!

Munugodu By-Poll

Munugodu By-Poll:  ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే ఇంత హంగామా అవసరమా.? అది కూడా, ఎవరు గెలిచినా ఎమ్మెల్యే పదవిలో వుండేది ఏడాది కాలం మాత్రమేనాయె.! అయినాగానీ, మునుగోడు ఉప ఎన్నికని ‘చావో రేవో’ అన్నట్లు తీసుకున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ.!

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం మునుగోడు ఉప ఎన్నికని ఓ ‘శాంపిల్’గా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తీసుకోవడమే ఇందుకు కారణం. ఎవరు గెలిచినాసరే, మునుగోడుకు అదనంగా ఒరిగేదేమీ వుండదు. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా మునుగోడు వైపు ఏ పార్టీ కూడా చూసే అవకాశం వుండదు. అయినాగానీ, మునుగోడులో కనీ వినీ ఎరుగని రీతిలో రాజకీయ హంగామా నడుస్తోంది.

అందుకు తగ్గట్టుగానే, మునుగోడు ఉప ఎన్నికపై బెట్టింగ్ కూడా అనూహ్యమైన రీతిలో జరుగుతోందిట. వెయ్యి కోట్లకు పైనే మునుగోడు ఉప ఎన్నిక మీద బెట్టింగ్ నడిచే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు కలిసినా ఆ స్థాయిలో మునుగోడు ఉప ఎన్నిక కోసం ఖర్చు చేస్తాయో లేదో.!

ఆ సంగతి పక్కన పెడితే, మునుగోడు ఉప ఎన్నికలో గులాబీ పార్టీ విజయానికి తిరుగు లేదన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే, గులాబీ పార్టీకి గెలుపు అంత తేలిక కాదనీ.. పోటీ చాలా గట్టిగా వుండబోతోందనీ, చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ కొనసాగుతుందనీ ప్రధాన రాజకీయ పార్టీలే ఒప్పుకుంటున్న పరిస్థితి.

తక్కువలో తక్కువ 50 వేల ఓట్ల మెజార్టీ సాధిస్తామని అధికార టీఆర్ఎస్ అంటోంది. కానీ, 10 వేల ఓట్ల మెజార్టీ వస్తే అది చాలా గొప్ప విషయం అంటున్నారు. ముక్కోణపు పోటీనే గులాబీ పార్టీకి కలిసొచ్చే అంశమన్నది నిర్వివాదాంశం.