Munugode By-Poll: మునుగోడు ఉప ఎన్నికలో నైతిక గెలుపు తనదేనంటున్నారు ఓడిపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ‘బీజేపీ ఎన్ని వేషాలు వేసినా గెలిచింది మేమే’ అంటోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ‘బ్యాలెట్ పోలింగ్ పెడితే లక్ష ఓట్ల మెజార్టీతో నేనే గెలిచేవాడిని..’ అంటారు కిలారి ఆనంద్ పాల్.!
ఇంతకీ, మునుగోడు ఉప ఎన్నికలో గెలుపెవరిది.? ఇంకెవది.. గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిదే. అంటే, ఇది తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపు. దాదాపు 10 వేల ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇంతకీ, ఆయన ఎలా గెలిచారు.? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.
‘తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగు వేలు ఇచ్చింది.. బీజేపీ ఐదు వేలు ఇచ్చింది.. టీఆర్ఎస్ మళ్ళీ ఇంకో రెండు వేలు ఇచ్చింది..’ అని మునుగోడు ఓటర్ల బాహాటంగానే.. అదీ పోలింగ్ కేంద్రాల దగ్గరే మీడియా సాక్షిగా చెప్పారు. ‘రాజగోపాల్ రెడ్డి తులం బంగారం ఇస్తానన్నాడు.. ఇవ్వలేదు.. ఇప్పుడు తప్పించుకున్నాడు, మళ్ళీ ఏడాదిలోనే ఎన్నికలొస్తాయ్ కదా.. అప్పుడు చెబుతాం సంగతి..’ అంటూ మునుగోడు ఓటర్లలో కొందరు పోలింగ్ కేంద్రాల వద్దనే అల్టిమేటం జారీ చేశారు.
మునుగోడులో రాజకీయ పార్టీలు ఏం చేశాయి ఉప ఎన్నికల సమయంలో.. అన్నదానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? తాగినోళ్ళకి తాగినంత మద్యం పోశారు. అలా జరిగింది మునుగోడు ఉప ఎన్నిక. ఏం, మునుగోడులోనే ఇలా జరిగిందా.? దుబ్బాకలో జరగలేదా.? గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో జరగలేదా.? హుజూరాబాద్‌లో జరగలేదా.? అన్నిటిలోనూ జరిగేది అదే.
ఏ పార్టీ గెలిచిందన్నది కాదు ముఖ్యం.. ఏ అభ్యర్థి గెలిచాడన్నదీ ముఖ్యం కాదు.. కరెన్సీ నోటు గెలిచిందా.? ఓటు గెలిచిందా.? అన్నదే ముఖ్కం. ప్రతిసారీ కరెన్సీ నోటు గెలుస్తోంది, ఓటు ఓడిపోతూనే వుంది