టిపిసిసి ఉత్తమ్ కు కవిత సూటి ప్రశ్న

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద టిఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. టిఆర్ఎస్ కుటుంబ పార్టీ అని అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యకు టికెట్ ఎలా ఇప్పించుకున్నారని ఎంపీ కవిత ప్రశ్నించారు. నీతి, నిజాయతీ ఉంటే వెంటనే ఆయన భార్య టికెట్ ను ఉపసంహరించుకోవాలన్నారు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిందేంటన్నారు. కాంగ్రెస్ లోని నేతలే తమ కుటుంబ సభ్యుల కోసం టికెట్లు పంచుకున్నారని టిఆర్ ఎస్ కుటుంబ పార్టీ కాదని కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని ఆమె విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీలోనే సీట్ల కోసం నాయకులు కొట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నామని వారు సీట్లు పంచుకునేలోపు మనం స్వీట్లు పంచుకుంటామని కార్యకర్తలను ఉద్దేశించి కవిత అన్నారు. అన్న దమ్ములకు, భార్య భర్తలకు సీట్లు సర్దుకొవడమే సరిపోతుందన్నారు. కుటుంబ పార్టీ అని విమర్శలు చేసిన ఉత్తమ్ కు తన భార్యకు సీటు ఇచ్చేటప్పుడు, అన్న దమ్ములకు సీటు ఇచ్చేటప్పుడు కుటుంబ పార్టీ అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉత్తమ్ తన మాటలకు కట్టుబడి ఉంటే వెంటనే తన భార్య సీటును వదులుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

టిఆర్ఎస్ తెలంగాణాలో ఘన విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. తెలంగాణ పై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ చూపిస్తుందని దానిని నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరన్నారు. కాంగ్రెస్ లో సీట్ల లొల్లితో కొందరికి అన్యాయం జరిగిందని వింటున్నానన్నారు. హైదరాబద్ లోని సెటిలర్లకు పూర్తి రక్షణ కల్పించి అండగా నిలబడింది టిఆర్ఎస్సే అని కవిత అన్నారు. గల్ఫ్ బాధితులకు అండగా ఉండి వారిని ఆదుకుంది తెలంగాణ ప్రభుత్వమని కాంగ్రెస్ వారి కోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు.

కూకట్ పల్లిలో నందమూరి సుహాసిని పోటి చేసినా తమకు సమస్యే లేదన్నారు. అన్నింటిలో ఘన విజయం సాధిస్తామన్నారు. ప్రజలు తెలుగు దేశం పార్టీనే తిరస్కరించారని అసలు టిడిపి పోటినే కాదన్నారు. రాహుల్ చంద్రబాబు కలిసి ప్రచారం చేస్తే ఏం చేయాలో ప్రజలే నిర్ణయిస్తారని కవిత అన్నారు.