హరికృష్ణ మృతిపై మోత్కుపల్లి సంతాపం తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆవేదనకు లోనయ్యారు. హరికృష్ణ గురించిమాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. గతంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు ఎన్టీఆర్ సమాధి వద్దకు వెళ్లి ఏడ్చారు మళ్లీ ఇప్పుడు హరికృష్ణ మృతి చెందడంతో ఏడ్చారు మోత్కుపల్లి.
హరికృష్ణతో తనకి ఉన్న అనుబంధాన్ని మీడియా ముందు పంచుకున్నారు మోత్కుపల్లి. 1982 లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు అన్నగారిని కలవడానికి వెళితే హరికృష్ణ గారు కూడా అక్కడే ఉన్నారు. ఆనాడు నీతికి, అవినీతికి మధ్య జరిగిన పోరులో, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరులో, ఎన్టీఆర్ గారు వ్యస్థ మార్పు కోసం తలపెట్టిన యుద్ధంలో రథసారధిగా ఉన్న ఆ మహానాయకుడు హరికృష్ణ గారు. ఆరోజుల్లో ఉన్న అసౌకర్యంగా, గుంతలున్న రోడ్లపై సుమారు కొన్ని వేల కిలోమీటర్లు రధాన్ని నడిపించి అన్నగారి విజయానికి, టీడీపీ విజయానికి కారణమైన నాయకుడు హరికృష్ణ అని మోత్కుపల్లి గుర్తు చేశారు. ఒక యుద్ధం గెలవాలంటే రధసారధి ఎంతో ముఖ్యం. అటువంటి రధ సారధి హరికృష్ణ.
మేమంతా రాజకీయాల్లో ఉన్నామంటే ఎన్టీఆర్ కారణం. ఆయనకు వెన్నంటి ఉండి విజయాన్ని అందించడంలో హరికృష్ణ గారి కృషి ఎంతో ఉంది. ఉమ్మడి రాష్ట్రమంలో ఊరూరా తిరిగి ఎన్టీఆర్ ని మెప్పించగలగడం ఆయనకే సాధ్యమయింది. ఆయన ఈ వయసులో కారు నడపాల్సింది కాదు. ఆయన్ని ఏ దురదృష్టం వెంటాడిందో, ఏ మానసిక ఒత్తిడి వెంటాడిందో ఆయన మనందరినీ దుఃఖ సాగరంలో ముంచి వెళ్లిపోయారు. ఒక దళితుడిగా వారి కుటుంబం అంటే నాకు ప్రాణం. రాజకీయాల్లో ధైర్యంగా ముందుకుపోగలిగిన వ్యక్తి హరికృష్ణ అలాంటి వ్యక్తి లేకపోవటం ఎంతో బాధాకరం.
ఈమధ్య కాలంలోనే ఆయన పెద్ద కుమారుడు మరణించాడు. అదే బాధతో ఉండి ఉంటాడు. రాజకీయాల్లో కూడా ఆయనకు వెనక్కి జరిగారు. ఇవన్నీ ఆయన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసి ఉంటాయని అభిప్రాయపడ్డారు మోత్కుపల్లి. ఎన్నోసార్లు హరికృష్ణగారు నేను కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన మృతి ఎంతో బాధకు గురి చేస్తుంది అంటూ పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చేశారు మోత్కుపల్లి. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధించారు మోత్కుపల్లి.